Tuesday 30 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 20:

13. పదమూడవ గురువు - సముద్రం:

సముద్రం నిశ్చలంగా ఉంటుంది. కేవలం ప్రకృతి ప్రకోపించినప్పుడు తప్పించి అది సంవత్సరంలో ఎక్కవ సమయం ప్రశాంతంగానే ఉంటుంది. బాగా వర్షాలు పడి నదుల్లోని ఎక్కువగా నీరు చేరినా లేదా కరువు కోరల్లో చిక్కి నదులు ఎండినా సముద్రాల్లో నీరు పెరగదు, తరగదు.

అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు సంభవించినా కానీ మహాత్ములు చలించరు. ఎందుకంటే వారు ఎప్పుడూ బ్రహ్మానందంలోనే ఉంటారు. అలాంటి నిశ్చలతను అలవరచుకోవాలంటాడు దత్తాత్రేయుడు. అలాగే మహాత్ముల యొక్క ఙ్ఞానాన్ని కూడా పరీక్షించలేము. ఎందుకంటే సముద్రంలో దాగిన ముత్యాలు మనకు చూడగానే కనిపిస్తాయా ? ఓపికతో వెతికితే గానీ కనిపించవు. అలాగే మహాత్ముల సాంగత్యం ఫలం చేత వారి మనఃఙ్ఞానాన్ని మనం తెలుసుకోగలము.

14. పద్నాలగవ గురువు - మిణుగురు పురుగు:

మిణుగురు పురుగు అగ్నిచేత ఆకర్షించబడి దాని చుట్టూనే తిరుగుతూంటుంది. అలా తిరుగుతూ నే అది ఒకానొక క్షణంలో దానిలోనే పడి అగ్నికి ఆహుతైపోతుంది.

అలాగే మూర్ఖుడైన మనిషి కూడా ప్రాపంచిక విషయాలకు మరియు ఐహిక సుఖాలకు లోలుడై పరమాత్మను చేరలేక జననమరణ చక్రాలలో తిరుగాడుతూనే ఉంటాడు. ఎన్నటికీ మోక్షకారకమైన పరమపదాన్ని చేరుకోలేడు.

అందుకే మనిషి కూడా తన కోరకలు, వాంఛలు మరియు ఇంద్రియాలపైన నిగ్రహము పెంచుకోవాలి..... ( ఇంకా వుంది )

శ్రీ దత్తాత్రేయ వైభవం - 19:

మనిషి ఎప్పటివరకైతే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడతాడో అప్పటి వరకు తాను సుఖపడడు సరికదా తన చుట్టూ ఉన్నవారికి కష్టాలు, దుఃఖాలు తెచ్చిపెడతాడు. ఎప్పటివరకైతే ప్రాపంచిక వస్తువుల వెనుక పరిగెత్తుతాడో అప్పటివరకు తాను సుఖపడడు. ఎప్పుడైతే తాను ఆ విషయాలపై వ్యామోహాన్ని వదిలిపెడో అప్పుడే పరమపదాన్ని చేరుకోవడంలో ముందుకు సాగుతాడు.

మనం చూసిన కథలో ఎంతవరకైతే రాబందు తన దగ్గర మాంసం ముక్క ఉంచుకుందో అప్పటివరకు తాను ఆ గద్దల చేత వెంటాడబడింది. కానీ ఆ మాంసపు ముక్కని వదిలిపెట్టిన క్షణాన అది రక్షింపబడింది. అలాగే మనిషి కూడా ఎంతవరకైతే తాను ప్రాపంచిక వస్తువిషయాలపై మక్కువ పెంచుకుంటాడో అప్పటివరకు తాను ఈ భవసాగరంలో మునుగితేలుతూనే ఉంటాడు. కానీ వాటిపై వ్యామోహం వదలగానే అమితమైన ప్రశాంతతను పొంది పరమాత్మను చేరడంలో ముందుకు సాగిపోతాడు.

