Saturday 30 May 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 6:

అది గమనించిన శ్రీపాదుల వారు త్రిశూల ధారియై ఆ బందిపోట్లందరినీ తన త్రిశూలంతో సంహరించాడు. కానీ అందులో ఒక దొంగ శరణువేడడంతో వాడిని రక్షించి, వల్లభేషుడి తలను తిరిగి మొండానికి అతికించి ఆయనకు తిరిగి #ప్రాణం పోశారు శ్రీపాద వల్లభులు. తరువాత వల్లభేషుడు శ్రీపాదుల వారిని భక్తితో పూజించి, తిరిగి కురవాపురం చేరుకొని తన మొక్కును చెల్లించుకున్నాడు.

ఇలా శ్రీపాద వల్లభుల వారి లీలా విశేషాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పిఠాపురం వారిచే ప్రచురించబడ్డ స్వామివారి జీవిత చరిత్ర అయిన " శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం " అనే నిత్యపారాయణ గ్రంథంలో మనం ఎన్నో #లీలా విశేషాలు చూడవచ్చు. శ్రీపాద వల్లభుల వారిని కీర్తిస్తూ రాయబడిన సుప్రసిద్ధ " శ్రీ సిద్ధ మంగళ స్తోత్రం " ను చూద్దాం.....

శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 1

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 2

మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 3

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 4

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 5

దో చౌపాతీ దేవ్లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 6

పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 7

సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 8

పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ - 9

ఈ స్తోత్రాన్ని ప్రతీరోజు పఠించి స్వామి కృపకు పాత్రులమవుదాం...... ( ఇంకా వుంది)

Friday 29 May 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 5:

అదే గ్రామంలో శ్రీపాద వల్లభుల పరమ భక్తుడైన ఒక చాకలివాడు ఉండేవాడు. కానీ ఆ చాకలివాడు చాలా బీదవాడు. ఆయన ప్రతీ రోజు శ్రీ పాద వల్లభుల వారి బట్టలు ఉతకడం ద్వారా వారికి ఎల్లవేళలా సేవ చేస్తూండేవాడు. కానీ ఒక రోజు #కృష్ణా నదిలో అక్కడి సుల్తాను తన రాజపరివారంతో కలిసి నావల్లో వెళ్ళడం చూసాడు ఈ చాకలివాడు.

ఆ సుల్తాను యొక్క రాజసం, ఐశ్వర్యం, ఠీవిని చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ అలా చూస్తూ తన బీదత్వానికి చాలా బాధపడ్డాడు. విషయం తెలిసిన శ్రీపాద వల్లభులు ఆ చాకలివాడిని ఏమైందని అడగగా ఆ చాకలివాడు " నాకు అలా రాజుగా పుట్టి సకల సుఖాలు అనుభవించాలని ఉంది స్వామి! " అని బదులిచ్చాడు. అప్పుడు శ్రీపాదుల వారు ఆ చాకలివాడికి వచ్చే జన్మలో రాజుగా పుట్టమని వరమిచ్చారు.

కానీ ఆ చాకలివాడు సంతృప్తిపడక  #శ్రీపాదుల వారితో " స్వామి! కానీ వచ్చే జన్మలో మిమ్మల్ని చూడకుండా, మీ సేవాభాగ్యం నుంచి వచింతుడనై, నేను ఉండగలనా? " అని బాధపడ్డాడు. కానీ అప్పుడు శ్రీ పాదుల వారు ఆ చాకలివాడితో " వత్సా! బాధపడకు. వచ్చే జన్మలో నేను నృసింహ సరస్వతిగా జన్మంచినప్పుడు నన్ను కలుస్తావులే! " అని బదులిచ్చారు.

ఈ చాకలివాడే తరువాతి జన్మలో బీదరు సుల్తాను అల్లాఉద్దీన్ రెండు గా జన్మించారని  నానుడి.

అదే ప్రాంతంలో వల్లభేషుడనే  బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వ్యాపారం చేస్తూండేవాడు. తన వ్యాపారంలో బాగా లాభాలు వస్తే కురవాపురం వచ్చి వేయి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తానని భగవంతుణ్ణి వేడుకున్నాడు. అలా అదే సంవత్సరం ఆయనే తన వ్యాపారంలో చాలా లాభాలను గడించాడు. అనుకున్నట్టుగానే చాలా ధనంతో కురవాపురం బయలుదేరాడు.

