Wednesday 29 July 2015

శ్రీ జగన్నాథ వైభవం - 5:

రాజ దంపతులకు ఆతృతతో పాటు అనుమానం కూడా ఎక్కువైంది. నిద్రాహారాలు లేకుండా ఆ మందిరంలో పని చేస్తున్న శిల్పి బహుశా మరణించి వుంటాడేమోనని సందేహం కలిగింది. ఇక ఓపిక నశించిన మహారాజు శిల్పి పెట్టిన నియమాన్ని ఉల్లఘించి ఆ ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశంతో నియమభంగం అయిందని గుర్తంచిన శిల్పి మరుక్షణంలో మాయమయ్యాడు. అక్కడ దర్శనమిచ్చిన మూడు మూర్తులను చూసి, ఆశ్చర్య పోయాడు ఇంద్రద్యుమ్నుడు.

కరచరణాదులు లేకుండా, వున్న ఆ మొండి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలా అనే సందేహం ఆయనకు మరింత బాధను కలిగించింది. అదే రోజు రాత్రి బాధతో ఉన్న ఇంద్రద్యుమ్నునికి కలలో కనిపించి "రాజా! బాధపడకు. ఇదంతా నా సంకల్పమే. ఈ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఈ రూపాలతోనే కొలువుతీరి జగన్నాథుడు అనే పేరున జనులందరి కోరికలూ తీరుస్తూ వుంటాను '' అని పలికాడు. ఇంద్రద్యుమ్నుడు ఈ మూర్తులనే ఆలయంలో ప్రతిష్ఠించాడు. అవే నేటికీ సర్వజనుల చేత పూజలందుకుంటున్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ మూర్తిత్రయం.

అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు.కానీ నీలాచలం క్షేత్రంలో అదే ప్రత్యేకత. ఆ తరువాత క్రీ.శ. 1140లో అప్పటి రాజు అనంతవర్మ చోడగంగాదేవ్ నూతన మందిరం నిర్మించగా, అనంతరకాలంలో శిథిలమైన దానిని ఆయన మనువడు అనంగ భీమదేవుడు పునర్నిర్మించారు. ఆ తర్వతి కాలంలో అనగా క్రీ.శ.1174లో ఒడిషాను పరిపాలించిన అనంగ భీమదేవుడు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో దర్శనమిస్తున్న జగన్నాథస్వామి ఆలయ సంపద అంతా అనంగ భీమదేవుని కాలంలో నిర్మించినవే.

సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యాసమేతుడై కొలువుతీరి వుంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు బలభద్రుడుతోనూ, సోదరి సుభద్రతోనూ, కొలువుదీరి సేవలు అందుకొంటూంటాడు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన జగన్నాథుని ఆలయంతోపాటు వినాయకునికి, లక్ష్మీ, పార్వతులకు, శివునకు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు వున్నాయి..... ( ఇంకా వుంది )

Tuesday 28 July 2015

శ్రీ జగన్నాథ వైభవం - 4:


ఏ ఆలయంలోనైనా గర్భాలయంలోని మూల విరాట్టు కరచరణాలతో, సర్వాలంకారాలతో, నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కానీ పూరీలోని జగన్నాథుడు మాత్రం కరచరణాలు లేకుండా, కొలువుదీరి దర్శనమిస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు ఓ కథ వుంది.

పూర్వం ద్వాపర యుగంలో భరతఖండాన్ని ఇంద్రద్యుమ్నుడనే మహారాజు పాలించేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు. ఒకసారి నారాయణుడు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించి, తన కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు ఆదేశాన్ని తన సకృతంగా భావించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ఆలయంలో మూల విరాట్టు రూపాలు ఎలా వుండాలనే విషయంలో మాత్రం ఆలోచనలో పడ్డాడు.

ఎందుకంటే కలలో కనిపించిన విష్ణువు రూపాన్ని తాను శిల్పంగా మలచలేడు కాబట్టి. ఎందుకంటే శిల్పులు మహారాజు దర్శించిన రూపాన్ని శిల్పంగా మలచలేరు కదా, ఎందుకంటే వారికి నారాయణుని దర్శనం కలుగకపోవడమే అసలు విషయం. ఈ విషయంలో మహారాజుకు చింత రోజురోజుకీ పెరిగిపోసాగింది. తన భక్తుడు పడుతున్న ఆవేదన సకలలోక రక్షకుడైన నారాయణుడికి అర్థమయ్యి, తానే ఒక శిల్పి రూపమును ధరించి, ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరకు వచ్చాడు.

