Friday 31 March 2017

మత్స్యావతార కథ - 18:


8-722-మ.
చని సత్యవ్రతమేదినీదయితుఁ డోజం బూని మ్రాన్దీఁగె వి
త్తనముల్ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై
ముని సంఘంబులుఁ దాను నెక్కి వెఱతో మున్నీటిపైఁ దేలుచుం
గనియెన్ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్ మీనమున్.
8-723-వ.
కని జలచరేంద్రుని కొమ్మున నొక్క పెనుఁ బాపత్రాటన నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నా రాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె.

భావము:
సత్యవ్రతుడు ఉత్సాహంతో ఆ ఓడ దగ్గరకు వెళ్ళి, అనేక ఓషధులను విత్తనాలను దాని మీద ఎక్కించాడు. విష్ణువును స్త్రోత్రం చేస్తూ మునులతో పాటు ఆ నావను ఎక్కాడు. భయంభయంగా సముద్రం మీద తేలుతూ పోతున్నాడు. అప్పుడు ఆయనకు భక్తులహృదయాలకు అలంకారమైన విష్ణువు మహామీనస్వరూపంతో ఎదుట కనిపించాడు. అలా కనబడిన మహా మీనరూపుని కొమ్ముకు సత్యవ్రతుడు ఒక పెద్ద పామును త్రాడుగా చేసి ఆ ఓడను కట్టివేసాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకున్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణువును ఈవిధంగా పొగడసాగాడు. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=722

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 30 March 2017

మత్స్యావతార కథ - 17:



8-720.1-తే.
గఱులు సారించు; మీసాలుఁ గడలు కొలుపుఁ;
బొడలు మెఱయించుఁ; గన్నులఁ పొలప మార్చు;
నొడలు జళిపించుఁ దళతళ లొలయ మీన
వేషి పెన్నీట నిగమ గవేషి యగుచు.
8-721-వ.
అంతకు మున్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచు నవసరంబున భక్త పరాధీనుం డగు హరిఁ దలంచుచు నుండ నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినం గనుంగొని.

భావము :
సత్యవ్రతుడు ప్రళయ కాలం వచ్చి సముద్రజలాలు భూలోకాన్ని ముంచివేయడానికి ముందే భక్తులకు తోడునీడైన భగవంతుణ్ణి ధ్యానించుతున్న సమయంలో శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకి వచ్చింది. ఆ విధంగా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, మేని పొడలు మెరపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ, ఒడలు విరుచుకుంటూ, తళతళలాడుతూ సాగరగర్భంలో విహరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=721

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 29 March 2017

మత్స్యావతార కథ - 16:

8-719-వ.
ఇట్లు లక్ష యోజనాయతం బయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి చొచ్చి.
భావము:
అలా భగవంతుడు శ్రీమహావిష్ణువు లక్ష ఆమడల పొడవైన మత్స్య రూపం ధరించాడు. సముద్రంలో ప్రవేశించి . .. . .
8-720-సీ.
ఒకమాటు జలజంతుయూథంబులోఁగూడు;
నొకమాటు దరులకు నుఱికి వచ్చు;
నొకమాటు మింటికి నుదరి యుల్లంఘించు;
నొకమాటు లోపల నొదిఁగి యుండు;
నొకమాటు వారాశి నొడలు ముంపమిఁ జూచు;
నొకమాటు బ్రహ్మాండ మొరయఁ దలఁచు;
నొకమాటు ఝషకోటి నొడిసి యాహారించు;
నొకమాటు జలముల నుమిసి వైచు;

భావము:
అతడు తళతళలాడే పెనురూపంతో ప్రళయజలాలలో వేదాలకోసం వెదకటానికి పూనుకున్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు. ఒకసారి నీళ్ళ లోపల దాగి ఉంటాడు. ఒకసారి సమద్రంలో మునిగి తేలుతాడు. ఒకసారి బ్రహ్మండాన్ని ఒరసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపల గుంపును పట్టి మ్రింగుతాడు. ఒకసారి నీళ్ళను పీల్చి వెలుపలికి చిమ్ముతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=89&padyam=720

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 27 March 2017

మత్స్యావతార కథ - 15:

8-717-వ.
ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన, వాని జయింపవలసియు, మ్రానుదీఁగెల విత్తనంబుల పొత్తరలు పె న్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్ల కార్యంబులకుం గావలి యగునా పురుషోత్తముం డ ప్పెను రేయి చొరుదల యందు.
8-718-క.
కుఱుగఱులు వలుఁద మీసలు
చిఱుదోకయుఁ బసిఁడి యొడలు సిరిగల పొడలున్
నెఱి మొగము నొక్క కొమ్మును
మిఱుచూపులుఁ గలిగి యొక్క మీనం బయ్యెన్.

భావము:
ఈ విధంగా వేదాలను అపహరించుకు పోయి సముద్రంలో మునిగిన ఆ రాక్షసదొంగ హయగ్రీవుడిని జయించడం కోసమూ; వృక్షాలూ, తీగలూ అన్నింటి విత్తనాలు సమస్తం సముద్రంలో తడసిపోయి పాడయిపోకుండా రక్షించడం కోసమూ; జగత్తులోని సమస్త్ కార్యములకు స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు ఆ ప్రళయకాల ఆరంభంలో మీనరూపం ధరించాడు.... అలా విష్ణుమూర్తి మత్యావతారం ఎత్తాడు. చిన్నచిన్న రెక్కలూ, పెద్దపెద్ద మీసాలూ, పొట్టితోకా, బంగారపు రంగు శరీరమూ, శ్రీకరమైన మచ్చలూ, చక్కని ముఖమూ, ఒక కొమ్మూ, మిరుమిట్లుగొలిపే చూపులు తోటి ఆ మహామత్య రూపం విరాజిల్లుతోంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=718

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 23 March 2017

మత్స్యావతార కథ - 14:



8-715-ఆ.
అలసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి
ముఖము నందు వెడలె మొదలి శ్రుతులు
నపహరించె నొక హయగ్రీవుఁ డను దైత్య
భటుఁడు; దొంగఁ దొడర బరుల వశమె?
8-716-క.
చదువులుఁ దన చేఁ బడినం
జదువుచుఁ బెన్ బయల నుండ శంకించి వడిం
జదువుల ముదుకఁడు గూరుకఁ
జదువుల తస్కరుఁడు చొచ్చె జలనిధి కడుపున్.

భావము:
అలా బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు నిద్రపోయాడు. అతని ముఖాలనుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడు అనే రాక్షసవీరుడు వాటిని దొంగిలించాడు. ఆ హయగ్రీవుడికి తప్ప అలా దొంగతనం చేయడం ఇతరులకు సాధ్యం కాదు. అలా వేదాలను చెరపట్టిన హయగ్రీవుడు వాటిని చదువసాగాడు. బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడిన అతడు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం గమనించి, వేగంగా సమద్రంలోకి వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=716



: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 22 March 2017

మత్స్యావతార కథ - 13:

8-713-వ.
అంత న మ్మహారాత్రి యందు
8-714-మ.
నెఱి నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నిర్మించి వీఁ
పిఱయన్ నీల్గుచు నావులించుచు నజుం డే సృష్టియున్ మాని మే
నొఱఁగన్ ఱెప్పలు మూసి కేల్ దలగడై యుండంగ నిద్రించుచున్
గుఱు పెట్టం దొడఁగెం గలల్ గనుచు నిర్ఘోషించుచున్ భూవరా!

