Wednesday 5 April 2017

శ్రీ రామనవమి శుభాకాంక్షలు......

( చైత్ర శుద్ధ నవమి ; 05-04-2017; )

                           శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రామావతారం ఏడవది. ఇది పరమ సాత్విక అవతారం. మనిషనేవాడు భూమ్మీద ఎలా జీవించాలో ధర్మాచారణతో చాటి చెప్పిన ధర్మమూర్తి రామయ్య. అందుకే అన్నారు "రామో విగ్రహవాన్ ధర్మః" అని - ధర్మానికి ఒక విగ్రహ రూపం ఇస్తే అది శ్రీ రామచంద్రుడే అని... చైత్రమాసం, పునర్వసు నక్షత్రం, నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించాడు. నవమి నాడే సీతమ్మతో వివాహము, నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగాయని  రామాయణం చేబుతున్నది. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.

                            రాముడికన్నా గొప్పది రామనామం. శివకేశవ సంగమమే రామనామం... ఎందుకంటే దశరథ మహారాజుకు మొదట కలిగిన బిడ్డడికి వశిష్ఠుడు రామ అని నామకరణం చేశాడు. 'రామ' పదంలో పరమ పావన సప్తాక్షరి మంత్రమైన " నమో నారాయణాయ" లోని రెండవ అక్షరమైన  'రా'ని, పవిత్ర పంచాక్షరి మంత్రమైన "నమః శివాయ" లోని 'మ'ని, ఈ రెండక్షరాలని కలిపి రామ అని నామకరణం చేశాడు. శివకేశవుల అభేదమే రామనామ ఆంతర్యం.

ఒక రోజు పార్వతీదేవి పరమశివున్ని

"కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం ।
పఠ్యతే పండితైర్నిత్యం స్తోతు మిచ్ఛామ్యహం ప్రభో॥"

అని అడిగింది. దీనర్థం ఏమిటంటే విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, " ఉమా! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది రామనామాన్నే!" అని ఈ క్రింది శ్లోకం చేప్పాడు...

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ॥

ఈ శ్లోకం  స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం వస్తుందని చెప్పాడు. ఎలాగంటే ప్రసిద్ధ " కటపయాది " సంఖ్యల ప్రకారం రా=2 మరియు మ=5 అలా (రామ = 2×5 = 10; రామ =2×5 = 10; రామ = 2×5 =10; 10×10×10 =1000) విష్ణుసహస్రనామ ఫలితం లభిస్తుంది.

రామనవమి నాడు శ్రీరామునికి వడపప్పు, పప్పుబెల్లం నైవేద్యంగా పెట్టి పంచడం ఆనవాయితి. ఇందులో ఓ ఆరోగ్య రహస్యం కూడా ఉందండోయ్... వచ్చేది ఎండాకాలం కాబట్టి వడపప్పు చలువ చేస్తుంది, ఎండల నుండి కాపాడుతుంది.. ఇక పానకం వల్ల ఋతుమార్ప వల్ల వచ్చే రోగాల నుండి శరీరాన్ని కాపాడి మనలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. మన తెలుగువారికీ రామయ్యకి అవినాభావ సంబంధమే ఉంది...పరమ రామభక్తులైన భక్తరామదాసు, త్యాగరాజు, తుము నరసింహదాసు వంటి వాగ్గేయకారులు ఎందరో రామున్ని సేవించి, ఆయన సాక్షాత్కారం పొంది ధన్యులైనారు. మన తెలుగు రాష్ట్రాల్లో 'దక్షిణ అయోధ్య'గా పేరు గాంచిన 'భద్రాచలం' లో మరియు ప్రసిద్ధ 'ఒంటిమిట్ట'లో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి.... ఒంటిమిట్టలో రాత్రి పండు వెన్నెలలో కళ్యాణం జరగడం విశేషం....

మరి అందరికీ ఆ రాముడి కృపా కటాక్షాలు కలగాలని కోరుతూ , అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు... జై శ్రీ రామ...

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...