మహారాజు దగ్గరకు వచ్చన శిల్పి, మహారాజుతో " అయ్యా! మీకు సంతృప్తి కలిగే విధంగా మూలవిరాట్టు నిర్మాణం చేస్తాను, అయితే విగ్రహ తయారీకి 21 రోజుల సమయం పడుతుంది. అయితే నా పని పూర్తి అయ్యేంత వరకు, ఎవరూ కూడా నా గదిలోకి రాకూడదు. నాకు నేనుగా బయటకు వచ్చేవరకు, నా యొక్క పనికి ఎవరూ కూడా అంతరాయం కలిగించకూడదు" అని నిబంధన విధించాడు. మహారాజు అందుకు సమ్మతించాడు.

ఒక ఏకాంత మందిరంలో నారాయణుడైన మాయాశిల్పి తన పని ప్రారంభించాడు. వారాలు, నెలలు గడుస్తున్నాయి. మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే వున్నాయి. పని జరగుతూనే ఉంది. కానీ మూలవిరాట్టు రూపాన్ని చూడాలనే ఆత్రుత, మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది.
కొన్ని రోజుల తరువాత ఆ మందిరం నుంచి శబ్దాలు రావడం మానేశాయి.... ( ఇంకా వుంది )

Wednesday 22 July 2015

శ్రీ జగన్నాథ వైభవం - 3:

శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన ప్రసిద్ధ జగన్నాథాష్టకాన్ని చదివి తరిద్దాం....!!!

కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 1 ॥

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటక్షం విదధత్
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 2 ॥

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 3 ॥

కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 4 ॥

రథారూఢో గచ్ఛన్పథీ మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకలజగతాః సింధుసుతయా
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 5 ॥

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 6 ॥

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవే
న యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరపధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 7 ॥

హరత్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశ
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 8 ॥

ఇతిశ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ జగన్నాథాష్టకం సంపూర్ణం....

రేపు శ్రీ జగన్నాథ, బలభధ్ర, సుభధ్ర విగ్రహ మూర్తుల గురించి తెలుసుకుందాం... ( ఇంకా వుంది )

Monday 20 July 2015

శ్రీ జగన్నాథ వైభవం - 2:

ఈ యాత్రలో పూరీ మహారాజ వంశజులైన గజపతి మహారాజుగారు బంగారు చీపుర్తో వీధులను ఊడుస్తారు. సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలతో వీధులను గజపతి రాజావారు స్వయంగా పునీతం చేస్తారు. అందంగా పూలతో అలంకరించబడిన రథాలు, మేళ తాళాలతో, ఆషాఢ శుద్ధ విదియనాడు, వేలాది మంది తాళ్లతో హరినామ స్మరణ చేస్తూ, రథాలను లాగుతూ ఉండగా జగన్నాథ మందిరం నుండి బడా దండా అనబడే ముఖ్య వీధి ద్వారా దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకుంటాయి. 

జగన్నాథ అంటే జగత్తు అంతటికీ నాథుడని అర్థం. విష్ణుసహస్రనామంలో ఈ నామం మనకు కనిపిస్తుంది. ఈ నామానికి ఇదే అర్థం కాకుండా ఇంకా ఎన్నో విశేష అర్థాలున్నాయి. అందుకే అంటారు 'మహాలోకం జగన్నాథం' అని. యాత్రలో ముందు బలభద్ర సుభద్రలు తరలి వెళ్లగా, వారి వెనుకు జగన్నాథుడు యాత్ర చేస్తాడు. రథయాత్రలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఊరేగిస్తారు."రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" - రథములో జగన్నాథుని రూపమైన వామనుని చూసినంత పునర్జన్మ లేదని ప్రతీతి. పురీ పట్టణంలో జగన్నాథుని మహిమవలన యముని ప్రభావం చాలా తక్కువ ఉంటుందని, దాని వలన ఈ క్షేత్రానికి యమనిక తీర్థంగా పేరు వచ్చింది. 