భావము:
అట్టి బ్రహ్మదేవుని రాత్రి సమయం అయిన మహా ప్రళయ కాలంలో. రాజ్యాన్ని ఏలే రాజా పరీక్షిత్తూ! అవిశ్రాంతంగా కూర్చుని ఓర్పుతో ప్రాణులను సృష్టించి జన్మించుట లేని వాడు అగు బ్రహ్మదేవుడు అలసిపోయాడు. వీపు నడుము నొచ్చసాగాయి. అతడు ఒళ్ళు విరుచుకుంటూ, ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపాడు. నడుం వాల్చి, కళ్ళు మూసికొని, చెయ్యి తలగడగా పెట్టుకున్నాడు. గురకలు పెడుతూ కలలు కంటూ ఒళ్ళుతెలియక నిద్రపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=714

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :




Tuesday 21 March 2017

మత్స్యావతార కథ - 11:

8-709-వ.
అంతఁ గల్పాంతంబు డాసిన
8-710-క.
ఉల్లసిత మేఘ పంక్తులు
జల్లించి మహోగ్రవృష్టి జడిగొని కురియన్
వెల్లి విరిసి జలరాసులు
చెల్లెలి కట్టలను దాఁటి సీమల ముంచెన్.

భావము: 
ఇంతలో ప్రళయ సమయం దగ్గరపడగా.... మెరపులతో కూడిన మేఘాలు ఎడతెరపి లేకుండా బహుభయంకరమైన వర్షపు జడులు కురుస్తున్నాయి, సముద్రాలు చెలియలికట్ట దాటి పొంగిపొరలి దేశాలను ముంచేస్తున్నాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=710

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 20 March 2017

మత్స్యావతార కథ - 12:

8-711-వ.
తదనంతరంబ
8-712-తే.
మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర!
బ్రహ్మ మనఁగ నైమిత్తిక ప్రళయ వేళ
నింగిపై నిట్టతొలఁకు మున్నీటిలోనఁ
గూలె భూతాళి జగముల కొలఁదు లెడలి.

భావము:
తరువాత పరీక్షిత్తు మహారాజా! గడచిపోయిన కల్పం అంతం కాగా, బ్రహ్మప్రళయం అనే నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. సముద్రాలు చెలియలి కట్టలు దాటాయి. నిట్టనిలువుగా ఆకాశమంత లేచిన అలల సముద్రంలో లోకాల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రాణులు సమస్తం కూలిపోయాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=88&padyam=712

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 19 March 2017

మత్స్యావతార కథ - 10:



8-707-వ.
మఱియు న న్నావ మున్నీటి కరళ్ళకు లోనుఁ గాకుండ, నిరుఁ గెలం కుల వెనుక ముందట నేమఱకుండఁ, బెన్నెఱుఁలగు నా గఱులన్ జడి యుచుఁ బొడువ వచ్చిన బలుగ్రాహంబుల నొడియుచు సంచరించెద; ఒక్క పెనుఁబాము చేరువ నా యనుమతిం బొడచూపెడు దానంజేసి సుడిగాడ్పుల కతంబున నావ వడిం దిరుగంబడకుండ నా కొమ్ము తుదిం పదిలము చేసి నీకునుఁ దపసులకును నలజడి చెందకుండ మున్నీట ని ప్పాటం దమ్మిచూలి రేయి వేగునంతకు మెలంగెద; నది కారణంబుగా జలచర రూపంబుఁ గయికొంటి; మఱియు నొక ప్రయోజనంబుఁ గలదు; నా మహిమ పరబ్రహ్మం బని తెలియుము; నిన్ను ననుగ్రహించితి" నని సత్యవ్రతుండు చూడ హరి తిరోహితుం డయ్యె; అయ్యవసరంబున.
8-708-ఆ.
మత్స్యరూపి యైన మాధవు నుడుగులుఁ
దలఁచికొనుచు రాచతపసి యొక్క
దర్భశయ్యఁ దూర్పుఁ దలగడగాఁ బండి
కాచి యుండె నాఁటి కాలమునకు.

భావము:
మత్స్యరూపం ధరించిన నేను ఆ ఓడ సముద్రం అలలకు దెబ్బతినకుండా అన్నివైపులా నా పెద్ద ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నావను ముక్కలు చేయడానిక వచ్చే పెద్ద పెద్ద జలచరాలను తరిమేస్తూ ఉంటాను. ఒక పెద్ద పాము నా ఆజ్ఞానుసారం, అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నావను బంధించు. నీకూ మునీశ్వరులకూ చేటు వాటిల్లకుండా ఆ ప్రళయకాలం గడిచేంతవరకు నేను రక్షిస్తూ ఉంటాను. ఇందుకోసమే నేను ఈ మీనరూపం ధరించాను. ఇంకోక విశేష ప్రయోజనం కూడా ఉన్నది అనుకో. పరబ్రహ్మ స్వరూపమైన నా మహిమ తెలుసుకో. మరి నేను నిన్ను అనుగ్రహిస్తాను.” ఇలా పలికి శ్రీమన్నారాయణుడు ఆ సత్యవ్రత మహారాజు చూస్తుండగా అదృశ్యం అయ్యాడు. అలా శ్రీ మహా విష్ణువు చేప రూపంతో చెప్పిన విషయాలను తలచుకుంటూ, తపశ్శాలి అయిన సత్యవ్రత మహారాజు తూర్పువైపుగా తలగడ పెట్టుకుని దర్బల శయ్యమీద పరుండి మీన రూపుడు చెప్పిన ప్రళయ సమయం కోసం వేచి ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=708

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 18 March 2017

మత్స్యావతార కథ - 9:



8-705-వ.
అని పలుకు సత్యవ్రత మహారాజునకు నయ్యుగంబు కడపటఁ బ్రళయ వేళ సముద్రంబున నేకాంతజన ప్రీతుండయి విహరింప నిచ్ఛించి మీన రూపధరుండైన హరి యిట్లనియె.
8-706-సీ.
"ఇటమీఁద నీ రాత్రికేడవదినమునఁ;
బద్మగర్భున కొక్క పగలు నిండు;
భూర్భువాదిక జగంబులు మూఁడు విలయాబ్ధి;
లోన మునుంగు; నాలోనఁ బెద్ద
నావ చేరఁగ వచ్చు; నా పంపు పెంపున;
దానిపై నోషధితతులు బీజ
రాసులు నిడి పయోరాశిలో విహరింపఁ;
గలవు సప్తర్షులుఁ గలసి తిరుఁగ
8-706.1-ఆ.
మ్రోలఁ గాన రాక ముంచు పెంజీఁకటి
మిడుకుచుండు మునుల మేనివెలుఁగుఁ
దొలకుచుండు జలధి దోధూయమాన మై
నావ దేలుచుండు నరవరేణ్య!

భావము:
ఇలా సత్యవ్రత మహారాజు ఈ మత్స్యావతార కారణం చెప్పమని అడిగాడు. ఆ యుగం చివర కాలంలోని ప్రణయవేళ సముద్రంలో ఒంటరిగా సంచరించాలని భావిస్తున్న శ్రీమహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు. “ఓ రాజా! ఈ రాత్రి గడచిన పిమ్మట రాబోయే ఏడవ నాటితో బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తి అవుతోంది. భూలోకం మొదలు మూడులోకాలూ ప్రళయసముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధులు, విత్తనాల రాసులూ ఆ నౌకపై పెట్టుకుని ప్రళయసముద్రంలో విహరించు. సప్తఋషులు నీతో కలిసి ఆ ఓడలో ఉంటారు. మీ ముందు అంతా పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల మేని కాంతులు మిణుకు మిణుకు అంటూ మెరుస్తుంటాయి. సముద్రంలో నావ ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=87&Padyam=706

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 17 March 2017

మత్స్యావతార కథ - 8:



8-703-క.
ఇతరులముఁ గాము చిత్సం
గతులము మా పాలి నీవుఁ గలిగితి భక్త
స్థితుఁడవగు నిన్ను నెప్పుడు
నతి చేసినవాని కేల నాశముఁ గలుగున్.
8-704-క.
శ్రీలలనాకుచవేదికఁ
గేళీపరతంత్రబుద్ధిఁ గ్రీడించు సుఖా
లోలుఁడవు దామసాకృతి
నేలా మత్స్యంబ వైతి వెఱిఁగింపు హరీ!

