Thursday, 4 May 2017

దక్షయాగము - 22:

4-69-సీ.
"కల్యాణి నీ మాట గడు నొప్పు; బంధువుల్;
పిలువకుండినను సంప్రీతిఁ జనుదు
రంటి; విదియు లెస్స యైనను దేహాభి;
మాన మదము ననమర్షమునను
గడఁగి యారోపిత ఘన కోపదృష్టులు;
గారేనిఁ బోఁదగుఁ గాని వినుము
వినుత విద్యా తపోవిత్త వయో రూప;
కులములు సుజనులకును గుణంబు;
4-69.1-తే.
లివియ కుజనులయెడ దోషహేతుకంబు
లై వివేకంబు చెఱుచు; మహాత్ములైన
వారి మాహాత్మ్యమాత్మ గర్వమునఁ జేసి
జడులు పొడగానఁ జాలరు జలజనేత్ర!

టీకా:
కల్యాణి = కల్యాణములు కలిగించుదానా; నీ = నీ; మాటన్ = మాటలు; కడున్ = మిక్కిలి; ఒప్పు = సరియైనవి; బంధువుల్ = బంధువులు; పిలవకుండినను = పిలవకపోయినను; సంప్రీతిన్ = ప్రీతితో; చనుదురు = వెళ్తారు; అంటివి = అన్నావు; ఇదియున్ = ఇదికూడ; లెస్స = సరియైనదే; ఐనను = అయినప్పటికిని; దేహా = దేహమునందలి; అభిమాన = అభిమానమువలని; మదమునన్ = పొగరు; అమర్షమునను = ఓర్వలేనితనమునను; కడగి = పూని; = ఆరోపిత = ఎక్కింపబడిన; ఘన = అధికమైన; కోప = కోపముతోకూడిన; దృష్టులు = చూపులు కలవారు; కారేని = కాకపోతే; పోన్ = వెళ్ళుటకు; తగున్ = తగును; కాని = కాని; వినుము = వినుము; వినుత = ప్రసిద్ధి చెందిన; విద్యా = విద్యలు; తపస్ = తపోశక్తి; విత్త = ధనము; వయస్ = వయస్సు; రూప = సౌందర్యము; కులములు = కులములు; సుజనుల్ = మంచివారి; కును = కి యైతే; గుణంబులు = సుగుణములు. ఇవియ = ఇవే;  కుజనుల = దుష్టుల; ఎడన్ = అందు; దోష = పాపమునకు; హేతుకంబులు = కారణభూతములు; ఐ = అయ్యి; వివేకంబున్ = వివేకమును; చెఱచున్ = చెడగొట్టును; మహాత్ములు = గొప్పవారు; ఐన = అయిన; వారి = వారి; మహాత్మ్యము = గొప్పదనము; ఆత్మ = తమ; గర్వమునన్ = గర్వము; చేసి = వలన; జడులు = తెలివితక్కువవాడు; పొడగనజాలరు = చూడలేరు; జలజనేత్ర = స్త్రీ {జలజనేత్ర - జలజము (నీటపుట్టు పద్మము) వంటి కన్నులు ఉన్నామె, స్త్రీ}.

భావము:
“దేవీ! నీ మాటలు ఎంతో యుక్తంగా ఉన్నాయి. బంధువులు పిలువకపోయినా ప్రాజ్ఞులైనవారు ప్రీతితో వెళ్తారని నీవు చెప్పింది కూడా బాగుంది. దేహాభిమానం వల్ల కలిగిన మందం చేతనూ, ఆగ్రహావేశం చేతనూ వారు ద్వేష రోషాలను ప్రదర్శించకపోతే వెళ్ళవచ్చు. కాని నీ తండ్రి సరసుడు కాడు. విను. విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపం, కులం అనేవి మంచివారికి సుగుణాలే కాని చెడ్డవారి విషయంలో ఇవే గుణాలు దోషకారణాలై వారి బుద్ధిని పాడు చేస్తాయి. పద్మాక్షీ! మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల గొప్పతనాన్ని గుర్తించలేరు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=69


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

కపిల దేవహూతి సంవాదం - 21

3-895-సీ. అట్టి యహంకార మం దధిష్టించి సా;  హస్రఫణామండలాభిరాముఁ డై తనరారు ననంతుఁడు సంకర్ష;  ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు మహిత భూతేంద్రియ...