కానీ అది బందిపోట్లు బెడద అధికంగా ఉండే దారి. వల్లభేషుడు ధనంతో వెళుతున్నాడని సమాచారం తెలిసిన బందిపోట్లు ఆయనపై దాడిచేసి ఆయన తలనరికి చంపేశారు..... ( ఇంకా వుంది )

Wednesday 27 May 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 4:

కానీ ఙ్ఞానమూర్తి అయిన శ్రీపాదుడు  పెళ్ళికి ఏమాత్రం సమ్మతించలేదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు శ్రీపాదుడు. తరువాత తల్లిదండ్రుల అనుమతితో సన్యాసం స్వీకరించాడు శ్రీపాదుడు. కానీ సన్యాసానికి ముందు గుడ్డివాడు, కుంటివాడు అయినా తన ఇద్దరు సోదరులను తన లీలతో చూపును ప్రసాదించాడు మరియు ఇంకో సోదరుడి అవిటి తనాన్ని పోగొట్టాడు. వారిరువురికి ఙ్ఞానాన్ని ప్రసాదించి తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారిపై మోపి తాను తీర్థయాత్రలకై బద్రినాథ్ బయలుదేరాడు.

తీర్థయాత్రలు ముగించుకున్న శ్రీపాదుడు  దక్షిణాన కర్ణాటకలో గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నాడు. అటు తరువాత అక్కడి నుండి కృష్ణా నది జన్మస్థానమైన మహాబలేశ్వరం చేరుకున్నాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన తరువాత శ్రీశైల పర్వతం చేరుకున్నాడు శ్రీపాదుడు. తరువాత అక్కడికి దగ్గరలోని కురువాపురం గ్రామానికి చేరుకున్నాడు శ్రీపాదుడు. తన జీవితంలోని ఎక్కువ భాగం ఈ ఊరిలోనే గడపడం విశేషం.

శ్రీ పాద వల్లభుల తరువాతి అవతార వైశిష్ట్యం మరియు లీలా విశేషాలు :

ఆ ఊరిలో అంబిక అనే పేరు బ్రాహ్మణ స్త్రీ నివసిస్తూండేది. ఆమెకు ఒక పుత్రుడు ఉండేవాడు. వాడు చెడు సాంగత్యం వలన పరమ నీచమైన పనులు చేస్తూ ఆ ఊరిలోని వారి చేత ఎప్పుడూ తిట్లు తింటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా అంబిక భర్త తన పుత్రుడిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నంచాడు, కానీ ఫలితం లేక కొన్ని రోజులకు బాధతో మరణించాడు.

భర్త తరువాత బిడ్డను మార్చటానికి అంబిక ఎంతో ప్రయత్నించింది. కానీ తను కూడా సఫలీకృతం కాకపోవడం వల్ల, ఊర్లో వారందరి చేత మాటలు పడడం కన్నా చావడం ఉత్తమమని తలచి, ఆత్మహత్య చేసుకుందామని కృష్ణా నది ఒడ్డుకు చేరుకున్నది అంబిక. కానీ నది ఒడ్డున కూర్చొని ఇదంతా గమనిస్తున్న శ్రీపాద వల్లభుడు తన దివ్యదృష్టితో అంతా తెలుసుకొని, ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా వారించే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్య మహాపానమని అంబికను ఆపే ప్రయత్నం చేశారు శ్రీపాద వల్లభులు. అప్పుడు అంబిక తన బాధను అంతా శీపాదుల వారికి  తెలియజేసింది.

అంబిక భక్తితో శ్రీపాదుల వారితో ఇలా అంది " స్వామీ! నాకు జీవితం పైన వ్యామోహం ఏమాత్రం లేదు. ఉన్న ఒక్క కొడుకు కూడా ఇలా తయారయ్యాడు. నాకు జీవించాలని లేదు. కనీసం వచ్చే జన్మలో అయినా మీలాగా పరమ తేజోవంతుడైన కుమారుడు కలిగేలా ఆశీర్వదించండి!!!"  అని  ప్రాధేయపడింది.

అన్నీ తెలిసిన శ్రీపాదులు అప్పడు అంబికతో " అమ్మా! నీ ఇష్ట ప్రకారమే వచ్చే జన్మలో నీ సంతానంగా ' శ్రీ నృసింహ సరస్వతి' అను నామంతో మళ్ళీ జన్మిస్తాను. కానీ ఇప్పుడు ఓర్పు వహించు తల్లీ! " అని ఆమెకు వరాన్ని ప్రసాదించాడు. తరువాత ఆమె కొడుకు తలపై చేయి ఉంచి, వాడిని మహా ఙ్ఞానిగా మార్చారు శ్రీ పాదులవారు..... ( ఇంకా ఉంది )

Tuesday 26 May 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 3:


¤ ¤ ¤  శ్రీపాద శ్రీ వల్లభులు  ¤ ¤ ¤

పిఠాపురం గ్రామంలో పుణ్యదంపతులైన శ్రీ అప్పలరాజ శర్మ మరియు శ్రీ సుమతీల మూడవ సంతానంగా శ్రీపాద శ్రీవల్లభుల వారు 1320వ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు జన్మించారు.