భావము:
మేము నీకు పరాయివాళ్ళం కాదు. నిర్మల జ్ఞానం కలవాళ్ళము. మాకు అండగా నీవు ఉంటావు. భక్తులలో నివసించే వాడవు నీవు. నీకు నిత్యం నమస్కరించే వాడికి చేటు కలుగనే కలుగదు కదా. హరీ! లక్ష్మీదేవి వక్షస్థలంపై క్రీడిస్తూ సంతోషంగా విహరించే ఆనందస్వరూపుడవు. తామస ప్రకృతితో తిరిగే చేప రూపాన్ని ఎందుకు ధరించావో తెలుపుమయ్యా!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=704

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 16 March 2017

మత్స్యావతార కథ - 7:


8-702-సీ.
ఒక దినంబున శతయోజనమాత్రము;
విస్తరించెదు నీవు; వినము చూడ
మిటువంటి ఝషముల నెన్నఁడు నెఱుఁగము;
మీనజాతుల కిట్టి మేను గలదె?
యేమిటి కెవ్వఁడ? వీ లీలఁ ద్రిప్పెదు;
కరుణ నా పన్నులఁ గావ వేఁడి
యంభశ్చరంబైన హరివి నే నెఱిఁగితి;
నవ్యయ నారాయణాభిధాన
8-702.1-తే.
జనన సంస్థితి సంహార చతురచిత్త!
దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ;
నీదు లీలావతారముల్ నిఖిలభూత
భూతి హేతువుల్ మ్రొక్కెదఁ బురుషవర్య!

భావము:
“ఒక్క రోజులో నూరు యోజనాల మేర పెరిగిపోయావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనివిని ఎరుగము. ఝషజాతులకు ఎక్కడా ఇలాంటి శరీరం ఉండదు. నీవు ఎవరవు? ఎందుకోసం నన్ను తిప్పలమ్మట తిప్పుతున్నావు. దీనులను కాపాడటానికి ఈ మహా మీన రూపం ధరించిన నీవు విష్ణువే అని గతెలుసుకున్నాను. అచ్యుతా! నారాయణా! పురుషోత్తమా! లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకునే మహానుభావుడవు నీవే. దీనులకు, భక్తులకు నీవే దిక్కు. మహిమాన్వితమైన నీ లీలావతారాలు సర్వ ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు మ్రొక్కుతున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=702

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 15 March 2017

మత్స్యావతార కథ - 6:


8-701-వ.
అదియును ముహూర్తమాత్రంబునకు మూఁడు చేతుల నిడుపై యుదంచంబు నిండి పట్టు చాలక వేఱొండుఁ దె మ్మనవుడు నా రాచ పట్టి కరుణాగుణంబునకు నాటపట్టుఁ గావున గండకంబు నొండొక్క చిఱుతమడుఁగున నునిచె; నదియు నా సరోవర జలంబునకు నగ్గలం బై తనకు సంచరింప నది గొంచెం బని పలికినం బుడమిఱేడు మంచి వాఁడగుటం జేసి యా కంచరంబు నుదంచిత జలాస్పదంబైన హ్రదం బునందు నిడియె; నదియు నా సలిలాశయంబునకును నధికంబై పెరుఁగ నిమ్ము చాలదని చెప్పికొనిన నప్పుణ్యుం డొప్పెడి నడవడిం దప్పని వాఁడైన కతంబున న మ్మహామీనంబును మహార్ణవంబున విడిచె; నదియును మకరాకరంబునం బడి రాజున కిట్లను "పెను మొ సళ్ళు ముసరికొని కసిమసంగి మ్రింగెడి; నింతకాలంబు నడపి కడ పట దిగవిడువకు వెడలఁ దిగువు" మని యెలింగింప దెలిసి కడపట యన్నీటితిరుగుడు ప్రోడకుం బుడమిఱేఁ డిట్లనియె.

భావము:
ఒక్క క్షణంలో ఆ మీనం మూడు చేతుల పొడవు పెరిగిపోయి, (ఆంధ్ర వాచస్పతము చెయ్యి = రెండు మూరల పొడవు అంటే మూడడుగులు) ఆ గంగాళం అంతా నిండిపోయింది. చోటు సరిపోక ఇంకొకటి తెమ్మంది. దయానిధి అయిన ఆ రాకుమారుడు ఆ మత్స్యాన్ని చిన్న మడుగులోకి మార్పించాడు. ఆ మడుగుకూడా సరిపోనంత పెరిగిపోయి “నాకు తిరగడానికి చోటు చాలటం లేదు” అంది. ఆ భూపాలకుడు మంచివాడు కనుక ఆ జలచరాన్ని నీరు సమృద్ధిగా ఉన్న పెద్ద సరస్సులో ఉంచాడు. అది కూడా సరిపోనంతా పెరిగిపోయి ఆ మహామత్స్యం చోటు చాలటంలేదని చెప్పుకుంది. బహు దొడ్డ సన్మార్గ చరితుడూ, పుణ్యశీలీ కనుక ఆ మహా మీనాన్ని తీసుకెళ్ళి మహా సముద్రంలో వదిలాడు. సముద్రానికి మొసళ్ళకు నెలవు అని పేరుకదా. “ఈ సముద్రంలో పడ్డ నన్ను పెద్ద మొసళ్ళు చుట్టుముట్టి చంపి తినేస్తాయి. ఇన్నాళ్ళూ కాపాడి, ఇవాళ నన్ను ఇలా వదలివేయకు, బయటకు తీసుకురా” అని మొరపెట్టుకుంది. ప్రాజ్ఞుడైన ఆ మహా జలచరంతో రాజు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=701

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday 14 March 2017

మత్స్యావతార కథ - 5:



8-699-వ.
అనిన విని కరుణాకరుండగు న వ్విభుండు మెల్లన య య్యంభశ్చర డింభకంబునుఁ గమండలు జలంబునం బెట్టి తన నెలవునకుం గొని పోయె, నదియు నొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండ నిమ్ము చాలక రాజన్యున కి ట్లనియె.
8-700-క.
"ఉండ నిదిఁ గొంచె మెంతయు
నొండొకటిం దెమ్ము భూవరోత్తమ!" యనుడున్
గండకముఁ దెచ్చి విడిచెను
మండలపతి సలిల కలశ మధ్యమున నృపా!