ఈ రథయాత్ర సమయంలో యాత్రలో ఉండే ప్రతి వస్తువును (రథము, తాళ్లు, గుర్రాలు మొదలైనవి) జగన్నాథునిగానే భావిస్తారు. అందుకే అంటారు 'సర్వం జగన్నాథం మయం' అని. రథాల తిరుగు ప్రయాణంలో మేనత్త మౌసీ మా గుడి వద్ద ప్రత్యేక ఫలహారాన్ని దేవతలకు నివేదిస్తారు. ఏడు రోజులు గుండిచా మందిరంలో ఉన్న తరువాత మూలమూర్తులు తిరిగి జగన్నాథ దేవాలయ గర్భగుడిలో స్వస్థానాలకు చేరుకుంటాయి.

నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే । 
బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః ॥

జై జగన్నాథ... జై జై జగన్నాథ.... ( ఇంకా వుంది )

Friday 17 July 2015

శ్రీ జగన్నాథ వైభవం - 1:

( 18-07-2015 నుండి 27-07-2015 )

ఆషాఢ శుద్ధ విదియ మొదలు శుద్ధ ఏకాదశి వరకు బలభద్ర, సుభధ్ర, జగన్నాథుల రథయాత్ర ఉత్సవాలు ఒడిషా రాష్ట్రంలోని పూరీలో కన్నుల పండుగగా జరుగుతాయి. పూరీలో వెలసిన శ్రీకృష్ణమూర్తే జగన్నాథుడు. సువిశాలమైన ప్రాంగణములో కళింగ దేవాలయ శైలిలో కట్టబడిన మనోహరమైన మందిరములో జగన్నాథుడు,బలరామ, సుభధ్రా సమేతుడై శోభిల్లుతున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద రథయాత్రగా పేరుపొందిన ఈ రథయాత్ర భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు తలమానికం.

దుఃఖభంజనకు, పాపహరణకు నారాయణుడు ప్రతి ఏటా రథారూఢుడై పురీ నగరవీథుల గుండా ఊరేగుతూ  గుండిచా ఉద్యానవనమందిమైన 'గుండిచా ఆలయానికి' చేరుకుంటాడు. అక్కడ తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనమిస్తూ వారి పాపాలను పటాపంచలు చేస్తుంటాడు. ఈ యాత్రనే గుండిచా యాత్రగా అని కూడా
రథయాత్రలో ముగ్గురి దేవతలకూ మూడు విడి రథాలు ఉంటాయి. పీతాంబరధరుడైన జగన్నాథుడు ఎరుపుపై పసుపు రంగుతో శోభితమైన రథముపై ఊరేగుతాడు.ఈ రథాన్నే " నందిఘోష " అని అంటారు.

అగ్రజుడైన బలభద్రుడు ఎరుపుపై నీలం రంగుతో మెరిసే రథముపై ఊరేగుతాడు. ఈ రథాన్నే " తాళధ్వజ " అని అంటారు. సుభద్రా దేవిని ఎరుపుపై నలుపు వర్ణంతో భాసిల్లే రథముపై ఊరేగేస్తారు. ఈ రథాన్నే " ద్వర్పదళన లేదా పద్మదళన " అని అంటారు. జగన్నాథుని రథం నలభై ఐదు అడుగులు, బలభద్రుని రథం నలభై నాలుగు అడుగులు, సుభధ్ర రథం నలభై మూడు అడుగుల పొడుగు ఉంటాయి. నందిఘోషకు 16 చక్రాలు, తాళధ్వజకు 14 చక్రాలు, ద్వర్పదళనకు 12 చక్రాలుంటాయి.

ప్రతి సంవత్సరము పాత రథాలను భిన్నంచేసి, కొత్తగా రథాలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒడిషా వాసులకు అత్యంత శుభకరమైన రోజుగా భావించే అక్షయ తృతీయనాడు కొత్త రథాల తయారు మొదలు పెడతారు. పురీ మహారాజు ఇంటి ముంగిట మొదలవుతుంది తయారి ప్రక్రియ. ఇదే రోజు 3 వారాలపాటు జరిగే చందన యాత్ర కూడా మొదలవుతుంది. రథాలకు వాడే చెక్కలను దసపల్లా నుండి దుంగల్లా తయారు చేసి మహానది నదిలోని నీటిలో పురీకి తీసుకువస్తారు.

