Thursday, 11 May 2017

దక్ష యాగము - 29:


4-80-వ.
ముందట.
4-81-చ.
మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచెఁ జారు మృ
త్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము
న్ననుపమ వేదఘోష సుమహత్పశు బంధన కర్మ భూమమున్
మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్.
4-82-వ.
ఇట్లు గనుంగొని యజ్ఞశాలం బ్రవేశించిన.

టీకా:
ముందటన్ = ఎదుట. మనమునన్ = మనసులో; మోదమున్ = సంతోషమును; అందుచున్ = చెందుతూ; ఉమా = ఉమ అనెడి; తరుణీ = స్త్రీ లలో {తరుణి - తరుణ వయసునున్నామె, స్త్రీ}; మణి = రత్నములాంటామె; కాంచెన్ = చూసెను; చారు = అందమైన; మృత్ = మట్టితోను; కనక = బంగారముతోను; కుశ = దర్భలు; అజిన = లేడిచర్మము; అయస = ఇనుము; నికాయ = సమూహముచే; వినిర్మిత = చక్కగ నిర్మింపబడ్డ; పాత్ర = పాత్రలుగల; సీమమున్ = భూమిని; అనుపమ = గొప్ప {అనుపమ - ఉపమానమునకు అందనిది, గొప్ప}; వేద = వేదముల; ఘోష = శబ్దములు; సు = మంచి; మహత్ = గొప్ప; పశు = యజ్ఞపశువుని; బంధన = బంధించిన; భూమమున్ = స్థలమును; ముని = మునులతోను; విబుధ = దేవతలతోను; అభిరామము = చక్కనైనదానిని; సమ = చక్కగా; ఉజ్జ్వల = జ్వలిస్తున్న; హోమము = హోమము కలదానిని; యాగ = యజ్ఞ; ధామమున్ = భూమిని. ఇట్లు = ఈవిధముగ; కనుంగొని = చూసి; యజ్ఞశాలన్ = యజ్ఞశాలను; ప్రవేశించినన్ = ప్రవేశించగా.

భావము:
ఎదురుగా... సతీదేవి మనస్సులో సంతోషిస్తూ యజ్ఞశాలను చూసింది. ఆ యజ్ఞశాలలో కొయ్యతో, మట్టితో, బంగారంతో, లోహంతో చేసిన పాత్రలున్నాయి. దర్భలతో, జింకతోళ్ళతో చేసిన వస్తువులు ఉన్నాయి. వేదఘోషలు మిన్ను ముట్టుతున్నాయి. ఒకచోట యజ్ఞ పశువును బంధించారు. మునులు, దేవతలు తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు. హోమాలు చేస్తున్నారు. యజ్ఞం వైభవోపేతంగా జరుగుతున్నది. ఇదంతా చూస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=81

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

కపిల దేవహూతి సంవాదం - 21

3-895-సీ. అట్టి యహంకార మం దధిష్టించి సా;  హస్రఫణామండలాభిరాముఁ డై తనరారు ననంతుఁడు సంకర్ష;  ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు మహిత భూతేంద్రియ...