భావము:
అలా చేప పిల్ల పలికిన మాటలు విని కరుణాహృదయుడైన ప్రభువు సత్యవ్రతుడు, దానిని తన కమండలంలోని నీళ్ళలోకి ఎక్కించి, తన నివాసానికి తీసుకెళ్ళాడు. ఆ చేప పిల్ల రాత్రి గడిచేసరికి పెరిగి కమండలం నిండి పోయింది. దానికి
ఉండటానికి కమండలంలో చోటు చాలక రాజుతో ఇలా అన్నది. “ఓ రాజేంద్రా! ఈ కమండలం నేను ఉండటానికి సరిపోదు. ఇంకొక దానిని తీసుకురా” అని చేప పిల్ల అంది. సత్యవ్రతుడు దానిని పెద్ద నీళ్ళ గంగాళంలోకి మార్చాడు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=700

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 13 March 2017

మత్స్యావతార కథ - 4:



8-697-ఆ.
వలలు దారు నింక వచ్చి జాలరి వేఁట
కాఱు నేఱు గలఁచి కారపెట్టి
మిడిసి పోవనీక మెడఁ బట్టుకొనియెద;
రప్పు డెందుఁ జొత్తు? ననఘచరిత!
8-698-క.
భక్షించు నొండె ఝషములు
శిక్షింతురు ధూర్తు లొండెఁ; జెడకుండ ననున్
రక్షింపు దీనవత్సల!
ప్రక్షీణులఁ గాచుకంటె భాగ్యము గలదే? "

భావము:
ఓ పుణ్య చరితుడా! ఇంక చేపలు పట్టే జాలారి వాళ్ళు వలలు పట్టుకు వేస్తారు. నదిని కలతపెట్టి నన్ను పట్టుకుంటారు. తప్పించుకుని పోకుండా, మెడ పట్టుకుంటారు అప్పడు ఎక్కడకని పోగలను. ఓ దీనవత్సలా! సత్యవ్రతా! నన్ను పెద్ద చేపలు అయినా తినేస్తాయి. లేదంటే, ధూర్తులు అయిన జాలరులైనా పట్టుకుంటారు. అలా చచ్చిపోకుండా నన్ను కాపాడు. బలహీనులను కాపాడగలిగే అవకాశం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=698

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 12 March 2017

మత్స్యావతార కథ - 3:



8-695-వ.
మఱియు, నొక్కనాఁ డమ్మేదినీ కాంతుండు గృతమాలిక యను నేటి పొంత హరిసమర్పణంబుగా జలతర్పణంబు జేయు చున్న సమ యంబున నా రాజు దోసిట నొక్క మీనుపిల్ల దవిలివచ్చిన నులికిపడి, మరలం దరంగిణీ జలంబు నందు శకుల శాబకంబు విడిచె; నట్లు విడి వడి నీటిలో నుండి జలచరపోతంబు భూతలేశ్వరున కి ట్లనియె.
8-696-మత్త.
"పాపజాతి ఝషంబు లీ
యేటఁ గొండొక మీనుపిల్లల నేఱి పట్టి వధింప న
చ్ఛోటు నుండక నీదు దోసిలి చొచ్చి వచ్చిన నన్ను న
ట్టేటఁ ద్రోవఁగఁ బాడియే? కృప యింత లేక దయానిధీ!

భావము:
ఒకనాడు సత్యవ్రతుడు కృతమాలిక అనే నది వద్ద విష్ణువుకు ప్రీతి కలిగేలా నీళ్ళతో తర్పణం వదులు తున్నాడు. ఆ సమయంలో అతని దోసిలిలోనికి ఒక చేపపిల్ల వచ్చి చేరింది. అతను ఉలిక్కిపడి, ఆ చేపపిల్లను మరల నదినీటిలోకి వదలిపెట్టాడు. ఆ చేపపిల్ల నీటిలోనుండి రాజు సత్యవ్రతుడితో ఇలా అన్నది. “ఓ దయామయా! దయమాలి దాయాదులను చంపే పాపపు జాతి చేపలు ఈ ఏటిలో ఉన్నాయి. అవి చిన్న చేపలను పట్టి మింగేస్తాయి. అందుకే ఇక్కడ ఉండలేక నీ దోసిలి లోనికి వచ్చి చేరాను. దయలేకుండా ఇలా నన్ను నట్టేటిలో వదిలేయం న్యాయం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=696

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 11 March 2017

మత్స్యావతార కథ - 2:



8-693-వ.
అని మునిజనంబులు సూతు నడిగిన నతం డిట్లనియె మీర లడిగిన యీ యర్థంబుఁ బరీక్షిన్నరేంద్రుం డడిగిన భగవంతుం డగు బాదరా యణి యిట్లనియె.
8-694-సీ.
విభుఁ డీశ్వరుఁడు వేదవిప్రగోసురసాధు;
ధర్మార్థములఁ గావఁ దనువుఁ దాల్చి,
గాలిచందంబున ఘనరూపములయందుఁ;
దనురూపములయందుఁ దగిలియుండు;
నెక్కువఁ దక్కువ లెన్నఁడు నొందక;
నిర్గుణత్వంబున నెఱియు ఘనుఁడు;
గురుతయుఁ గొఱఁతయు గుణసంగతివహించు;
మనుజేశ! చోద్యమే మత్స్య మగుట?
8-694.1-తే.
వినుము పోయిన కల్పాంతవేళఁ దొల్లి
ద్రవిళదేశపురాజు సత్యవ్రతుండు
నీరు ద్రావుచు హరిఁగూర్చి నిష్ఠతోడఁ
దపముఁ గావించె నొకయేటి తటము నందు.

భావము:
అంటూ మీనావతారం కథ వివరించమని శౌనకాదులు అడిగారు. అంతట సూతమహర్షి వారితో ఇలా అన్నాడు “మీరు అడిగినట్లే పరీక్షిత్తు అడిగితే, భగవత్స్వరూపుడు అయిన శుకమహర్షి ఇలా చెప్పాడు. “వినుము పరీక్షిత్తు మహారాజా! ప్రభువు అయిన విష్ణుమూర్తి వేదాలనూ, బ్రాహ్మణులనూ, గోవులనూ, దేవతలనూ, సజ్జనులనూ, ధర్మాన్నీ, అర్థాన్ని రకించడం కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. వాయువులాగే గొప్పరూపాలలోనూ, సూక్ష్రూపాలలోనూ చేరి ఉంటాడు. ఎక్కువ తక్కువలు లేని గుణరహితుడై శాశ్వత నిర్గుణ పరబ్రహ్మము అయినప్పటికీ, అతను గొప్పదనాన్నీ, తక్కువతనాన్నీ. గుణాల కలయికనూ పొందుతూ ఉంటాడు. అందువలన అతడు చేపరూపు ధరించి మత్స్యవతారం ధరించడంలో ఆశ్చర్యం లేదు. పోయిన కల్పం పూర్తి అవుతున్న సమయంలో సత్యవ్రతుడు అనే ద్రవిడదేశపు రాజు కేవలం నీళ్ళే ఆహారంగా తీసుకుంటూ నది గట్టుమీద విష్ణుని గూర్చి తపస్సు చేసేవాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=694

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :




Friday 10 March 2017

మత్స్యావతార కథ - 1:

8-692-సీ.
విమలాత్మ! విన మాకు వేడ్క యయ్యెడి; మున్ను;
హరి మత్స్యమైన వృత్తాంతమెల్లఁ;
గర్మబద్ధుని భంగి ఘనుఁ డీశ్వరుఁడు లోక;
నిందితంబై తమోనిలయమైన
మీనరూపము నేల మే లని ధరియించె? ;
నెక్కడ వర్తించె? నేమి చేసె?
నాద్యమై వెలయు న య్యవతారమునకు నె;
య్యది కారణంబు? గార్యాంశ మెట్లు?
8-692.1-ఆ.
నీవు దగుదు మాకు నిఖిలంబు నెఱిఁగింపఁ
దెలియఁ జెప్పవలయు, దేవదేవు
చరిత మఖిలలోక సౌభాగ్య కరణంబు
గాదె? విస్తరింపు క్రమముతోడ.