జీవి తను పరమాత్మను చేరడంలో కూడా పరమాత్మ సాయాన్నే అర్థించాలి. ఆయన కృపలేనిదే ఆయనను చేరడం అసంభవం. భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణుడితో " పరంధామా! ఈ భవసాగరంలో మునిగితేలుతూ  వీటిపై ఆసక్తి పెంచుకున్న మేము నిన్ను ఎలా చేరుకుంటామయ్యా! ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ మనిషి జన్మ ఎత్తలేము. ఎత్తినా నిన్ను చేరటంలో కొంతమాత్రమే ముందుకుపోగలుగుతాం. నిన్ను చేరాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి తండ్రి? కాస్త దయ చూపించవయ్యా!! " అని ఆర్తితో వేడుకుంది.

అప్పుడు కృష్ణుడు కుంతీదేవితో " అమ్మా కుంతీదేవి! బాధపడకు. నన్ను చేరటానికి ఎందుకంత శ్రమ? భక్తితో పిలిచే ఒక్క పిలుపు చాలు! నేను మీకు వశుడనైపోతాను. సాధ్వీ! భక్తి ఉంటే నన్ను చేరటంలో నేనే మీకు సహాయపడతాను. వేరే ఏ శక్తి అవసరం లేదు. కేవలం భక్తి ముఖ్యం " అని సెలవిస్తాడు. కానీ మనకు కనీసం ఒక్క క్షణమైనా భక్తితో పరమాత్మపై దృష్టి కేంద్రీకరించడం కష్టతరమైన విషయంగా మారిపోయింది.

మనం రోజూ చదివే స్తోత్రాలవలన దేవుడు మనకు వశుడైపోతాడనుకోవడం కన్నా  మూర్ఖత్వం ఉండదు. ఆ స్తోత్రాలు చదివేటప్పుడు భక్తి ఇంకా ఆర్తి ముఖ్యం. అంతేగానీ పొగడ్తలకు లొంగేవాడు పరమాత్ముడెందుకవుతాడు? స్తోత్రం చదివితే చదివిన ఫలం లభిస్తుందేమో గానీ పరమాత్మ లొంగుతాడా? పరమాత్మ లొంగేది కేవలం భక్తికి, ఆర్తికి మరియు మనకు ఆయన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వలన మాత్రమే..... ( ఇంకా వుంది )

Sunday 28 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 18:

11. పదకొండ గురువు - ఎలుగుబంటి:

తేనెటీగలు తాము సేకరించిన తేనెను భద్ర వరచుకుంటాయి. కానీ ఆ తేనెని ఎప్పుడు కూడా తినవు, అసలు ఇతరులకు వాడే ప్రయత్నమే చయవు. అలా దాచిన తేనెని అడవి ఎలుగుబంట్లు తింటాయి.

యోగి అనే వాడు ఎప్పుడూ ఏదీ దాచుకునే ప్రయత్నం చేయకూడదు. తరువాతి క్షణానికి కూడా ఏదీ దాచుకోకూడదంటాడు దత్తుడు. తినడానికి నోరుని, తిన్న అన్నాన్ని భద్రపరచుటకు కడుపును మాత్రం ఉపయోగించాలి.. అలా కాకుంటే వస్తువుల మీద వ్యామోహం పుడుతుందేమో అని దీనిలో అంతరార్థం. యోగి పిసినారి వాడై ఉండకూడదు.

పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోని మనం, పోయే ముందు కూడా ఏమీ తీసుకెళ్ళం. అందుకే వస్తువ్యామోహం వద్దంటాడు దత్తాత్రేయుడు. ఎలాగైతే తేనె లేనిదే తేనెటీగలకు గుర్తింపు లేదో, ఆత్మ లేనిదే శరీరానికి కూడా గుర్తింపు ఉండదు. సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ఎలుగుబంటి తేనెని తీసుకెళ్తుందో, అలాగే మరణ కాలం వచ్చినప్పుడు యముడు కూడా మనని తీసుకెళ్తాడు.

అప్పుడు మనతో పాటు మనం ఏమీ తీసుకెళ్ళలేం. చచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువును తీసుకెళ్ళిన మనిషి ఎవడైనా ఉన్నాడా? అందుకే వస్తువ్యామోహం తగ్గించి పరమాత్మ పైన ప్రేమను పెంచుకోవాలంటాడు దత్తాత్రేయుడు.

