Friday 28 April 2017

దక్షయాగము - 16:



4-58-సీ.
తనరారు నవరత్న తాటంక రోచులు;
చెక్కుటద్దములతోఁ జెలిమి చేయఁ;
మహనీయ తపనీయమయ పదకద్యుతు;
లంసభాగంబుల నావరింప;
నంచిత చీనిచీనాంబర ప్రభలతో;
మేఖలాకాంతులు మేలమాడఁ;
జంచల సారంగ చారు విలోచన;
ప్రభలు నల్దిక్కులఁ బ్రబ్బికొనఁగ;
4-58.1-తే.
మించు వేడుక భర్తృసమేత లగుచు
మానితంబుగ దివ్య విమానయాన
లగుచు నాకాశపథమున నరుగుచున్న
ఖచర గంధర్వ కిన్నరాంగనలఁ జూచి.

టీకా:
తనరారు = అతిశయించిన; నవరత్న = నవరత్నములు పొదిగిన; తాటంక = చెవిదిద్దుల; రోచులు = కాంతులు; చెక్కుడు = చెంపలను; అద్దముల్ = అద్దముల; తోన్ = తోటి; చెలిమి = స్నేహము; చేయన్ = చేస్తుండగ; మహనీయ = గొప్ప; తపనీయ = బంగారముతో; మయ = చేయబడిన; పదక = పతకముల; ద్యుతులు = కాంతులు; అంసభాగములన్ = భుజములపైన; ఆవరింపన్ = పరచుకొనగా; అంచిత = పూజనీయమైన; చీనిచీనాంబర = సన్ననిపట్టువస్త్రముల {చీనిచీనాంబరము - చీనీ (చైనా దేశమునుండి వచ్చిన) చీనాంబరము (చైనాగుడ్డ, పట్టువస్త్రము)}; ప్రభల్ = ప్రకాశముల; తోన్ = తోటి; మేఖలా = వడ్డాణపు; కాంతులు = వెలుగులు; మేలము = పరిహాసములు; ఆడన్ = చేస్తుండగ; చంచల = చలిస్తున్న; సారంగ = లేడికన్నులవంటి; చారు = అందమైన; విలోచన = కన్నుల; ప్రభలు = ప్రకాశములు; నల్దిక్కులన్ = నాలుగు దిక్కులందును {నాలుగుదిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తర దిక్కులు}; ప్రబ్భికొనగ = పరచుకొనగ. మించి = అతిశయిచిన; వేడుకన్ = కుతూహలముతో; భర్తృసమేతలు = భర్తతోకూడినవారు; అగుచున్ = అవుతూ; మానితంబు = స్తుతింపదగినవి; కాన్ = అగునట్లుగ; దివ్య = దివ్యమైన; విమాన = విమానములందు; యానలు = ప్రయాణించువారు; అగుచున్ = అవుతూ; ఆకాశ = ఆకాశ; పథంబునన్ = మార్గమున; అరుగుచున్ = వంలుతూ; ఉన్న = ఉన్నట్టి; = ఖచర = ఆకాశమున సంచరిస్తున్న; గంధర్వ = గంధర్వ; కిన్నర = కిన్నర; అంగనలన్ = స్త్రీలను {అంగనలు - అంగములు చక్కగ యున్నవారు, స్త్రీలు}; చూచి = చూసి.

భావము:
నవరత్నాలు తాపిన చెవికమ్మల కాంతులు అద్దాలవంటి చెక్కిళ్ళపై పడుతుండగా, మేలిమి బంగారు పతకాల కాంతులు భుజాలపై వ్యాపించగా, చీని చీనాంబరాల కాంతులు మొలనూళ్ళ కాంతులతో కలిసి మెరుస్తుండగా, లేడికన్నుల వెలుగులు నాలుగు దిక్కులా ప్రసరిస్తుండగా ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్యవిమానాలను అధిరోహించి దేవతాస్త్రీలు ఆకాశంలో వెళ్తుండగా సతీదేవి చూచి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=58

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...