భావము:
“సూతమహర్షి! నీవు బహునిర్మల హృదయం కలవాడవు. పూర్వం విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు కదా, ఆ కథ అంతా వినాలని బాగా ఆసక్తిగా ఉంది. కర్మానికి కట్టుబడి ఉండే జీవుడు లోకంలో గౌరవమూ, జ్ఞానమూ లేని చేపగా పుడుతూ ఉండవచ్చు గానీ, భగవంతుడు అయిన విష్ణుమూర్తి ఎందుకు అలాంటి చేపరూపు ఏదో మంచిది అన్నట్లు ధరించాడు? అలా ధరించి ఎక్కడ ఉన్నాడు? ఏమి కార్యాలు సాధించాడు? అవతారాలలో మొదటి వరుసలోది అయిన ఆ మీనావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? ఇవన్నీ వివరంగా తెలుపడానికి నివే సమర్థుడవు. దేవాధిదేవుడు విష్ణుమూర్తి కథలు సకల లోకాలకూ మేలు చేకూర్చేవి కదా, కనుక ఈ వృత్తాంత సవివరంగా విశదీకరించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=692

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 9 March 2017

త్రిపురాసుర సంహారం - 13:



7-406-ఆ.
తృణకణముల భంగి ద్రిపురంబుల దహించి
పరముఁ డవ్యయుండు భద్రయశుఁడు
శివుఁడు పద్మజాది జేగీయమానుఁ డై
నిజనివాసమునకు నెమ్మిఁ జనియె.

టీకా:
తృణ = గడ్డి; కణముల = పోచల; భంగిన్ = వలె; పురంబులన్ = పురములను; దహించి = కాల్చేసి; పరముడు = శ్రేష్ఠుడు; అవ్యయుండు = నాశములేని వాడు; భద్రయశుడు = శుభకీర్తి గలవాడు; శివుడు = పరమశివుడు; పద్మజ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగువారిచే; జేగీయమానుడు = స్తుతింపబడినవాడు; ఐ = అయ్యి; నిజనివాసమున్ = తనతావు (కైలాసము)న; కున్ = కు; నెమ్మిన్ = ప్రీతితో; చనియె = వెళ్ళెను.

భావము:
అగ్ని దేవుడు ఎండుగడ్డిని దహించినంత సుళువుగా; శాశ్వతుడు, భద్రయశుడు అయిన పరమేశ్వరుడు త్రిపురాలను కాల్చివేశాడు; పద్మసంభువు డైన బ్రహ్మదేవుడు మున్నగువారి పూజ లందుకుని తన నివాసమైన కైలాసానికి వెళ్ళాడు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=406

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 8 March 2017

త్రిపురాసుర సంహారం - 12:



7-405-వ.
ఇట్లు హరుండు దురవగాహంబు లైన త్రిపురంబుల నభిజిన్ముహూర్తంబున భస్మంబు చేసి కూల్చిన, నమర గరుడ గంధర్వ సాధ్య యక్ష వల్లభులు వీక్షించి జయజయశబ్దంబులు జేయుచుఁ గుసుమ వర్షంబులు వర్షించిరి; ప్రజలు హర్షించిరి; బ్రహ్మాదులు గీర్తించి; రప్సరసలు నర్తించిరి; దివ్య కాహళ దుందుభి రవంబులును మునిజనోత్సవంబులును బ్రచురంబు లయ్యె; నిట్లు విశ్వజనీనం బగు త్రిపురాసురసంహారంబున నఖిలలోకులును సంతసిల్లి యుండ నయ్యవసరంబున.

టీకా:
ఇట్లు = ఈ విధముగ; హరుండు = పరమ శివుడు; దురవగాహంబులు = చొరశక్యము గానివి; ఐన = అయిన; త్రి = మూడు; పురంబులన్ = పురములను; అభిజిన్ముహూర్తంబునన్ = మిట్ట మధ్యాహ్నము {అభిజిన్ముహూర్తము - పగలు (సూర్యోదయమునుండి) పద్నాలుగు గడియల (సుమారు 14x30ని. అనగా ఒంటిగంట) సమయము, మిట్ట మధ్యాహ్నము}; భస్మము = బూడిద; చేసి = చేసి; కూల్చినన్ = నాశనముచేయగా; అమర = దేవతల; గరుడ = గరుడుల; గంధర్వ = గంధర్వుల; సాధ్య = సాధ్యుల; యక్ష = యక్షుల; వల్లభులు = ప్రభువులు; వీక్షించి = చూసి; జయజయ = జయజయ యనెడి; శబ్దంబులు = ధ్వానంబులు; చేయుచున్ = చేయుచు; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; వర్షించిరి = కురిసిరి; ప్రజలు = లోకులు; హర్షించిరి = సంతోషించిరి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలగువారు; కీర్తించిరి = నుతించిరి; అప్సరసలు = అప్సరసలు; నర్తించిరి = నాట్యములుచేసిరి; దివ్య = దివ్యమైన; కాహళ = కాహళుల; దుందుభి = దుందుభుల; రవంబులును = శబ్దములు; మునిజనుల = మునులయొక్క; ఉత్సవంబులునున్ = వేడుకలు; ప్రచురంబులు = వెల్లడి; అయ్యెన్ = అయ్యెను; ఇట్లు = ఈ విధముగ; విశ్వజనీనంబు = ఎల్లజనులకు మేలుకొరకైనది; అగు = అయిన; త్రిపుర = త్రిపురములందలి; అసుర = రాక్షసులను; సంహారంబునన్ = నాశనమువలన; అఖిల = సమస్తమైన; లోకులును = ప్రజలు; సంతసిల్లి = సంతోషించి; ఉండన్ = ఉండగా; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.

భావము:
అలా మహాదేవుడు దుర్భేధ్యాలయిన త్రిపురాలను మిట్టమధ్యాహ్న సమయంలో భస్మం చేసి కూల్చివేశాడు; ఇది చూసి దేవతలూ, గరుడులూ, గంధర్వులూ, సిద్ధులూ, సాధ్యులూ, యక్ష నాయకులు జయజయ నినాదాలు చేశారు; పూలవానలు కురిపించారు; బ్రహ్మదేవుడు మున్నగు వారంతా హరుని హర్షంతో ప్రస్తుతించారు; అప్సరసలు ఆనందంతో ఆడారు; మునిజనులు ఉత్సవం జరుపుకున్నారు; దివ్య కాహళుల, దుందుభుల శబ్దాలు మిన్నుముట్టాయి; ఇలా పరమేశ్వరుడు విశ్వకల్యాణకర మగునట్లు త్రిపురాసుర సంహారం చేయటంతో సకల లోకాల లోని ప్రజలూ సంతసించారు

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=405

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday 7 March 2017

త్రిపురాసుర సంహారం - 11:



7-404-మ.
శరి యై కార్ముకి యై మహాకవచి యై సన్నాహి యై వాహి యై
సరథుండై సనియంత యై సబలుఁడై సత్కేతనచ్ఛత్రుఁ డై
పరమేశుం డొక బాణమున్ విడిచెఁ దద్బాణానలజ్వాలలం
బురముల్ కాలె ఛటచ్ఛటధ్వని నభోభూమధ్యముల్ నిండగన్.

టీకా:
శరి = బాణముగలవాడు; ఐ = అయ్యి; కార్ముకి = విల్లుధరించినవాడు; ఐ = అయ్యి; మహా = గొప్ప; కవచి = డాలు ధరించినవాడు; ఐ = అయ్యి; సన్నాహి = పూనికగలవాడు; ఐ = అయ్యి; వాహి = వాహనమెక్కినవాడు; ఐ = అయ్యి; సరథుండు = రథముకూడినవాడు; ఐ = అయ్యి; సనియంత = రథసారథ ికూడినవాడు; ఐ = అయ్యి; సబలుడు = సైన్యముతో కూడినవాడు; ఐ = అయ్యి; స = మంచి; కేతన = జండా; ఛత్రుడు = గొడుగులుగలవాడు; ఐ = అయ్యి; పరమేశుండు = పరమశివుడు; ఒక = ఒక; బాణమున్ = బాణమును; విడిచెన్ = ప్రయోగించెను; తత్ = ఆ; బాణ = బాణము యొక్క; అనల = అగ్ని; జ్వాలలన్ = మంటలలో; పురముల్ = పురములు; కాలెన్ = కాలిపోయెను; ఛటఛట = ఛటఛట మనియెడి; ధ్వని = శబ్దము; నభః = ఆకాశము; భూ = భూమి; మధ్యముల్ = మధ్యప్రదేశములు; నిండగన్ = నిండిపోగా.