12. పన్నెండవ గురువు - రాబందు:

దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో ఒక రాడందు చనిపోయిన పశుపక్షాదుల శవాలపై ఆధారపడి జీవిస్తూండేది. ఒకనాడు యథా ప్రకారం ఒక పశువు యొక్క శవంలోని మాంసం కొంత తిని, మరికొంత తన నోట కరచుకొని తన గూటిపైపుకు ప్రయాణించ సాగింది.

కానీ అది ప్రయాణిస్తున్న మార్గంలో బాగా ఆకలిగా ఉన్న గ్రద్దలు మాంసపు ముక్కను పట్టుకెళుతున్న ఈ రాబందును చూశాయి. వెంటనే ఆ మాంసపు ముక్క కోసం ఈ రాబందుపై దాడి చేశాయి. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేక ఆ రాబందు ఆ మాంసపు ముక్కను విదిలేసింది. ఆ గ్రద్దలు ఆ మాంసపు ముక్కపై పడి తమ ఆకలిని తీర్చుకున్నాయి.  మాంసపు ముక్క వదిలాక గానీ రాబందు తప్పించుకొని తనను తాను కాపాడుకోగలిగింది.... ( ఇంకా వుంది )

Saturday 27 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 17:

ఒక్కోసారి మనిషి పుట్టుకతో ఙ్ఞానిగా జన్మించినా పరమాత్మను చేరే మార్గంలో వైక్లబ్యమును పొంది ఆ మార్గం నుండి ప్రక్కకు మరలుతాడు. కానీ అప్పుడు సద్గురువు లేదా ఆ పరమాత్మనే ఆశ్రయించి మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలి.

9. తొమ్మిదవ గురువు - కొండచిలువ:

కొండ చిలువ తనకు ఎదురుగా ఏది వచ్చినా దానిని మింగేస్తుంది. అది మంచిదో, కాదో, చేదుగా ఉందా, తియ్యగా ఉందా అసలు తినవచ్చో, తినకూడదో అని కూడా చూడదు.

అలాగే మనిషి కూడా తన జీవితంలో వచ్చిన సుఖదుఃఖాలు, లాభనష్టాలు లాంటి ద్వంద్వాలు ఎన్ని వచ్చినా చలించక సమానంగా స్వీకరించాలంటాడు దత్తాత్రేయుడు.

10. పదవ గురువు - తేనెటీగ:

తేనటీగ పువ్వుల నుండి ప్రతి రోజూ తేనెను సేకరిస్తుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియలో అది పువ్వులకు ఎటువంటి హాని కలిగించకుండా తన పని తాను చేసుకుపోతుంది.

అలాగే మహాత్ముడు లేదా ఋషి కూడా ఆన్ని గ్రంథాల నుండి ఙ్ఞానాన్ని సంపాదించాలి. ఇల్లిల్లూ  తిరిగి భిక్ష స్వీకరిస్తున్నప్పుడు గృహస్థులను ఇబ్బందులకు గురిచేయకూడదంటాడు దత్తుడు. ఙ్ఞాని తేనెటీగ లాగా పిసినారి వాడై ఉండకూడదు..... ( ఇంకా వుంది ).

శ్రీ దత్తాత్రేయ వైభవం - 16:

7. ఏడవ గురువు - సూర్యుడు:

సూర్యుడి ప్రతిబింబం ఎన్ని పదార్థాల్లో కనిపించినా సూర్యుడు మాత్రం ఒక్కడే. అలాగే పరమాత్మ కూడా ఎన్ని రూపాల్లో కనిపించినా పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇలా సూర్యుడి నుండి చాలా విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.

సూర్యుడు తన వేడిమితో సముద్రాలలో ఉన్న నీటిని ఆవిరి చేసి వర్షం రూపంలో మళ్ళీ ఆ నీటిని భూమికి చేరేటట్టు చేస్తాడు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో సూర్యుడు ప్రత్యక్షంగా నీటిని అంటడు కదా. అలాగే మహాత్ములు కూడా మన నుండి ప్రాపంచిక పదార్థాలు స్వీకరించినా. వాటిపై మోజు పెంచుకోక మరల వాటిని ఏదో రూపకంగా మనకే ఇచ్చివేస్తారు.

