Wednesday, 28 June 2017

దక్ష యాగము - 75:

4-164-చ.
సలలిత శంఖ చక్ర జలజాత గదా శర చాప ఖడ్గ ని
ర్మల రుచులున్ సువర్ణ రుచిమన్మణి కంకణ ముద్రికా ప్రభా
వళులును దేజరిల్లు భుజవర్గ మనర్గళ కాంతియుక్తమై
విలసిత కర్ణికార పృథివీరుహముం బురుడింపఁ బిట్టుగన్.
4-165-క.
సరసోదార సమంచిత
దరహాస విలోకనములఁ దగ లోకములం
బరితోషము నొందించుచుఁ
బరమోత్సవ మొప్ప విశ్వబంధుం డగుచున్.

టీకా:
సలలిత = అందమైన; శంఖ = శంఖము; చక్ర = చక్రము; జలజాత = పద్మము; గదా = గద; శర = విల్లు; చాప = బాణము; ఖడ్గ = ఖడ్గములయొక్క; నిర్మల = నిర్మలమైన; రుచులున్ = కాంతులు; సువర్ణ = బంగారు; రుచిమత్ = ప్రకాశవంతమైన; మణి = రత్నములు తాపిన; కంకణ = చేతికి ధరించు కంకణములు; ముద్రికా = ఉంగరముల; ప్రభా = కాంతుల; ఆవళులును = పుంజములు; తేజరిల్లు = విలసిల్లు; భుజ = భుజముల; వర్గము = సమూహము; అనర్గళ = సాటిలేని; కాంతి = కాంతులతో; యుక్తము = కూడినది; ఐ = అయ్యి; విలసిత = అందమగు, పుష్పించిన; కర్ణికార = కొండగోగు; పృథివీరుహమున్ = చెట్టును; పురుడింపన్ = పోలియుండెను; బిట్టుగన్ = అధికముగ. సరస = సరసమైన; ఉదార = ఔదార్యముతో; సమంచిత = చక్కగకూడిన; దరహాస = చిరునవ్వుల; విలోకనములన్ = చూపులు; తగన్ = తగి; లోకములన్ = లోకములను; పరితోషమున్ = సంతోషమును; ఒందించుచున్ = కలిగిస్తూ; పరమ = అత్యధికమైన; ఉత్సవము = వైభవము; ఒప్పన్ = ఒప్పియుండగ; = విశ్వబంధుండు = విశ్వమునకు బంధువు; అగుచున్ = అవుతూ.

భావము:
అందమైన శంఖం, చక్రం, పద్మం, గద, విల్లమ్ములు, ఖడ్గం మొదలైనవాటి నిర్మల కాంతులతోను, మణులు పొదిగిన బంగారు కంకణం, ఉంగరాల కాంతులతోను ప్రకాశించే భుజసమూహంతో తన శరీరం పూచిన కొండగోగుచెట్టు వలె అలరారుతుండగా (విష్ణువు సాక్షాత్కరించాడు). సరసమైన ఔదార్యంతో కూడిన చిరునవ్వుతో, చూపులతో లోకాలకు సంతోషాన్ని కలిగిస్తూ కన్నుల పండుగగా లోకబంధువౌతు (విష్ణువు సాక్షాత్కరించాడు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=165

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

కపిల దేవహూతి సంవాదం - 21

3-895-సీ. అట్టి యహంకార మం దధిష్టించి సా;  హస్రఫణామండలాభిరాముఁ డై తనరారు ననంతుఁడు సంకర్ష;  ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు మహిత భూతేంద్రియ...