భావము:
పరమశివుడు కవచం ధరించాడు, విల్లు పినాకిని పట్టుకున్నాడు. అమ్ము అందుకున్నాడు. రథం నడపటానికి సారథి, జండా, గొడుగు, సైన్యం అన్నీ సిద్దం అయ్యాయి. పరమేశ్వరుడు రథం అధిరోహించాడు. సర్వసన్నాహాలతో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఒక బాణాన్ని గురిచూసి ప్రయోగించాడు. ఆ బాణం నుండి అగ్ని జ్వాలలు వెలువడి చెలరేగాయి. ఆ మహా బాణాగ్ని జ్వాలలలో ఆ త్రిపురాలు మూడూ ఒక్కసారిగా భగ్గువ మండిపోయాయి. ఛటఛట ధ్వనులు చెలరేగి భూమ్యాకాశాల మధ్యభాగం అంతా నిండిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=402

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 6 March 2017

త్రిపురాసుర సంహారం - 10:

7-402-ఆ.
అమరు లైన దనుజు లైనను నరు లైన
నెంత నిపుణు లైన నెవ్వరైన
దైవికార్థచయముఁ దప్పింపఁగా లేరు
వలదు దనుజులార! వగవ మనకు.
7-403-వ.
అని పలికె; అంత విష్ణుండు నైజంబు లైన ధర్మవిజ్ఞానవిద్యాతపో విరక్తి సమృద్ధి క్రియాశక్తివిశేషంబుల శంభునికిఁ బ్రాధాన్యంబు సమర్పించి రథసూత కేతు వర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు చేసినం గైకొని.

టీకా:
అమరులు = దేవతలు {అమరులు - మరణములేనివారు, దేవతలు}; ఐనన్ = అయినను; దనుజులు = రాక్షసులు {దనుజులు - కశ్యపునకు దనువు యందు కలిగిన సంతానము, రాక్షసులు}; ఐనను = అయినను; నరులు = మానవులు; ఐనన్ = అయినను; ఎంత = ఎంత; నిపుణులు = నేర్పరులు; ఐనన్ = అయినను; ఎవ్వరు = ఎవరు; ఐనన్ = అయినను; దైవిక = దైవమువలన ప్రాప్తించెడి; అర్థ = విషయముల; చయమున్ = సమూహములను; తప్పింపగా = తొలగించుటకు; లేరు = సమర్థులుకారు; వలదు = వద్దు; దనుజులారా = రాక్షసులూ; వగవన్ = దుఃఖపడుటకు; మన = మన; కున్ = కు.అని = అని; పలికె = చెప్పెను; అంతన్ = అంతట; విష్ణుండు = విష్ణుమూర్తి; నైజంబులు = తనవి; ధర్మ = న్యాయము; విజ్ఞాన = విజ్ఞానము; విద్య = విద్య; తపస్ = తపస్సు; విరక్తి = వైరాగ్యము; సమృద్ధి = నిండుదనము; క్రియాశక్తి = కర్మసామర్థ్యముల; విశేషంబులన్ = అతిశయములను; శంభునికి = శివునికి; ప్రాధాన్యంబు = ముఖ్యత్వము; సమర్పించి = ఇచ్చి; రథ = రథము; సూత = సారథి; కేతు = జండా; వర్మ = డాలు; బాణాసన = విల్లు; ప్రముఖ = మొదలైన; సంగ్రామ = యుద్ద; సాధనంబులు = పరికరములు; చేసినన్ = కలిగించగా; కైకొని = చేపట్టి.

భావము:
“రక్కసుల్లారా! దైవేచ్ఛ ఇలా ఉంది కాబోలు. దైవేచ్ఛను తప్పించటం ఎవరి తరమూ కాదు. అమరులైనా, అసురులైనా నరులైనా ఎంతటివారైనా విధివిలాసాన్ని మార్చలేరు కదా. దీనికి మనం దుఃఖించరాదు.” ఇలా పలికి మయుడు రాక్షసులను ఓదార్చాడు. అటుపిమ్మట విష్ణువు తన సహజశక్తులైన ధర్మం, జ్ఞానం, విద్య, తపస్సు, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో రథం, సారథి, కేతనం, కవచం, విల్లు, అమ్ములు మున్నగు యుద్ధసామగ్రి అంతా సమకూర్చాడు. రథికుడైన శివుడు స్వీకరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=402

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 5 March 2017

త్రిపురాసుర సంహారం - 9:



7-400-శా.
ఉత్సాహంబున నొక్క పాఁడిమొదవై యూథంబు ఘ్రాణించుచున్
వత్సంబై తనవెంట బ్రహ్మ నడవన్ వైకుంఠుఁ డేతెంచి యు
ద్యత్సత్త్వంబునఁ గూపమధ్య రసముం ద్రావెన్ విలోకించుచుం
దత్సౌభాగ్యనిమగ్ను లై మఱచి రా దైత్యుల్ నివారింపఁగన్.
7-401-వ.
ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేను వయి వచ్చి త్రిపుర మధ్య కూపామృతరసంబు ద్రావిన నెఱింగి శోకాకులచిత్తు లయిన రసకూపపాలకులం జూచి మహాయోగి యైన మయుండు వెఱఁగుపడి దైవగతిం జింతించి శోకింపక యిట్లనియె.

టీకా:
ఉత్సాహంబునన్ = వేడుకతో; ఒక్క = ఒక; పాడి = పాలిచ్చెడి; మొదవు = ఆవు; ఐ = అయ్యి; ఊథంబున్ = పొదుగును; ఘ్రాణించుచున్ = మూర్కొనుచు; వత్సంబు = దూడ; ఐ = అయ్యి; తన = తన; వెంటన్ = కూడ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నడవన్ = నడచిరాగా; వైకుంఠుండు = విష్ణుమూర్తి; ఏతెంచి = వచ్చి; ఉద్యత్సత్త్వంబునన్ = గొప్పగడుసుదనముతో; కూప = బావి; మధ్య = లోనున్న; రసమున్ = సిద్దరసమును; త్రావెన్ = తాగివేసెను; విలోకించుచన్ = చూచునుండి; తత్ = దాని; సొభాగ్య = చక్కదనమునందు; నిమగ్నులు = తగుల్కొన్నవారు; ఐ = అయ్యి; మఱచిరి = మరచిపోయిరి; ఆ = ఆ; దైత్యుల్ = రాక్షసులు; నివారింపగన్ = అడ్డగించుటను. ఇట్లు = ఈ విధముగ; విష్ణుండు = విష్ణుమూర్తి; మోహన = మోహింజేసెడి; ఆకారంబునన్ = ఆకారముతో; ధేనువు = ఆవు; అయి = అయ్యి; వచ్చి = వచ్చి; త్రిపుర = త్రిపురముల; మధ్య = నడిమి; కూప = బావియందలి; అమృత = అమృతపు; రసంబు = ద్రవమును; త్రావినన్ = తాగేయగా; ఎఱింగి = తెలిసికొని; శోక = దుఃఖముచే; ఆకుల = కలతబారిన; చిత్తులు = మనసులుగలవారు; అయిన = ఐన; రస = అమృతరసపు; కూప = బావి; పాలకులన్ = కాపలాదారులను; చూచి = చూసి; మహా = గొప్ప; యోగి = యోగబలముగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; దైవగతిన్ = విధివిలాసమును; చింతించి = విచారించి; శోకింపక = దుఃఖింపక; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
విష్ణుమూర్తి ఉత్సాహవంతమైన అందమైన పాడి ఆవు అయ్యాడు. బ్రహ్మదేవుడు ఆ పాడి ఆవు పొదుగు చుంబించే చిన్నారి ఆవుదూడగా మారాడు. ఆ ఆవుదూడలు జగన్మోహనంగా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా వచ్చి ఆ సిద్ధబావిలోని సిద్ధరసం త్రాగుతున్నాయి. దానిని కాపలా కాస్తున్న రాక్షస భటులు వాటి అందచందాలు చూస్తూ వాటిని తోలటమే మరచిపోయారు. ఆవు దూడలు ఆ కూపంలోని సిద్ధరసం అంతా పూర్తిగా త్రాగేశాయి. అలా విష్ణుమూర్తి మోహనాకారంలో పాడిఆవుగా వచ్చి త్రిపురాల మధ్య గల బావిలోంచి సిద్ధరసం అంతా త్రాగేసిన విషయం తెలుసుకుని, ఆ కూపపాలకులు గుండెలు బాదుకుని దుఃఖించారు. వారిని చూసి మహాయోగి అయిన మయుడు జరిగినది తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అది విధివిలాసంగా గ్రహించి దుఃఖించక ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=400