తరతరాలుగా వంశ పారంపర్యంగా ఈ రథాలను తయారుచేసే వడ్రంగుల వంశానికి చెందినవారే ఈ రథాలను తయారు చేస్తారు. ప్రతిరథము చుట్టూ 9 మంది పార్శ్వదేవతల మూర్తులు ఉంటాయి. బలభద్రుని రథానికి తెల్లని గుర్రాలు, జగన్నాథుని రథానికి నల్లని గుర్రాలు, సుభద్ర రథానికి ఎర్రని గుర్రాలు నాలుగు చొప్పున ఉంటాయి. రథాలకు చోదకులుగా మాతలి, దారుక, అర్జునులు ఉంటారు.... ( ఇంకా వుంది )

శ్రీ దత్తాత్రేయ వైభవం - 27:


" మోక్షము కేవలం ఈ మానవ యోని వలన మాత్రమే సాధ్యమవుతుంది. అంతే తప్ప మిగిలిన ఏ యోనితోనూ మోక్షప్రాప్తి సాధ్యపడదు. అందుకే ఈ దుర్లభ మానవ జన్మను వృథా చేసుకోకూడదు. అందుకే నేను వైరాగ్యాన్ని స్వీకరించాను. నాకు దేని పైనా మోహము లేదు. దేనిపైనా అహం భావము కూడా లేదు " అని అంటాడు దత్తాత్రేయుడు.

ఈ ఇరవైనాలుగు గురువుల తత్త్వాలను శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి బోధించినట్టుగా శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని ఏడవ ఘట్టంలో  కనిపిస్తుంది. అలాగే తెలుగులోని మన పోతన భాగవతంలో ఏకాదశలో స్కంధంలోని పన్నెండవ ఘట్టంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. అందులో మనం చూసిన ప్రతీ ఒక్క కథతో పాటు, శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి బోధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి.

జగద్గురువైన దత్తాత్రేయుడు ఈ ఇరవైనాలుగు తత్త్వాలను మనకు ఙ్ఞాన బోధ చేయటానికే స్వీకరించాడు. ఏందుకంటే ఆయనే జగద్గురువు కాబట్టి. మనం కూడా ఙ్ఞానప్రదాలైన ఈ తత్త్వలను గ్రహించి ఆచరించే ప్రయత్నం చేద్దాం.
ఇన్ని రోజులూ అఙ్ఞానినైన నాతో తన వైభవాన్ని రాయించుకున్నాడు దత్తాత్రేయుడు. రాసింది నేనైనా రాయించింది ఆయనే.

ఈ పోస్టులను ఆదిరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరిపైనా దత్తాత్రేయుడు తన కృపాకటాక్షాలు కలుగుజేయాలని కోరుతన్నా... జై శ్రీ రామ....

Monday 13 July 2015

గోదావరి మహా పుష్కరాలు - 2015:

( 14-07-2015 నుండి 25-07-2015 )

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. గోదావరి పుష్కరాలు 2015వ సంవత్సరం జూలై 14 నుండి 25వరకు జరగనున్నాయి.

పూర్వం తుందిలుడనే బ్రాహ్మణుడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ  పరమశివుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. పరమశివుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానం కావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు.

ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలం కోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జలాలకు చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు .ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు.

అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి.

ప్రాముఖ్యం చెందిన పన్నెండు నదులకు పుష్కర సమయాలు వ్యాఖ్యానించ్చబడ్డాయి. పన్నెండేళ్ళకి ఒకసారొచ్చే పుష్కరాలు ఎలా నిర్ణయం చేస్తారంటే... గురు ఏ రాశిలో ఉంటే ఏ నది పుష్కషమో చెప్పవచ్చు....
మేష రాశి - గంగా నది పుష్కరము
వృషభ రాశి  - నర్మదా నది పుష్కరము
మిథున రాశి  - సరస్వతీ నది పుష్కరము
కర్కాటక రాశి  - యమునా నది పుష్కరము
సింహ రాశి - గోదావరి నది పుష్కరము
కన్య రాశి - కృష్ణా నది పుష్కరము
తుల రాశి - కావేరి నది పుష్కరము
వృశ్చిక రాశి - తామ్రపర్ణి నది పుష్కరము
ధనస్సు రాశి - సింధూ నది పుష్కరము
మకర రాశి - తుంగభద్ర నది పుష్కరము
కుంభ రాశి - భీమా నది పుష్కరము
మీన రాశి - ప్రాణహిత నది పుష్కరము

