Monday 15 May 2017

దక్ష యాగము - 33:

4-88-క.
మఱియును నమ్మహితాత్ముని
చరణ సరోజాత యుగము సకలజగంబుల్
నెఱిఁ గొలువఁ గోరు కోర్కులు
దరిమిడి వర్షించు నతనిఁ దగునే తెగడన్?
4-89-చ.
పరగఁ జితాస్థిభస్మ నృకపాలజటాధరుఁడుం బరేత భూ
చరుఁడు పిశాచయుక్తుఁ డని శర్వు నమంగళుగాఁ దలంప రె
వ్వరు; నొకఁ డీవు దక్క, మఱి వాక్పతి ముఖ్యులు నమ్మహాత్ము స
చ్చరణ సరోజ రేణువులు సమ్మతిఁ దాల్తురు మస్తకంబులన్.

టీకా:
మఱియును = ఇంకను; ఆ = ఆ; మహితాత్ముని = గొప్పవానిని; చరణ = పాదములు అనెడి; సరోజాత = పద్మముల {సరోజాతము - సరసున జాతము (పుట్టునది), పద్మము}; యుగమున్ = జంటను; సకల = సమస్తమైన; జగంబుల్ = జగముల; నెఱిన్ = నిండుగ; కొలువన్ = పూజించగా; కోరు = కోరుకొనెడి; కోర్కులు = కోరికలు; తరిమిడి = వరుసగ; వర్షించు = సఫలమగును; అతనిన్ = అతనిని; తగనే = తగునా ఏమి; తెగడన్ = దూషించగ. పరగన్ = ప్రసిద్ధముగ; చితా = చితిపైనున్న; అస్థి = ఎముకలు; భస్మ = భస్మము; నృ = నరుని; కపాల = పుర్రెలు; జటా = జటలుకట్టిన శిరోజముల; ధరుడు = ధరించువాడు; పరేత = శ్మశాన; భూ = భూమి యందు; చరుడు = తిరుగువాడు; పిశాచ = పిశాచములతో; యుక్తుడు = కూడి యుండువాడు; అని = అని; శర్వున్ = శివుని; అమంగళున్ = అశుభకరుని; కాన్ = అగునట్లు; తలపరు = అనుకొనరు; ఎవ్వరున్ = ఎవరూ; ఒక్కడ = ఒక్కడివి; ఈవు = నీవు; తక్కన్ = తప్పించి; మఱి = మరి; వాక్పతి = బ్రహ్మదేవుడు {వాక్పతి - వాక్కు (సరస్వతీదేవి)కి భర్త, బ్రహ్మదేవుడు}; ముఖ్యులు = మొదలైన ప్రముఖులు; ఆ = ఆ; మహాత్ము = గొప్పవాని; సత్ = మంచి; చరణ = పాదములు అనెడి; సరోజ = పద్మముల; రేణువులు = ధూళిని; సమ్మతి = అంగీకరించి; తాల్తురు = ధరించెదరు; మస్తకంబులన్ = శిరస్సులందు.

భావము:
అంతేకాక ఆ మహాత్ముని పాదపద్మాలు లోకాలన్నీ కొలివగా కోరిన కోర్మెలన్నింటినీ కురిపిస్తుండగా అతన్ని నిదించడం న్యాయమా? చితిలోని ఎముకలను, బూడిదను, మానవకపాలాన్ని ధరించి, పిశాచాలతో కూడి శ్మశానంలో తిరిగినా శివుణ్ణి నీవు తప్ప మరెవ్వరూ అమంగళుడని భావించరు. బ్రహ్మ మొదలైనవారు ఆ మహాత్ముని పాదధూళిని తమ శిరస్సులపై సంతోషంతో ధరిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=87

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...