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 4 March 2017

త్రిపురాసుర సంహారం - 8:


7-398-క.
సిద్ధామృతరస మహిమను
శుద్ధమహావజ్రతుల్య శోభిత తను లై
వృద్ధిం బొందిరి దానవు
లుద్ధత నిర్ఘాత పావకోపము లగుచున్.
7-399-క.
కూపామృత రససిద్ధిని
దీపితులై నిలిచి యున్న దేవాహితులన్
రూపించి చింత నొందెడు
గోపధ్వజుఁ జూచి చక్రి కుహనాన్వితుఁడై.

టీకా:
సిద్ధ = యోగసిద్దమైన; అమృత = అమృతపు; రస = ద్రవము యొక్క; మహిమను = ప్రభావముచేత; శుద్ధ = స్వచ్ఛమైన; మహా = గొప్ప; వజ్ర = వజ్రముతో; తుల్య = సమానమైన; శోభిత = ప్రకాశించెడి; తనులు = దేహములు గలవారు; ఐ = అయ్యి; వృద్ధింబొందిరి = పెంపొందిరి; దానవులు = రాక్షసులు; ఉద్ధతన్ = అతిశయముతో; నిర్ఘాత = పిడుగులలోని; పావక = నిప్పులకు; ఉపములు = పోల్చదగినవారు; అగుచున్ = అగుచు. కూప = బావిలోని; అమృత = అమృతపు; రస = ద్రవము; సిద్ధిని = ఫలించుటచేత; దీపితులు = ప్రకాశించెడివారు; ఐ = అయ్యి; నిలిచి = బతికి; ఉన్న = ఉన్నట్టి; దేవాహితులన్ = రాక్షసులను; రూపించి = కనిపెట్టి; చింతన్ = విచారమును; ఒందెడు = పొందుచున్న; కోపద్వజునిన్ = పరమశివుని {కోపద్వజుడు - వృషభము ద్వజము (జండా) గా గలవాడు, శివుడు}; చూచి = చూసి; చక్రి = విష్ణుమూర్తి {చక్రి - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; కుహన = మాయావిలాసముతో; ఆన్వితుండు = కూడినవాడు; ఐ = అయ్యి.

భావము:
ఆ సిద్ధరస ప్రభావం వలన ఆ రక్కసులందరూ పునరుజ్జీవితులు అయ్యారు, వజ్రాల వంటి దృఢమైన దేహాలతో చిచ్చర పిడుగుల వలె బలసంపన్నులు అయ్యారు. మయుని సిద్ధరస కూపం ప్రభావం వల్ల రాక్షసులు ఇలా ప్రబలి విజృంభించటం, తన బాణశక్తి వ్యర్థం కావటం తెలిసి మహాశ్వరునకు బాధ కలిగింది. తన పరాక్రమానికి కళంకం ఏర్పడిందని, తన కీర్తికి మచ్చ కలిందని చింతించాడు. విష్ణుమూర్తి ఇది తెలుసుకుని ఉపాయం ఆలోచించాడు. మాయగాళ్ళను మాయల తోటే మట్టుపెట్టాలని నిశ్చయించుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=399

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 3 March 2017

త్రిపురాసుర సంహారం - 7:

7-397-వ.
అనిన భక్తవత్సలుం డగు పరమేశ్వరుండు శరణాగతు లైన గీర్వాణుల వెఱవకుం డని దుర్వారబలంబున బాణాసనంబుఁ గేల నందికొని యొక్క దివ్యబాణంబు సంధించి త్రిపురంబులపయి నేసిన మార్తాండమండలంబున వెలువడు మయూఖజాలంబుల చందంబునఁ దద్బాణంబువలన దేదీప్యమానంబులై యనేక బాణసహస్రంబులు సంభవించి భూ నభోంతరాళంబులు నిండి మండి తెప్పలుగాఁ గుప్పలు గొని త్రిపురంబుల పయిఁ గప్పె; నప్పుడు తద్బాణపావక హేతిసందోహ దందహ్యమాను లై గతాసు లయిన త్రిపురపుర నివాసులం దెచ్చి మహాయోగి యైన మయుండు సిద్ధరసకూపంబున వైచిన.

టీకా:
అనినన్ = అనగా; భక్తవత్సలుండు = పరమశివుడు {భక్తవత్సలుడు - భక్తులయెడ వాత్సల్యముగలవాడు, శివుడు}; అగు = అయిన; పరమేశ్వరుండు = పరమశివుడు {పరమేశ్వరుడు - పరమ (అత్యుత్తమమైన) ఈశ్వరుడు (ప్రభువు), శివుడు}; శరణ = శరణుగోరి; ఆగతులు = వచ్చినవారు; ఐన = అయిన; గీర్వాణులన్ = దేవతలను {గీర్వాణులు - శాపరూపమగు వాక్కు (బాణముగా) గలవారు, దేవతలు}; వెఱవకుండు = బెదరకండి; అని = అని; దుర్వార = వారింపశక్యముగాని; బలంబునన్ = శక్తితో; బాణాసనంబున్ = విల్లును; కేలన్ = చేతిలోకి; అందికొని = తీసుకొని; ఒక్క = ఒక; దివ్య = దివ్యమైన; బాణంబున్ = బాణమును; సంధించి = ఎక్కుపెట్టి; త్రిపురంబుల్ = త్రిపురముల; పయిన్ = మీద; ఏసిన = ప్రయోగించగా; మార్తాండ = సూర్య {మార్తాండుడు - బ్రహ్మాండము మృతి (రెండు చెక్కలగునప్పుడు) పుట్టినవాడు, సూర్యుడు}; మండలంబునన్ = మండలమునుండి; వెలువడు = వెలువడెడి; మయూఖ = కిరణముల; జాలంబుల = సమూహముల; చందంబునన్ = వలె; తత్ = ఆ; బాణము = బాణము; వలన = నుండి; దేదీప్యమానంబులు = మిక్కిల ివెలుగుచున్నవి; ఐ = అయ్యి; అనేక = పలు; బాణ = బాణముల; సహస్రంబులు = వేలకొలది; సంభవించి = పుట్టి; భూ = భూమి; నభో = ఆకాశము; అంతరాళంబులు = మధ్యప్రదేశములు; నిండి = నిండిపోయి; మండి = కాలిపోయి; తెప్పలు = తుట్టలు; కాన్ = అయినట్లు; కుప్పలుకొని = గుంపులై; త్రిపురంబుల్ = త్రిపురముల; పయిన్ = మీద; కప్పెన్ = కప్పివేసెను; అప్పుడు = అప్పుడు; తత్ = ఆ; బాణ = బాణము యొక్క; పావక = అగ్ని; హేతి = మంటల; సందోహ = సమూహమునకు; దందహ్యమానులు = మిక్కలికాలిపోయినవారు; ఐ = అయ్యి; గతాసులు = పోయిన ఊపిరిగలవారు; అయిన = ఐనట్టి; త్రిపుర = త్రిపురములలో; నివాసులన్ = వసించెడివారిని; తెచ్చి = తీసుకొచ్చి; మహా = గొప్ప; యోగి = యోగబలముగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; సిద్ధరస = అమృతపు; కూపంబునన్ = బావిలో; వైచినన్ = వేయగా.