పుష్కర కాలానికి గల మరో విశిష్టత పితరుల సంస్మరణార్థం చేసే శ్రాద్ధ కర్మలు. పుష్కర సమయాల్లో దేవతలు, రుషులు వారితో పాటు పితరులు కూడా వస్తారనే ప్రమాణవాక్యం పుష్కర శాస్త్రాలలో పేర్కొనబడినది. ఇక్కడ చేసే శ్రాద్ధం వారికి తిండి పెడుతుందా? అనేది చాలామందిలో మెలిగే ధర్మసందేహం. కానీ మన కంటికి కనపడని కొన్ని పదార్థ గ్రాహకాలైన అణువులు ఇక్కడ మంత్రంతో కూడుకొని పెట్టే శ్రాద్ధ ద్రవంలోని ఆహార రసాన్ని మన పితరులకు అందిస్తుందంటారు. ఈ కర్మలను పరిపూర్ణ విశ్వాసంతో చేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు.

శాస్త్రోక్తమైన సంకల్పవిధానంతో పుష్కరస్నానం చేసి, స్నానఫలితాన్ని పొందండి. ముందుగా కొంచెం మట్టి లేక ఇసుక చేతిలోకి తీసుకొని నదివద్దకు చేరి ఈ క్రింది శ్లోకాలను చదువుతూ ఆమట్టిని కానీ ఇసుకని కానీ నదిలో కలపాలి.

1. పిప్పలాద మహాభాగ సర్వలోకశుభంకర
మృత్పిండం చ మాయా దత్తం ఆహారార్ధం ప్రకల్ప్యతామ్
2. పిప్పలాదాత్ నముత్పన్నే కృతే లోకే భయంకరే
మృత్తికాం తే మయా దత్తం ఆహారార్ధం ప్రకల్ప్యతామ్
ఆపై నదీ జలాన్ని మూడుసార్లు శిరస్సుపై "పుండరీకాక్ష , పుండరీకాక్ష , పుండరీకాక్ష" అనుచు చల్లుకోవాలి....

జై శ్రీ రామ... నమామి గౌతమి గంగే.... గోదావరీం నమోస్తుతే....

Sunday 12 July 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 26:

24. ఇరవైనాలుగవ గురువు -  గొంగళి పురుగు:

గొంగళి పురుగు చిన్నగా ఉన్నప్పుడు దానిని పట్టుకున్న కందిరీగ దానిని తన గూటిలో దాచుకుని దానిని బంధించి దాన్ని కుడుతుంది. ఆ తరువాత దాని చుట్టే తిరుగుతూ  ఉంటుంది. అలా ఎందుకు తిరుగుంతుందో అర్థం కాక భయపడిన గొంగళి పురుగు కాసెపటికి తనను తాను కందిరీగగా భావించుకుంటుంది. ఆ గొంగళి పురుగు కూడా తరువాత క్రమంగా అలా అలా తను కూడా కందిరీగగా మారిపోతుంది.

ఎవరైనా పదే పదే ఒకరి గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు వారి గుర్తులే మనసులో ఉంచుకొని పదే పదే వారిని స్మరిస్తుంటారో అలాంటి వారు కొన్నాళ్ళకి వారు ఎవరినైతే ఊహించుకుంటారో, తాము వారు ఒకటేనని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చూసేవుంటాం. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచిస్తే తన పరమాత్మలో లీనమౌతాడు. అందుకే మనిషనే వాడు మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలంటాడు దత్తాత్రేయుడు.

ఇంకా ఈ ఇరవైనాలుగు గురువులనే కాకుండా తాను తన శరీరం నుండి కూడా చాలా విషయాలు నేర్చుకున్నానంటాడు. "శరీరము అనుభవించే జనన మరణ చక్రాల నుండి ఙ్ఞానము, వైరగ్యాలను నేర్చుకున్నాను. అందుకే ఈ శరీరంపై పెంచుకుంటే తరువాత బాధలు, దుఃఖాలు తప్పవంటాడు. ఈ శరీరంతో ఎన్నో పవిత్ర కార్యాలు చేయవచ్చు. కానీ నేను ఈ శరీరంపైన మక్కువ పెంచుకోను".

