Sunday 25 June 2017

శ్రీ జగన్నాథ భక్త విజయం


( నేడే పూరీలో శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం )

25 - 06 - 2017, ఆదివారం.

జగన్నాథుడంటే జగత్తు అంతటికీ నాథుడని అర్థం. విమలాదేవి క్షేత్ర శక్తిగా బలభద్ర, సుభద్ర దేవిలతో కూడి ఒడిషా రాష్ట్రంలోని పూరీలో కొలువై ఉన్నాడు మన జగన్నాథుడు. ప్రతీ సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు ప్రారంభం అవుతుంది రథయాత్ర.  ఈ రథయాత్ర గురించి స్కాంద పురాణం, పద్మ పురాణం మరియు బ్రహ్మ పురాణాలలో వివరించబడి ఉంది. ఈ రథయాత్ర ప్రధాన ఆలయం నుండి ప్రారంభమై బలగండి చాక మీదుగా గుండీచా ఆలయం వరకు సాగి అక్కడ తొమ్మిది రోజులు గడిపి మళ్ళీ ప్రధాన ఆలయానికి చేరి పూర్తవుతుంది. తిరుగు ప్రయాణాన్ని బాహుదా యాత్ర అంటారు.

జగన్నాథ రథం - నందిఘోష ( పసుపు రంగు, ఎరుపు రంగు, 16 చక్రాలు )
బలభద్రుడి రథం - తాళధ్వజ ( నీలపు ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, 14 చక్రాలు )
సుభద్రాదేవి రథం - దర్పదళన ( నలుపు రంగు, ఎరుపు రంగులు, 12 చక్రాలు )

ఇక్కడి రథయాత్రలో మూలవిగ్రహాలే పాల్గొంటాయి. వీరితో పాటు సుదర్శన చక్రం కూడా రథయాత్రలో పాల్గొంటుంది. నవ కళేబర ఉత్సవం లో భాగంగా పాత విగ్రహాలను ఖననం చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు.

జగన్నాథుడు - భక్త సలబేగుడు:

గుండీచా ఆలయానికి వెళ్ళే దారిలో భక్త సలబేగుడి యొక్క సమాధి వద్ద రథాలను కసేపు ఆపుతారు. జగన్నాథుడి పరమ భక్తులలో ఈ ముస్లీం భక్తుడు అగ్రగణ్యుడు. 17వ శతాబ్దానికి చెందిన సలబేగుడు ముఘల్ సుబేదారు లాల్బేగ్ కుమారుడు. ఒకసారి యుద్ధంలో గాయపడిన సలబేగుడు, తల్లి సలహా పై జగన్నాథుని నామాన్ని జపించగానే అయనకి గాయాలు వెంటనే మానిపోయాయట. అలా కృష్ణ భక్తుడైన సలబేగుడు కృష్ణుడే జగన్నాథునిగా పూరీ క్షేత్రంలో కొలువై ఉన్నాడని తెలిసి ఆయన దర్శనానికై పూరీ చేరుకున్నాడు. కానీ ముస్లీం కావటం చేత ఆయనకు ఆలయ ప్రవేశం లభించలేదు. అలా బాధాతప్తహృదయుడై ఆయన వెనుదిరిగాడు తరువాత బృందావనంలో, మథురలో సన్యాస జీవితం గడిపాడు.

సంవత్సరం తరువాత జగన్నాథుని పూరీ రథయాత్ర గురించి తెలుసుకొని మళ్ళీ ఆశతో పూరీకి పయనమయ్యాడు..... కానీ ఇంతలో సలబేగుడు అనారోగ్యం బారిన పడ్డాడు. మూల విరాట్టు ప్రధాన ఆలయం చేరితే తనకు ఇక దర్శనం లభించదని తెలిసి..... తాను వచ్చేవరకు, తనకు దర్శనం ఇచ్చేవరకు కదలవద్దని జగన్నాథుడిని మనసులో ప్రార్థించాడు సలబేగుడు. ఇదిలా ఉండగా గుండిచా ఆలయంలో తొమ్మిది రోజులు గడిపిన జగన్నాథుడిని తిరిగి ప్రధాన ఆలాయానికి తీసుకురావటానికి అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు. కానీ భక్తుడి కోరికకు బద్ధుడయ్యాడు జగన్నాథుడు. అప్పుడు భక్తులంతా జగన్నాథ రథాన్ని లాగారు కానీ ఎంతలాగినా రథం మాత్రం అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. జగన్నాథుని దయతో అనారోగ్యం నుండి కోలుకొని మళ్ళీ పూరీకి పయనమయ్యడు సలబేగుడు. పూరీ చేరుకున్న సలబేగుడు జరిగినదంతా తెలుసుకొని వెంటనే రథాల వద్దకు చేరుకొని తన స్వామిని కన్నుల్లారా దర్శించుకున్నాడు. ఆ వెంటనే రథాలు కదిలాయి. అలా తన భక్తుడి గొప్పతనాన్ని అందరికీ తెలియపరిచిన జగన్నాథుడు ప్రధాన ఆరయానికి చేరుకున్నాడు.

తరువాత భక్త సలబేగుడు జగన్నాథుడిపై అనేక కీర్తనలు రాసాడు. ఇవన్నీ ఒడియా భాషలో ఉన్నాయి. ఒడిషా రాష్ట్రంలో ఈ కీర్తనలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. రాధా, గోపికలతో కృష్ణుడి రాస లీలా వినోదాలను కీర్తనా రూపంలో రచించి ఒడియా సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు సలబేగుడు. తరువాత ఆయన పూరీలో సమాధి చెంది జగన్నాథునిలో ఐక్యమయ్యాడు. ఇప్పటికి రథయాత్రలో భాగంగా సలబేగుడి సమాధి వద్ద రథాన్ని ఆపడం ఆచారంగా వస్తోంది. ఆయన కీర్తనలు భక్తులను ఎంతగానో ఉత్తేజ పరుస్తాయి.

బంగ్లాదేశ్ లోని ధమ్రాయ్ లో కూడా రథయాత్ర జరుగుతుంది. పూరీ నగరం వెలుపల జరిగే రథయాత్రల్లో ఇదే అతి పెద్దది. విదేశాలలో కూడా ఇస్కాన్ ద్వారా రథయాత్రలు జరుగుతాయి. మన హైదరాబాద్ లో కూడా రథయాత్ర నిర్వహిస్తారు.

జై జగన్నాథ.... 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...