8. ఎనమిదవ గురువు - పావురం:

దీనికి సంబంధించిన విచిత్రమైన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో పావురాల జంట నివసిస్తూ ఉండేది. వాటికి కొంత కాలం తరువాత సంతానంగా రెండు పావురాలు జన్నించాయి.  శైశవ దశలో ఉన్న ఆ పావురాల కోసమని ప్రతిరోజూ ఈ పావురాల జంట ఆహారం తీసుకొని వచ్చేవి.

అలా ఒకనాడు పిల్లల కోసం ఆహారం తేవడానికి వెళ్ళిన పావురాల జంట తిరిగి వచ్చెసరికి తమ సంతానం వేటగాడి వలలో ఉండడం చూసి చాలా దుఃఖించాయి. ప్రాణప్రదంగా పెంచుకున్న వాటిని వీడి ఉండలేక ఆ పావురాల జంట కూడా అదే వలలో పడి వేటగాడికి ఆహారంగా మారాయి.

మనిషి కూడా ప్రాపంచిక విషయాలపై బాగా  ఆసక్తి పెంచుకొని పరమాత్ముని మార్గం నుండి వైక్లబ్యమును పొందుతారు. మోక్ష మార్గాన్ని విడిచి ఐహిక విషయసుఖాలకై ప్రాకులాడతారు. పుత్రులు, మిత్రులు, భార్య , బంధువులే కాకుండా పరమాత్మ అనేవాడు ఒకడున్నాడనే ధ్యాస కూడా ఉండకుండా ప్రాపంచిక సుఖాలలో మునిగితేలుతూంటాడు. ఆ పావురాల జంట లాగా మనిషి మూర్ఖంగా ప్రవర్తించ కూడదని హితవు పలుకుతాడు దత్తాత్రేయుడు.... ( ఇంకా వుంది )

Thursday 25 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 15:

ఎలాగైతే నీరు ఎలాంటి అహం భావము లేకుండా జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరి దాహార్తిని తీరుస్తుందో అలాగే ఙ్ఞాని కూడా కుల, మత, జాతి, వర్ణ బేధాలు విడిచిపెట్టి అందరికీ సమానంగా ఙ్ఞానాన్ని పంచాలి. అందుకే ఙ్ఞాని సమత్వ బుద్ధి కలిగి అందరిలో ఙ్ఞాన దీపాలను వెలిగించాలి.

5. ఐదవ గురువు - అగ్ని:

అగ్ని సమస్తాన్ని కబళించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన ఙ్ఞానాన్ని నేర్చుకోవాలి కానీ మనం అపవిత్రులం కాకూడదు. అగ్ని నుండి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.

ఙ్ఞాని కూడా అగ్నిలా పవిత్రుడు.  ఎలాంటి కల్మషమూ లేని వాడు. ఙ్ఞాని అరిషడ్వర్గాలకు అతీతుడు.

6. ఆరవ గురువు - చంద్రుడు:

చంద్రుడు కృష్ణ పక్షంలో తన కళలు క్షీణిస్తున్నా చల్లటి వెన్నెల వెలుగును ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఙ్ఞాని కూడా తనకు ఏం జరిగుతున్నా ఇతరులకు మంచి చేసే ప్రయత్నమే చేస్తాడు. మహాత్ములు కూడా గుణంలో చాలా చల్లనివారు.