" ఈ శరీరాన్ని సుఖపెట్టటం ధనం సంపాదించాలి. ధనం కోసం కర్మలు చేయాల్సి ఉంటుంది. ఈ కర్మల వలన పాప, పుణ్యాల చక్రంలో చిక్కపోవడం ఖాయం. భగవంతుడు 84 లక్షల యోనులను పుట్టించినా సంతృప్తి పడక మానవ యోనిని సృష్టించాడు. ఈ యోనికి మోక్షమే నిజమైన లక్ష్యం....... ( ఇంకా వుంది )

శ్రీ దత్తాత్రేయ వైభవం - 25:

22. ఇరవై రెండవ గురువు - లోహపు పనివాడు :

తన పని చేస్తున్నప్పుడు లోహపు పనివాడు ఎంత శ్రద్ధతో చేస్తాడో అంత బాగా తయారవుతాయి పనిముట్లు. ఒక పనిముట్టును అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఆ పని మీద పట్టు, చేయాలనే ఆసక్తి ఉండాలి. లేకుంటే ఆ పని ఎంత చేసినా లాభం ఉండదు. అలాగే మనిషి కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, అమితాసక్తితో చేయాలి. పూజ కూడా ఏదో తంతుగా, తూతూ మంత్రంగా చేస్తారు చాలా మంది. కానీ అలా చేస్తే ఫలితం ఉంటుందా అనేది మనం ఆలోచించాలి. 

పూజను ఒక ప్రక్రియగా భావిస్తారే తప్ప దాని మీద ప్రేమతో చేయరు. పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధాలోపం చాలా చూస్తూంటాం. ఎలాగంటే వారు పూజలో చదివేదొకటి చేసేదొకటి. ఉదాహరణకు శ్రద్ధలేని ఓ వ్యక్తి పూజలో ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అని అంటూనే ఒక పండును ప్రసాదంగా పెట్టాడట. ఒక్క పూజ అనే కాదు ఎన్నో పనుల్లో చాలా మంది ఇలాగే చేస్తారు. 

మనసు ఒకటి ఆలోచిస్తుంది చేతలు ( చేసే పని ) మాత్రం వేరేగా ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఏ పనిచేసినా శ్రద్ధ, ఆసక్తి, శ్రమ అనేది ముఖ్యమంటాడు దత్తాత్రేయుడు. 

23. ఇరవై మూడవ గురువు - సాలెపురుగు: 

సాలెపురుగు తన సాలీడు ఎంతో అందంగా మరియు ఎంతో నైపుణ్యంతో నిర్మిస్తుంది. దాన్ని కట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంది. అలా నిర్మించాక ఆ సాలీడులో చాలా కాలం నివసించి తరువాత అవే సాలెపురుగులు తమ సాలీడును తామే తినేస్తాయి.

భగవంతుడు కూడా అంతే, ఈ మాయా సృష్టిని తానే నిర్మించి, ఆ సృష్టితో ఆటలాడి కొంత కాలం తరువాత మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. కానీ మనం మాత్రం ఈ సృష్టే నిజమనుకుని భ్రమిస్తూంటాం. కాని ఇదంతా అసత్యమే కేవలం సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే సత్యమంటాడు దత్తాత్రేయుడు..... ( ఇంకా వుంది )


Wednesday 8 July 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 24:

ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, సాధన అనేది ఏకాంతంగా సాగాలి. అప్పుడే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అనేక తత్త్వాలు లేదా వాదనలు ఓకే చోట ఉండలేవు. చాలా రకాల తత్త్వాలు భోధించే మహాపురుషులు ఒకేచోట ఉండలేరు. వారి భావనలను తప్పని మనం అనలేం. ఎందుకంటే భగవంతుని చేరుటకై అనేకానక మార్గాలున్నాయి. అందుకే మహాత్ములు కేవలం ఏకాంతానికే ప్రాముఖ్యం ఇస్తారు.

మనం ఈ భవబంధాలను కూడా బాగా వంట బట్టిచ్చుకొని వాటి కోసమే పరితపించకూడదు అంటాడు దత్తాత్రేయుడు. వాటికే అత్తుక్కొని ఉండకూడదు. వాటిని పుస్తకాలకు వేసే అట్టలలాగా మాత్రమే ఉంచి తరువాత సమయం వచ్చినప్పుడు వదిలేయాలి. కానీ అలా కాకుండా మనం మాత్రమే వాటినే శాశ్వతం అనుకొని వాటికై పరితపిస్తాము.

21. ఇరవైఒకటవ గురువు - పాము:

పాము ఎప్పుడూ ఏకాంతంగా ఇతర జంతువుల సహవాసం కోరదు. తన జీవితంలో ఎక్కువ భాగం ఏకాంతంగానే గడుపుతుంది. అలాగే మహాత్ములకు, ముముక్షువులకు ఏకాంతం అవసరం. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు ఉదాహరణలో కూడా చూశాం.

