Thursday 30 October 2014

భస్మ ప్రభావం...

(పద్మపురాణం ఆధారంగా) ::

విప్రవేషములో వచ్చిన శివుడు రఘుపతి కోరిక మీర భస్మ (విభూతి) మహాత్మ్యము గురించి తెలియజేస్తూ విభూతి మహిమను చెప్పటం బ్రహ్మతరం కూడా కాదని, నుదుట వ్రాసిన బ్రహ్మ వ్రాతలను కూడ తుడిచివేయగల శక్తి ఈ భస్మమునకున్నది అని రామునికి తెలియజేస్తాడు. విభూతిని మూడు రేఖలుగా ధరించిన ఎడల త్రిమూర్తులు మన దేహమునావహించినట్లే. నోటిలో విభూది వేసుకొనిన ఎవరినయినా తిట్టుట, తినకూడని పదార్థములను తినుట అనే నోటి పాపాలు, చేతుల మీద ధరించుట వలన మనస్సు, నాభి ప్రదేశమున ధరించుట వలన పరస్త్రీ వాంఛాది దోషములు, ప్రక్కటెముకలందు (డొక్కయందు) ధరించుటచేత పరకాంతా స్పర్శాది పాపాలను బెదిరించి దూరము చేయును.

భస్మము మీద పడుకొనిన, భక్షించిన, శరీరమునకు పూసుకొనిన, ఆయుష్షు పెరుగును. సర్ప, వృశ్చికాది విషజంతువులు కుట్టిన, కరచిన విషాన్ని హరిస్తుంది. గర్భిణీ స్త్రీలు ధరిస్తే సుఖప్రసవం జరుగుతుంది. ఇంక భూత పిశాచాది గ్రహాలను నిశ్శంకగా పారద్రోలుతుంది.

ఆవుపేడతో చేసిన పిడకలను (పేడ అచ్చులను) శతరుద్రీయ మంత్రం పలుకుతూ కాల్చి భస్మం చేసి, ఆ భస్మమును త్ర్యంబక మంత్రముతోను, సద్యోజాత మంత్రముతోను ధరించాలి. మంత్రములు రాకున్నను, ప్రణవ మంత్రోచ్చారణతో విభూతిని ధరించవచ్చు.

బ్రాహ్మణేతరులు నమశ్శివాయ మంత్రముతో ఈ భస్మాన్ని ధరించాలి.

(సంక్షిప్తంగా ఋషిపీఠం, నవంబర్ సంచికలో చెవుటూరి కుసుమా తాండవకృష్ణ గారు వ్రాసిన వ్యాసము నుంచి)

Sunday 26 October 2014

నాగుల చవితి

నాగుల చవితి కార్తీకశుద్ద చతుర్థి నాడు అంటే దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం.

మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి  చిమిలి, అరటిపళ్ళు నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.


Thursday 23 October 2014

కార్తీక మాసము - విశిష్టత...

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు.

ఉత్థాన ఏకాదశి

ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది మంచిది.ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.

కేదారేశ్వర వ్రతం

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

కార్తీక సోమవారాలు - నదీస్నానాలు

కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు  పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా  కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం  కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని  పూర్వీకులు చెబుతుంటారు.

సిద్ధిదాత్రీ దేవి...

సిద్ధిదాత్రి: (ఆశ్వీయుజ శుద్ధ నవమి)

సిద్ధగంధర్వయక్షాద్యైః అసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి… 1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5)
మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి. సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.

నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు. దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన
పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

నరక చతుర్దశి

హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు.
నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణ్భారణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.

మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇదనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది.

ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశే్చష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.
భూమాత దేవతలందరిలోనికి అత్యంత సహనశీలి. అయితే దేవతలలో అత్యంత ఉన్నతులకు కూడా అప్పుడప్పుడు పరీక్ష తప్పదు. ఆ పరీక్షల ఫలితంగా దుష్టత్వానికి, శిక్షత్వానికి మధ్యగల వ్యత్యాస సత్యం లోకానికి వెల్లడవుతుతూ ఉంటుంది. శిష్టరక్షణార్థం దుర్మార్గుడుగా తయారైన తన కుమారుడినే సంహరించవలసి వచ్చింది. అదే సమయంలో తాను నిర్యాణం చెంది దైవ సాన్నిధ్యాన్ని పొందుతూ తన వంశ ప్రాశస్థ్యాన్ని గ్రహించిన నరకుడు తన మరణానికి విచారించే బదులు ఆ మరణదినాన్ని దుర్మార్గ వర్తనపై విజయంగా భావించి మానవులు ఆనందోత్సాహాలు జరుపుకోవాలని కోరుకున్నాడు.

తన మరణంతో దైవ సాన్నిధ్యాన్ని పొందడానికి, దుష్టమైన ప్రవర్తనలు, ఆలోచనలు విడనాడి, సన్మార్గ వర్తనలు కావలసి ఉంటుందని తెలిసిన నరకుని కోసం నరక చతుర్దశినాడు దీపం వెలిగిస్తారు. ఈ రోజునే మానవుల తనువులు, మనసులు, పరివేష్టిత ప్రకృతి నిర్మాల్యమవుతాయి. శరీరాన్ని పవిత్ర గంగాదేవిని స్మరించుకుంటూ నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి పునీతులవుతారు. మనలోని అంతఃకరణ జ్యోతిని ప్రకాశింపచేయడానికి దీపాలంకరణలు చేస్తారు.