చంద్రుడు శుక్ల పక్ష, కృష్ణ పక్షాల్లో పెరిగుతూ , క్షీణిస్తున్నా తన అసలు గుణ స్వరూపాలలో మార్పు చెందడు. అలాగే మహాత్ములు కూడా వారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వారి యొక్క సహజ గుణంలో, స్వభావంలో మార్పును రానివ్వరు... ( ఇంకా వుంది )

శ్రీ దత్తాత్రేయ వైభవం - 14:

3. మూడవ గురువు - ఆకాశం:

విశ్వమునంతా కప్పి ఉంచే ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశాన్ని మబ్బులు కమ్మి దాన్ని కనబడకుండా చేస్తాయి. అయినా ఆకాశం ఆ మబ్బుల చేత ప్రభావంఏ కాదు. తన స్థితిని తాను విడచిపెట్టదు. అలాగే ఆత్మకూడా ఈ ప్రాపంచిక విషయాల చేత కప్పబడినా తన అసలు స్థితిని మరవకూడదని దత్తాత్రేయ స్వామి అంటారు.

ఆకాశం విశ్వంలో ప్రతి చోట వ్యాపించి ఉంది. దానికి కనపడని వస్తువూ, విషయమూ లేదు. అలాగే పరమాత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన చూడని విషయమూ, ఆయనకు తెలియని విషయమంటూ లేదు.

ఆకాశం మనకు నీలి రంగులో కనిపించినా, అసలు ఆకాశానికి రంగేలేదు. అలాగే పరమాత్మ ఒక రూపంలో మనకు కనబడ్డా రూపరహితుడు ఆ పరమాత్మ. ఎలాగైతే ఆకాశంలో ఎలాంటి పదార్థం ఉండకుండా పూర్తి ఖాళీగా ఉంటుందో, అలాగే ఒక ఙ్ఞాని తన ప్రవచనాలలో కూడా ఎలాంటి భావాలను ఉంచుకోకూడదని అంటాడు దత్తుడు.

4. నాలుగవ గురువు - జలము:

ఋషి లేదా ఙ్ఞాని జలము లాంటి వాడు. ఙ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు కలవాడు. నీరులాగా కోమలమైన గుణం కలిగి, ఎలాగైతే నీరు సరిగా ప్రవహిస్తున్నప్పుడు మంచి మంచి శబ్దాలు చేస్తుందో అలాగే ఙ్ఞాని కూడా తన నోటి ఎన్నో మంచి మాటల ధారలను ప్రవహింపజేస్తాడు.

ఎలాగైతే నీటిలోని మురికి బట్టలు  కాసేపటికి శుభ్రమవుతాయో అలాగే మలినమైన మనస్సు గల మనం మహాత్ముల ( ఙ్ఞానుల ) సాంగత్యం కలగగానే మన మనసులు నిర్మలమవుతాయి.... ( ఇంకా వుంది )

Monday 22 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 13:

1. మొదటి గురువు - భూమి :

దత్తాత్రేయుడు తాను భూదేవి నుండి ఓర్పు వహించడం, కర్తవ్య నిర్వహణా ధర్మం, కార్య నిర్వహణలో ఎన్ని కష్టానష్టాలు వచ్చిన ఓర్చుకోని నిలబడడం, తన ధర్మం తాను తప్పకపోవడం లాంటి ఎన్ని విషయాలనో తాను గ్రహించానంటాడు జగద్గురువైన దత్తాత్రేయుడు.
భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది. మానవుడు దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేదే భూమాత.

మనం ఎన్నో తప్పులు చేసి భూదేవిలో భాగమైన ఈ ప్రకృతి నడిచే సక్రమమైన వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఉత్పాతాలు సృష్టించినా ఉపేక్షించి, కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి తన కడుపులో దాచుకున్నట్టు, ఓర్పుతో మనని ఉద్ధిరించే ప్రయత్నం చేస్తుంది తల్లి భూదేవి. ఇంకా భూదేవి నుండి నేర్చుకోవాల్సిన గుణం క్షమా గుణం

భూమిపై ఉండే పర్వతాలు మరియు వృక్షాల లాగా ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్చుకోవలంటాడు దత్తాత్రేయుడు.

2. రెండవ గురువు - వాయువు:

గాలి మనకు ప్రవిత్రత, వాసన లేని గుణం అంటే ఎలాంటి విపరీత భావాలూ లేకపోవడం మరియు అందరిలో తొందరగా కలిసిపోవడం లాంటి ఎన్నో గుణాలు నేర్పుతుంది. గాలి అన్నిటితో కలిసినా తన సహజలక్షణాన్ని ఎలాగైతం కోల్పోదో మనిషి కూడా అలాగే మనం కూడా ఎంతమందితో కలిసినా మన సహజ లక్షణాన్ని కోల్పోకూడదు.