పాము ప్రతిసారీ తన కుబుసమును అంటే పాత చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని ధరిస్తుంది. అలాగే ఆత్మ కూడా తన జననమరణ చక్రంలో ఎన్నో శరీరాలను ధరించి వదిలేస్తు ఉంటుంది. శరీరానికే మరణం కానీ ఆత్మకు కాదు. కానీ మనం మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఈ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తాం.

చివరికి మరణ సమయంలో కూడా మనం ఈ శరీరాన్ని వదలడానికి ప్రయత్నం చేయము. యమభటుల ప్రయాస వలన కానీ మన ఆత్మ శరీరం నుండి వడివడదు. ఈ విషయం మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. అందుకే ఙ్ఞాని ఎప్పుడు మరణం గురించి భయపడడు. ఈ జననమరణ చక్రం నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తూంటాడు..... ( ఇంకా వుంది )

శ్రీ దత్తాత్రేయ వైభవం - 23:


19. పంతొమ్మిదవ గురువు - పసిపిల్లవాడు.

పసిపిల్లలు ఎటువంటి కల్మషం లేనివారై శుద్ధమైన, పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు వారు కాబట్టి భగవంతునితో సమానులు. వారు సాధుస్వభావులు. ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ చూపరు. కానీ నేటి మానవుడు అరిషడ్వర్గాలతో పరిపూర్ణుడు.

మనిషి కూడా ఒక పసిపిల్లవాడిలోని మంచి గుణాలును తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు గ్లాసు వంటిది. ఒకవేళ దానిలో మట్టి చేరిన తరువాత దానిలో పాలు పోసినా, నీరు పోసినా లేదా అమృతం పోసినా వ్యర్థమే. అలాగే మన మనస్సు కూడా కల్మషం లేకుండా ఉండాలి. లేకుంటే దానిలో ఎంత ఙ్ఞాన ప్రవాహం జరిగినా వృథాయే. అలా మనస్సుని సాధ్యమైనంత వరకు ఎలాంటి కల్మషముల చేత పాడు కాకుండా చూసుకోవాలి.

ఐహిక విషయాలపై మక్కువ పెంచుకున్నవాడికి ఎంత చెప్పినా వాడికి ఙ్ఞానం అంటదు. ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు కదా. ' శ్రద్ధావాన్ లభతే ఙ్ఞానం ' అంటుంది భగవద్గీత.
ఒకవేళ అలా కల్మషమయమైనా దానిని సద్గురువైన భగవంతుడినే ఆశ్రయించి బాగుచేయాలంటాడు దత్తాత్రేయుడు. అందుకే మనిషికి భక్తి అనేది చాలా ముఖ్యం.

20. ఇరవైయవ గురువు - కన్య:

దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఒకసారి కొంతమంది వారి ఇంటికి ఆతిథులు రావలసి వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకై వెళ్ళారు. అతిథుల కోసం అన్నం వండుదామని బియ్యాన్ని చెరగడం మొదలుపెట్టింది.

కానీ అలా చేసేటప్పుడు తన గాజులు బాగా చప్పుడు చేయటం మొదలుపెట్టాయి. కానీ అతిథులకు ఆ శబ్దం వలన ఇబ్బందిగా ఉంటుందేమో అని ఒక్కొక్కటిగా తన గాజులు తీసివేయటం మొదలుపెట్టింది. చివరికి ఒక్కో చేతికి కేవలం ఒకే గాజు మిగిలాయి. అలా మళ్ళీ చెరగడం మొదలు పెట్టాక శబ్దం రావటం ఆగిపోయాయి..... ( ఇంకా వుంది )

Saturday 4 July 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 22:

17. పదిహేడవ గురువు - చేప:

చేపకు తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేత గాలానికి చిక్కుతుంది. అలాగే చేప తన నివాసమైన నీటిని వదిలి బ్రతకలేదు. అలాగే మనిషికి కూడా తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. లేకుంటే అనేక చిక్కులలో పడిపోతాడు. అలిగే మనిషి కూడా తన నిజ స్థావరాన్ని వదల కూడదు. తన నిజ రూపాన్ని కూడా మరవకూడదు. అలా మరిస్తే తిప్పలు తప్పవంటాడు దత్తాత్రేయుడు.