ఒకనాడు అప్పలరాజ శర్మ గారు తన ఇంట శ్రాద్ధ కర్మ నిర్వహిస్తుండగా మధ్యాహ్న వేళ ఒక సాధువు భిక్షకై విచ్చేసాడు. శ్రాద్ధ కర్మ చేసే సమయంలో భిక్ష వేయడం నిషేధం... అయినా అప్పలరాజ శర్మ వచ్చిన సాధువును నారాయణ రూపంగా భావించి, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చడం తప్పుకాదనేది వేదవాక్కు ఆయనకు భిక్ష వేసి సంతృప్తి పరిచాడు.

అంతే చాలా సంతోషించిన దత్తాత్రేయుడు సాధువు రూపాన్ని వదిలి తన నిజ రూపాన్ని ధరించాడు. అప్పలరాజ శర్మ దంపతులను దీవించిన దత్తాత్రేయుడు  వారిని ఏం వరం కావాలో కోరుకోమనగా, అప్పలరాజ శర్మ దంపతులు " నీ వంటి ఙ్ఞాన పురుషుడు మాకు కొడుకుగా రావాలి" అని దత్తత్రేయుని కోరారు.

"నా అంశతో, అందరికీ గురుతుల్యుడై, తేజో ప్రకాశాలతో వెలగే కుమారుడు మీకు కలుగు గాక " అని వారీని దీవించి దత్తాత్రేయుడు అంతర్ధానమయ్యాడు. అప్పటికే అప్పలరాజ శర్మ దంపతులకు ఎంతో మంది సంతానం కలుగగా వారిలో చాలా మంది మరణించారు. అందరిలో కేవలం ఇద్దరు మాత్రమే మిగలగా వారిలో కూడా ఒకరు గుడ్డివాడు కాగా, మరొకడు కుంటివాడు. అలా సంవత్సరం తరువాత సుమతికి తేజోవంతుడైన ఒక కుమారుడు జన్మించాడు.

ఆ పిల్లవాడికి 'శ్రీ పాదుడు' అని నామకరణం చేశారు అప్పలరాజ శర్మ దంపతులు. ఎందుకంటే ఆ బాలుడు తన పాదములపైన విచిత్ర చిహ్నాలతో జన్మించాడు కాబట్టి. ఆ బాలుడు తన ఏడు సంవత్సరాల లోపే సకల విద్యలూ నేర్చుకోగా, తన ఉపనయన కార్యక్రమం తరువాత వాటిపైన ప్రవచనములు ఇవ్వసాగాడు. తన పదహారవ ఏటకు చేరుకున్నాడు శ్రీ పాదుడికి పెళ్ళి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ....
( ఇంకా వుంది )

Monday 25 May 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 2:

మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణమే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు.

ప్రతి సంవత్సరం మార్గశిర మాస పౌర్ణమి రోజున శ్రీ దత్త జయంతి జరుపుకుంటారు. మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర , కర్ణాటక మరియు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దత్త జయంతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కలకోట మహరాజ్ మరియు శ్రీ షిరిడీ సాయి బాబా మొదలగు అవతార పురుషులను శ్రీ దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణిస్తారు.

కర్ణాటకలోని గాణుగాపూర్, మహారాష్ట్రలోని కారంజ, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం ప్రసిద్ధ దత్త క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. రేపు శ్రీ దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల గురించి తెలుసుకుందాం.... ( ఇంకా వుంది )

Friday 22 May 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 1:

దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది. ఒకసారి త్రిలోక సంచారియైన నారదమహర్షి బ్రహ్మ,విష్ణు,మహేశ్వరుల నివాసాలకు వెళ్లి, అక్కడ అనసూయా దేవి పాతివ్రత్యాన్ని గురించి యెంతగానో ప్రశంశించాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్భందించారు.

అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయ దేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, ఆర్ఘ్య – పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు. అపుడు అతిథులు ‘ అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు’ అన్నారు. ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా! భోజనానికి దయజేయండి. అని ప్రార్ధించింది.