ఎలాగైతే గాలి అదుపు తప్పి అతివేగంతో వీచి ప్రకృతిలో మహా విధ్వంసం సృష్టిస్తుందో అలాగే అదుపు లేని మనస్సు కూడా అలాగే ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తుంది, అలాంటి మనస్సుని పరమాత్మ వైపు మరల్చడం చాలా కష్టం. అందుకే మన మనస్సుని సాధ్యమైనంత వరకు మన అదుపులో పెట్టుకొని పరమాత్మ వైపు నడిపించే ప్రయత్నం చేయాలి.... ( ఇంకా వుంది)

Sunday 21 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 12:

జగత్తుకూ, ప్రకృతికీ తానే గురువైనా మనందరిలో ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24  తత్త్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు అవి...

1) ఆకాశం
2) భూమి
3) అగ్ని
4) జలం
5) వాయువు
6) సూర్యుడు
7) చంద్రుడు
8) పావురం
9) కొండ చిలువ
10) తేనెటీగ
11) భ్రమరం ( తుమ్మెద )
12) సముద్రం
13) రాబందు
14) సాలీడు
15) ఏనుగు
16) జింక
17) చేప
18) పసి పిల్లవాడు
19) కన్య
20) పాము
21) లోహపు పనివాడు
22) ఎలుగుబంటి
23) వేశ్య
24) చిమ్మట

ఇవన్నీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , పంచ తన్మాత్రలు, మిగిలిన నాలుగు మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలు. ఆ ఙ్ఞానమూర్తి అవ్యక్త రూపంలో వీటన్నిటిలో ఉన్నట్టుగా చెప్తారు.

ఈ ప్రకృతి తత్త్వాలను దత్తాత్రేయుడు ఎలా గురువుగా  స్వీకరించాడో రేపటి  నుండి తెలుసుకుందాం... ( ఇంకా వుంది )

Saturday 20 June 2015

శ్రీ విఘ్నరాజం భజే...

రచన: ఊత్తుకాడు వేంకటసుబ్బయ్యార్
తాళం: ఖండ చాపు
రాగం: గంభీర నాట

పల్లవి:
శ్రీ విఘ్నరాజం భజే భజేహం భజేహం
భజేహం భజే  తమిహ ॥ శ్రీ విఘ్న ॥

అనుపల్లవి:
సంతతమహం కుంజరముఖం శంకరసుతం
శాంకరి సుతం తమిహ
సంతతమహం దంతి కుంజర ముఖం
అంధకాంతక సుతం తమిహ ॥ శ్రీ విఘ్న ॥

చరణములు:
సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప
తప సమాధి సుఖ వరదానుకూలం
భావిత సుర ముని గణ భక్త పరిపాలం
భయంకర విషంగ మాతంగ కుల కాలం ॥ 1 ॥

కనక కేయూర హారావళీ కలిత గంభీర గౌర గిరి శోభం స్వశోభం
కామాది భయ భరిత మూఢ మద కలి కలుష ఖండితమఖండప్రతాపం
సనక శుక నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం
సత్యపరమబ్జనయనం ప్రముఖ ముక్తికర తత్త్వమసి నిత్యనిగమాది స్వరూపం ॥ 2 ॥

శ్రీ దత్తాత్రేయ వైభవం - 11:

కారంజ క్షేత్రం మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఉన్నది. మనకు స్కంద పూరాణంలోని పాతాళ ఖండంలో ఈ క్షేత్ర వర్ణన కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో కారంజ మహర్షి ఉండేవారు. కారంజ వనంలో ఉండడం చేత పతంజలి మహర్షికి ఈ పేరు వచ్చింది. వశిష్ఠ మహర్షి శిష్యుడైన శ్రీ పతింజలి తన కుటీరంతో శిష్యగణంతో సహా ఉండేవారు.