18. పద్దెనిమిదవ గురువు - వేశ్య:

దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పింగళ అనే పేరు గల ఒక వేశ్య నివసిస్తు ఉండేది. అమె తన వేశ్యా వృత్తి చేత తన దగ్గరకు వచ్చే గ్రాహకుల కోరికలను తీర్చి వారిని సంతృప్తిపరచేది. అలా చాలా కాలం తరువాత పింగళ తన వేశ్యా వృత్తిని వదిలేసి ప్రశాంతంగా భగవన్మార్గంలో బ్రతుకుదామని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే అదే ప్రయత్నం చేసి తన వేశ్యా వృత్తిని వదిలి భగవంతుణ్ణి చేరింది.

తన కోసం తను బ్రతకకుండా ఇతరుల శ్రేయస్సుకై బతికేవాడే మహాత్ముడు. సుఖం కోసం పింగళ, పింగళ ఇచ్చే సుఖముకై గ్రాహకుల ఎదురుచూసేవారు. కానీ పింగళ గ్రాహకులను నిజంగా ప్రేమించదు. గ్రాహకులు పింగళను ప్రేమించరు. కానీ ఇద్దరూ కలవగానే ప్రేమ అనే నాటకాన్ని మొదలుపెడతారు. ప్రపంచం ఇలా ప్రేమ నాటకాలు ఆడేవారు ఎంతమంది లేరు.

పింగళ లాగా మనిషి కూడా తన సుఖాలను త్యాగం చేసినప్పుడే బ్రహ్మంనందాన్ని పొందుతాడు. అసలైన సచ్చిదానంద స్వరూపాన్ని చేరతాడు. అలా అన్ని వదిలినప్పుడే అసలైన ప్రశాంతతను పొందుతాడు. ఇక అప్పుడు ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అన్ని తానే అయినవాడిలో తాను లీనమైపోతాడు కాబట్టి ఇక తనకు తను కాకుండా ప్రపంచంలో ఏమి కనిపించదు. ఇదే అద్వైత తత్త్వం.... ( ఇంకా వుంది )

Thursday 2 July 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 21:

15. పదిహేనవ గురువు - ఏనుగు:

సాధారణంగా ఏనుగును చాలా విధాలుగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ముందుగా తవ్విన ఒక పెద్ద గొయ్యిని ఆకులతో ఎవరూ గర్తుపట్టకుండా కప్పివేస్తారు. ఆ తరువాత గొయ్యి వెనకాల వైపు చెక్కతో చేసిన ఒక ఆడ ఏనుగును నిల్చోబెడతారు. అటు వెళుతున్న ఏ మగ ఏనుగైనా ఆ ఆడఏనుగు బొమ్మను చూసి ఆకర్షించబడి దాని దగ్గరకు వెళదామనుకొని ముందు గొయ్య ఉందని చూసుకోకుండా దానిలో పడిపోతుంది. ఇలా అంత పెద్ద ఏనుగు కూడా కామ వాంఛ చేత పట్టుపడిపోతుంది.

అలాగే మనిషి కూడా తన కామవాంఛలను అదుపులో ఉంచుకోవాలని చెప్తాడు దత్తుడు. అలా కామవాంఛలను అదుపులో పెట్టకోకపోవటం చేతనే నేటి ప్రపంచంలో ఆడ పిల్లలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అలా తన వాంఛలను అదుపులో పెట్టుకోలేనివాడు తన బాగుపడడు సరికదా ఇతరులను బాగా బతకనివ్వడు. తరువాత అనేకానేక బాధలను పడతాడు.

16. పదహారవ గురువు - జింక:

మంచి సంగీతానికి జింక వశమైపోతుందంటారు. జింకను పట్టుకోవటానికి వేటగాళ్ళు మంచి సంగీతాన్ని వాయించేవారట. ఆ సంగీతము విని మైమరిచి వేటగాడికి సులువుగా దొరుకిపోతుంది.

అందుకని సాధకుడు ఎప్పుడు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే సాధకుడనే జింక అరిషడ్వర్గాలనే వేటగాడికి చిక్కుతాడు. అలా అయితే భగవన్మార్గము కోసం మళ్ళీ ఎంతో వేచి ఉండాల్సి వస్తుంది. అరిషడ్వర్గాలను జయించాలంటే నిగ్రహం, ఓపిక, భక్తి, ఆర్తి, ప్రేమ మొదలైనవి ముఖ్యంగా పరమాత్మ పైన నమ్మకం అత్యవసరం..... ( ఇంకా వుంది )

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...