Saturday 6 May 2017

దక్ష యాగము - 24:


4-72-చ.
సమద రిపుప్రయుక్త పటుసాయక జర్జరితాంగుఁ డయ్యు దుః
ఖమును దొఱంగి నిద్రఁగనుఁ గాని కృశింపఁడు మానవుండు; నో!
యుమ! విను మిష్ట బాంధవదురుక్తులు మర్మము లంట నాఁటఁ జి
త్తమున నహర్నిశంబుఁ బరితాపము నొంది కృశించు నెప్పుడున్.
4-73-క.
విను లోకోత్కృష్టుఁడు ద
క్షునికిఁ దనూభవలలోనఁ గూరిమిసుతవై
నను నా సంబంధంబున
జనకునిచేఁ బూజఁ బడయఁజాలవు తరుణీ!

టీకా:
సమద = మదముతోకూడిన; రిపు = శత్రువుచే; ప్రయుక్త = ప్రయోగింపబడిన; పటు = గట్టి; సాయక = బాణములచేత; జర్జరిత = పెక్కుగాయములయిన; అంగుడు = దేహముకలవాడు; అయ్యున్ = అయినప్పటికిని; దుఃఖమునున్ = దుఃఖమునుండి; తొఱంగి = విడిచిపెట్టి; నిద్రన్ = నిద్రను; కనున్ = పొందును; కాని = కాని; కృశింపడు = కృశించిపోడు; మానవుండు = మానవుడు, మానము కలవాడు; ఓ = ఓ; ఉమ = పార్వతీదేవి; వినుము = వినుము; ఇష్ట = కావలసిన; బాంధవ = బంధువుల; దురుక్తులు = చెడ్డమాటలు; మర్మములన్ = మనసులోతులను, జీవస్థానమును; అంటనాట = గట్టిగగుచ్చుకోగా; చిత్తమునన్ = మనసులో; అహర్నిశము = రాత్రింబవళ్లు; పరితాపమున్ = సంతాపమును; ఒంది = పొంది; కృశించున్ = కృశించిపోవును; ఎప్పుడున్ = ఎప్పుడైనాసరే. విను = వినుము; లోకన్ = లోకమునకి; ఉత్కృష్టుడు = శ్రేష్టుడు; దక్షుని = దక్షుని; కిన్ = కి; తనూభవలు = సంతానము {తనూభవ - తనూ (దేహమున) భవ (పుట్టినవారు)}; లోనన్ = అందు; కూరిమి = ఇష్టమైన; సుతవు = కూతురవు; ఐనను = అయినప్పటికిని; = నా = నా ఎడలి; సంబంధంబునన్ = సంబంధమువలన; జనకుని = తండ్రి; చేన్ = చేత; పూజన్ = పూజలను; పడయజాలవు = పొందలేవు; తరుణీ = స్త్రీ {తరుణి - తరుణ వయసునున్నామె, స్త్రీ}.

భావము:
బలవంతుడైన శత్రువు ప్రయోగించిన బాణాలచేత శరీరం తూట్లు పడినా ఆ బాధను భరించి వ్యక్తి ఎలాగో నిద్రపోతాడు కాని క్రుంగి కృశించిపోడు. సతీ! దగ్గరి చుట్టాల దురహంకారంతో కూడిన దుర్భాషలు గుండెల్లో లోతుగా నాటుకొని మాటిమాటికి బాధ కలిగిస్తూ అహర్నిశం కృశింపజేస్తాయి. తరుణీ! విను. లోకాలన్నిటికీ గొప్పవాడైన దక్షునికి తన కుమార్తె లందరిలోనూ నీవు మిక్కిలి ప్రియమైన కూతురువైనా నా సంబంధం వల్ల నీ తండ్రి నిన్ను గౌరవించడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=73

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...