దీపావళి

మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యము ఉన్నది . వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఈ పండుగను ఆశ్వీయుజమాస బహుళ అమావాస్య రోజున జరుపుకొంటారు . దీపావళి అనగా దీపములవరుస అని అర్ధము .ఈ జరుపుకొనుట యొక్క ప్రాముఖ్యతను పురాణాలలో అనేక విధములుగా తెలియజేసారు .

విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి పధ్నాలుగు (14 ) సంవత్సరములు అరణ్యవాసము చేసి తిరిగి సీతతో కలిసి రాజ్యమునకు వచ్చిన సంధర్బమున ప్రజలు ఆనందోత్సాహాలతో దీపములనలంకరించి జరుపుకొన్న పండుగ ను దీపావళి అంటారని,

విష్ణుమూర్తి వామన అవతరుడై రాక్షస రాజు బలిచక్రవర్తి ని మూడు అడుగుల నేలను అడిగి అతనిని పాతాళమునకు అనిచివేసినందుకు దేవతలు, నరులు అనందించి జరుపుకున్న పండుగ అని ,

ద్వాపరయుగమందు నరకాసురుడనే రాక్షసుని శ్రీ కృష్ణుడు తన భార్య సత్యబామతో కలిసి సంహరించినందుకు ప్రజలు ఆనందంతో ప్రతి యింటిని దీపములతో అలంకరించి జరుపుకున్న పండుగ అని అంటారు. దీపావళి రోజున ఇంటిలో ని పిన్నలు ,పెద్దలు తలస్నానమాచరించి ,ఇల్లు శుభ్రము చేసి ,ఇంటిని కొత్త సున్నముతో ను,రంగులతోను అలంకరించి ,ముగ్గులు పె ట్టి,నూతన వస్రములను ధరించి ,ఇంటి నిండా దీపములతో అలంకరించెదరు. కొందరు లక్ష్మీ పూజను జరుపుతారు .

దీపావళి పండుగను దీపోత్సవము అనికూడా అంటారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దీపావళి రోజున శివ సహితముగా కాళీ పూజలు ప్రత్యేకముగా నిర్వహిస్తారు . ఈ పండుగనాడు అమావాస్య చీకట్లు తొలగిపోవుటకు కాకరపువ్వొత్తులు , టపాకాయలు ,చిచ్చుబుడ్లు ,మతాబులు ,మొదలగునవి కాల్చి పండుగగా జరిపి ఆనందిస్తారు.

నరకాసురుడు దేవతలను ,నరులను బహు కష్టములపాలు చేసి భగవంతుడైన శ్రీక్రుష్ణునే వ్యతిరేకించాడు. 16 000 మంది స్త్రీలను చెరసాలలో బంధించి ఉంచగా శ్రీకృష్ణుడు యుద్దము చేసి సత్యభామచే నరకాసురిని సంహరింపజేసాడు. ఎందువల్లననగా విష్ణుమూర్తి యొక్క వరహావతార సమయమున భూదేవికి ,విష్ణువుకు జన్మించినవాడు నరకాసురుడు.ఇతనికి తల్లి చేతిలో తప్ప మరో విధముగా చావులేదనే వరమున్నది. అందువల్ల శ్రీ కృష్ణుడు సత్యభామచే ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురవధ జరిపి మాతృభూమిని ఉద్దరించాడు . ఈ దీపావళిని నరకాసురవధ జరిగిన తరువాత ప్రజలు ఆనందించి జరుపుకున్న పండుగగా చెబుతారు .ఆనాటి నరకాసురుని రాజధాని ప్రస్తుత అస్సాం రాష్ట్రంలోని ప్రాగ్జోతిషపురము. శ్రీకృష్ణుని ద్వారకానగరము ఈనాటి గుజరాత్ రాష్ట్రములోని ద్వారక.

జైనులు మహావీరుడు నిర్యాణం పొందిన రోజును దీపావళిగా జరుపుకొంటారు.స్వామి దయానంద సరస్వతి హిందూ ఆధ్యాత్మికత యొక్క గొప్పదనమును చాటుటకు అమావాస్య రోజునే సన్యాసము స్వీకరించుట జరిగినది. స్వామి రామతీర్థ కూడా పశ్చిమ దేశాలలో ఆధ్యాత్మికతను ,హిందు ధర్మాన్ని అందజేశారు.

Thursday 2 October 2014

మహాగౌరీ దేవి....

మహాగౌరి: (ఆశ్వీయుజ శుద్ధ అష్టమి)

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది. ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. "వ్రియేహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్" (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ ।
బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥

కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

మహాగౌరీమాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాలనుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.

Wednesday 1 October 2014

శ్రీ కాళరాత్రీ దేవి....

కాళరాత్రి: (ఆశ్వీయుజ శుద్ధ సప్తమి)

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా ।
వరమూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ॥

దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.

కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు. దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి
మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.

కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూత ప్రేత పిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ  ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.

కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం ఇహపర ఫల సాధకం.

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...