ఈ కారంజ వనంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉండడం చేత గంగామాతకై మహర్షి ప్రార్థన చేయగా సంతసించిన రేణుకా దేవి అన్ని పవిత్ర నదుల నీటితో పావనమైన ఒక కుండాన్ని సృష్టించింది. ఈ కుండమే 'ఋషి తాలావ్' గా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడ ప్రసిద్ధ 'బేంబ్లా' నది కూడా ఉద్భివిస్తుంది. జైనులకు కూడా ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది.

ఇక తరువాతి ప్రసిద్ధ దత్త క్షేత్రం గాణుగాపురం. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్ పూర్ తాలూకాలో ఉంది గాణుగాపురం. భీమా మరియు అమ్రజా నదుల ప్రవిత్ర సంగమ స్థలి అయిన ఈ క్షేత్రంలో స్వామివారి పాదుకలున్నాయి. అక్కడి నిర్గుణ మఠంలో ఉన్న ఈ పాదుకలను నిర్గుణ పాదుకలు అని కూడా అంటారు. ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం గురించి శ్రీ గురు చరిత్రలోని 49వ అధ్యాయంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

స్వామి వారు చెప్పినట్టుగానే ఇక్కడ మధ్యాహ్న భిక్షకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా కనీసం ఐదు ఇళ్ళలో మధ్యాహ్న భిక్ష స్వీకరించడం పరిపాటిగా మారింది. ఈ విషయాన్ని మనం శ్రీ గురుచరిత్రలోని 21 - 22 అధ్యాయాలలో తప్పక గమనించవచ్చు.....

గురుమధ్యే స్థిత౦ విశ్వ౦ విశ్వ మధ్యే స్థితో గురుః।  గురుర్విశ్వ౦ నచాన్యోస్తితస్మై శ్రీగురవే నమః॥

దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24 తత్త్వాలను తన గురువుగా స్వీకరించారు. వాటి తత్త్వ విచారాల గురించి రేపటి నుండి తెలుసుకుందాం......( ఇంకా వుంది )

Friday 19 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 10:


శ్రీ స్వామివారి జీవిత విశేషాలను తెలుపుతూ  ప్రధాన శిష్యగణంలోని శ్రీసిద్ధ సరస్వతి స్వామివారు సంస్కృతంలో 'గురు చరిత్ర' గా పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్నే శ్రీ గంగాధర్ సరస్వతి గారు మరాఠీలోకి అనువదించారు. ఇది నిత్యపారాయణ గ్రంథం. గురు చరిత్ర గ్రంథరాజాన్ని తెలుగులో ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అనువదించారు.

స్వామివారి అవతార సమాప్తి కూడా చాలా విచిత్రంగా జరిగింది. స్వామి వారు గాణుగాపురాన్ని వదిలి తన ఏడుగురు శిష్యులతో సహా భీమా మరియు ఆమ్రజా నదుల సంగమ స్థలికి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ అశ్వథ్ధ వృక్షాన్ని చూపిస్తూ స్వామివారు " ఈ వృక్షాన్ని భక్తితో పూజించి తపమాచరించండి, మీ కోరికలన్నీ తీరుతాయి, మీ జీవన్ముక్తి మార్గమౌతుంది " అని అన్నారు. తరువాత తన అవతార పరిసమాప్తి గురించి స్వామివారు తన శిష్యులకు వివరించారు.

బాధాతప్త హృదయాలతో శిష్యులు స్వామి వారికి అరటి ఆకులతో చిన్న తెప్పను తయారుచేసి దానిని పూలతో అలంకరించి, దాన్ని నదిలో ఉంచారు.... ఆ అరిటి తెప్పను అధిష్టించిన స్వామి తన చివరి ఆశ్వీర్వాదంగా గ్రామ ప్రజలను సంబోధించారు. శ్రీ స్వామి అక్కడి వారిని ఉత్సాహపరుస్తూ ఇలా అన్నారు " నేను ఈ తెప్ప మీద శ్రీశైలానికి దగ్గరలోని కదళీ వనానికి వెళుతున్నాను. నేను అక్కడ క్షేమంగా చేరాను అనడానికి చిహ్నంగా, ఈ నదీప్రవాహానికి ఎదురుగా పూలు తేలుతూ  కనిపిస్తాయి ".