అపుడు వారు ‘సాధ్వీ, మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము’ అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్దమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది.

అయ్యలారా అలానే చేస్తాను, భోజనానికి లేవండి! అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో, స్వామి, ‘నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను. ’ అని చెప్పుకొన్నది.
ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన
సంకల్పం వలన ఆమె భోజనంవడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యమొచ్చింది.ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహా పతివ్రత తన దివ్యద్రుష్టివలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొన్నది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి,ఆమె నుండి సర్వము తెలిసికొని ఊయలలొని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను స్తుతించాడు.

అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ ‘ సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తీ వలన ఇలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు.’ అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు. కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతార కార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రిమహర్షి సంతోషించాడు..... ( ఇంకా ఉంది ).

Saturday 2 May 2015

శ్రీ లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం....

త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం
ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే ।
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్  ॥ 1 ॥

శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చే-
ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ ।
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ ॥ 2 ॥

ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః
గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ ।
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ ॥ 3 ॥

స్రక్చందనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే
గంధఫలీసదృశా నను తేమీ భోగానంతరదుఃఖకృతః స్యుః ।
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ ॥ 4 ॥

తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం
స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి ।
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ ॥ 5 ॥

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం...

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥

నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్థా ॥

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥

క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥

గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

శ్రీ నృసింహ జయంతి....

శ్రీ నృసింహ జయంతి: ( 02-05-2015 , శనివారం, వైశాఖ శుద్ధ చతుర్దశి )

ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ।
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ॥

నేడే శ్రీ నృసింహ జయంతి.  శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం. నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహుడు క్రోధ మూర్తిగా కనిపిస్తాడే తప్ప ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో....

అవతార వృత్తాంతం:
వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు శాపవశాత్తు మూడు రాక్షస జన్మలు ఎత్తి శ్రీ హరి చేత సంహరింపబడి తిరిగి వైకుంఠం చేరుకుంటారు. ఆ రాక్షసావతారాలలో జయవిజయులు మొదటగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. శ్రీహరి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దానితో హిరణ్య కశిపుడు శ్రీహరి పై ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తనను పగలు గాని, రాత్రి గాని, ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని, భూమి మీద కాని, ఆకాశంలో గాని, అస్త్రం చే గాని, శస్త్రం చేత గాని, మనిషి చేత గాని, మృగం చేత గాని చంపబడకుండా ఉండాలనే వింత షరతులతో కూడిన వరం పొందుతాడు.

కానీ హిరణ్య కశిపుని భార్య లీలావతికి పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. గర్భంలో ఉన్నప్పటి నుంచే హరి భక్తుడైన ప్రహ్లాదుని హరి భక్తి మానమని  ఎంత బోధించినా, బెదరించినా, చంపే ప్రయత్నం చేసినా మనసు మార్చుకోడు. తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా, లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉండేవాడు.

ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమనగా. "ఇందుగలవాడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి" అని భక్తితో  ప్రహ్లాదుడు "ఈ స్తంభంలో కూడా నా శ్రీహరి ఉన్నాడు" అని చెప్పగా, దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనై హిరణ్యకశిపుడు "ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి" అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పగులగొడతాడు. అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో నృసింహమూర్తిగా అవతరించి గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.

పాంచరాత్రాగమంలో 70కి పైగా నరసింహమూర్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. కానీ ముఖ్యమైనవి మాత్రం నవ నారసింహమూర్తులు. అవి...
1) ఉగ్ర నారసింహుడు
2) కృద్ధ నారసింహుడు
3) వీర నారసింహుడు
4) విలంబ నారసింహుడు
5) కోప నారసింహుడు
6) యోగ నారసింహుడు
7) అఘోర నారసింహుడు
8) సుదర్శన నారసింహుడు
9) శ్రీలక్ష్మీ నారసింహుడు

నృసింహ జయంతి రోజు ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి నరసింహ పురాణంలో చెప్పబడి ఉంది. అవంతీ నగరమున సుశర్మ అను వేదవేదాంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలుగగా వారిలో చిన్నవాడైన వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించి. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భోజనం చేయలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్యలేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసాడు. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసింది. అజ్ఞాతముగా ఇలా వ్రత ఆచరించుడం వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారని నృసింహ పురాణం చెబుతున్నది.

అందరికీ నరసింహ జయంతి శుభాకాంక్షలు....

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...