భావము:
అని ఇలా దేవతలు మొరపెట్టగా, పరమ భక్తవశంకరుడగు శంకరుడు కరుణించి, అభయహస్తం ఇచ్చాడు. అవక్రపరాక్రమంతో ధనుస్సు చేతపట్టాడు. దివ్యమైన అగ్నేయాస్త్రం గురిపెట్టి త్రిపురాలపైకి వేశాడు. ఆ బాణం వలన చండ ప్రచండమైన సూర్యమండలంలో వెలిగే కిరణాల సమూహాల వంటి అగ్నిశిఖలు సహస్రముఖాలుగా వెలువడి భూమ్యాకాశాలు నిండి, మండి, నిప్పులు తెప్పలు తెప్పలుగా కురుస్తూ త్రిపురాలను చుట్టుముట్టాయి. ఆ బాణాగ్ని శిఖల సందోహానికి దానవులు దహించుకు పోయి ప్రాణాలు విడిచారు. అపుడు మహాయోగి అయిన మయుడు తన యోగబలంతో, సిద్ధరసంతో నిండిన కూపంలో అసువులు బాసిన త్రిపుర వాసులైన అసురులను తెచ్చి వేశాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=397

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 2 March 2017

త్రిపురాసుర సంహారం - 6:

7-395-క.
త్రిపురాలయు లగు దానవు
లపరాజితు లగుచు మాకు నశ్రాంతంబున్
వపురాదిపీడఁ జేసెద
రపరాధికులను వధింపు మగజాధీశా!
7-396-క.
దీనులము గాక యుష్మద
ధీనులమై యుండు మేము దేవాహిత దో
ర్లీనుల మైనారము బల
హీనుల మగు మమ్ముఁ గావు మీశాన! శివా!

టీకా:
త్రిపుర = త్రిపురములు; ఆలయులు = నివాసములుగాగలవారు; అగు = అయిన; దానవులు = రాక్షసులు; అపరాజితులు = ఓడింపశక్యముకానివారు; అగుచున్ = అగుచు; మా = మా; కున్ = కు; అశ్రాంతమున్ = ఎల్లప్పుడును; వపుర = శరీరము; ఆది = మొదలగువానికి; పీడన్ = బాధలను; చేసెదరు = కలిగించెదరు; అపరాధికులను = ద్రోహులను; వధింపుము = చంపుము; అగజాధీశ = పరమశివ {అగజాధీశుడు - అగజ (పర్వతునికూతురైన పార్వతి) యొక్క అధీశుడు (భర్త), శివుడు}. దీనులము = అల్పులము; కాక = కాకుండగ; యుష్మత్ = నీకు; అధీనులము = స్వాధీనులము; ఐ = అయ్యి; ఉండు = ఉండెడి; మేము = మేము; దేవాహిత = రాక్షసుల {దేవాహితులు - దేవతలకు అహితులు, రాక్షసులు}; దోః = భుజబలమునకు; లీనులము = లొంగువారము; ఐనారము = అయిపోతిమి; బలహీనులము = శక్తిలేనివారము; అగు = అయిన; మమ్మున్ = మమ్ములను; కావుము = కాపాడుము; ఈశాన = ఈశ్వర; శివా = పరమశివ.



భావము:
“ఓ పార్వతీపతీ! శంకరా! త్రిపురాలలో ఉంటున్న రాక్షసులు చేసే అరాచకాలకు అంతం లేకుండా పోయింది. వాళ్ళు అజేయులై నిత్యం లోకాలను తల్లడిల్ల జేస్తున్నారు. మా ప్రాణాలకు ఆపదలు తెస్తున్నారు. తప్పుజేస్తున్న వారిని శిక్షించు ప్రభూ! నీ అధీనంలో దీనత్యంలేని నిరంతరం దివ్యానందంతో ఉండేవాళ్లం. అలాంటి మేము ఇదిగో ఈ సురారులైన రాక్షసుల చేతిలో పడిపోయి, దీనులమూ బలహీనులమూ కావలసివచ్చింది. మమ్మల్ని కాపాడు పరమశివా! ఈశానప్రభూ!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=396

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 1 March 2017

త్రిపురాసుర సంహారం - 5:

7-393-క.
లోకాధినాథు లెల్లను
శోకాతురు లగుచు శరణు జొచ్చిరి దుష్టా
నీక విదళనాకుంఠున్
శ్రీకంఠున్ భువనభరణ చిత్తోత్కంఠున్.
7-394-వ.
ఇట్లు సకలలోకేశ్వరుం డగు మహేశ్వరుం జేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి.

టీకా:
లోకాధినాథులు = లోకపాలకులు; ఎల్లను = అందరు; శోక = దుఃఖముచే; ఆతురులు = పీడింపబడినవారు; అగుచున్ = అగుచు; శరణు = రక్షణకై; చొచ్చిరి = ఆశ్రయించిరి; దుష్టానీకవిదళనాకుంఠున్ = పరమశివుని {దుష్టానీకవిదళనాకుంఠుడు - దుష్ట (రాక్షసుల) అనీక (సైన్యమును) విదళన (చీల్చివేయుటయందు) అకుంఠున్ (అనర్గళుడు), శివుడు}; శ్రీకంఠున్ = పరమశివుని {శ్రీకంఠుడు - (క్షీరసాగర మధనమున పుట్టిన హాలాహలమును మింగుటవలన) శోభ కంఠమునగలవాడు, శివుడు}; భువనభరణచిత్తోత్కంఠున్ = పరమశివుని {భువనభరణచిత్తోత్కంఠుడు - భువన (లోకములన) భరణ (కాపాడుట యందు) చిత్త (హృదయమున) ఉత్కంఠుడు (ఉత్కంఠ గలవాడు), శివుడు}. ఇట్లు = ఈ విధముగ; సకలలోకేశ్వరుడు = పరమశివుడు {సకలలోకేశ్వరుడు - ఎల్లలోకములకు ప్రభువు, శివుడు}; మహేశ్వరున్ = పరమశివుని {మహేశ్వరుడు - గొప్ప ఈశ్వరుడు, శివుడు}; చేరి = చేరి; లోకపాలకులు = లోకేశులు; ప్రణతులు = నమస్కరించిన వారు; ఐ = అయ్యి; పూజించి = పూజలుచేసి; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములు; ముకుళించి = జోడించి.

భావము:
దిక్పాలకులు అందరు రక్కసుల బాధలు భరించలేక శోకార్తులు అయ్యారు. అపుడు వారందరూ వెళ్ళి లోకశుభంకరుడూ, దుష్టనాశంకరుడూ అయిన శంకరుని శరణువేడారు. లోకేశ్వరుడగు పరమేశ్వరుని ఇలా చేరి లోకపాలకులు నమస్కరించి పూజించారు.కమలాల వంటి తమ చేతులు జోడించి ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=393

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...