స్వామివారు వెళ్ళే సమయానికి గ్రామ ప్రజలు అందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ స్వామివారిని సిద్ధంగా లేకపోవడంతో వారికి ధైర్యం చెబుతూ  స్వామి " బాధపడకండి! నేను నా భక్తులను విడిచి ఎక్కడికీ వెళ్ళను. భౌతికంగా కదళీ వనంలో ఉన్నా, నా స్వరూపం ఇక్కడే తిరుగాడుతూ  ఉంటుంది. నేను ప్రతీ రోజూ మధ్యాహ్నం మీ అందరి నుండే భిక్షను స్వీకరిస్తాను. ఇక్కడి నదిలో స్నానం చేసి, ఈ వృక్షాన్ని పూజించిన, నా పాదుకా దర్శనం చేసిన వారిని నేను తప్పక అనుగ్రహిస్తాను.

నిజంగానే స్వామి వారు శ్రీశైలం  చేరగానే అక్కడి నదిలో ప్రవాహానికి వ్యతిరేక దిశలో పూలు తేలిపైకి రావడం ప్రారంభమైంది.  ఇలా స్వామివారు తమ అంతిమ సమయంలో కూడా లీలావిశేషాలను చూపి అక్కడి వారిని అనుగ్రహించారు...... ( ఇంకా వుంది )

Thursday 18 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 9:

కాశీకి చేరుకున్న నృసింహ సరస్వతి అక్కడ వివిధ దేవాలయాలను దర్శించిన పిమ్మట శ్రీకృష్ణ సరస్వతి స్వామిని తన గురువుగా స్వీకరించారు. తరువాత 1388వ సంవత్సరంలో సన్యాసాన్ని స్వీకరించారు. గురువైన కృష్ణ సరస్వతి స్వామి నరహరికి సన్యాసాశ్రమ నామంగా 'శ్రీ నృసింహ సరస్వతి' అని పేరు ఉంచారు.

సన్యాసము స్వీకరించిన తరువాత వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించటానికి బయలుదేరారు స్వామి. అలా చాలా క్షేత్రాలు తిరిగి, 1416వ సంవత్సరంలో తిరిగి కారంజకు చేరుకున్నారు. అక్కడ తన పూర్వాశ్రమ తల్లీదండ్రులను కలిసి, మళ్ళీ 1418వ సంవత్సరం నుండి గోదావరి తీర ప్రాంత క్షేత్రదర్శనం ప్రారంభించారు. అలా 1420వ సంవత్సరంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన పర్లీ వైద్యనాథ్ కు చరుకున్నారు.

అక్కడ ఒక సంవత్సరం పాటు నివసించి. మళ్ళీ 1421వ సంవత్సరంలో ఔదుంబర క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ కూడా ఒక సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ నుండి 1422వ సంవత్సరంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరాపూరుకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు సంవత్సరాల పాటు అనగా 1434వ సంవత్సరం వరకు ఉన్నారు. స్వామివారు అక్కడ చాలా కాలం ఉండడం చేత ఆ ప్రాంతానికి 'నరసిహవాడి' అని పేరు వచ్చింది. అదే కాలాంతరంలో 'నర్సోబావాడి'గా మారిపోయింది.

అక్కడ నుండి మళ్ళీ కర్ణాటకలోని గాణుగాపురానికి చేరుకున్నారు అక్కడ ఇరవైనాలుగు సంవత్సరాల పాటు అనగా 1458వ సంవత్సరం వరకు నివసించారు. ఈ క్రమంలోనే స్వామివారికి ప్రధాన శిష్యగణం తయారవడం విశేషం. వారే శ్రీమాధవ సర్వతి, శ్రీబాల సరస్వతి, శ్రీఉపేంద్ర సరస్వతి, శ్రీసదానంద సరస్వతి, శ్రీకృష్ణ సరస్వతి, శ్రీ సిద్ధ సరస్వతి, శ్రీ ధ్యానజ్యోతి సరస్వతి.... ( ఇంకా వుంది)

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...