Sunday 2 July 2017

దక్ష యాగము - 77:

4-167-చ.
ఘనరుచి నట్లు వచ్చిన వికారవిదూరు ముకుందుఁ జూచి బో
రన నరవిందనందన పురందర చంద్రకళాధ రామృతా
శనముఖు లర్థి లేచి యతి సంభ్రమ మొప్ప నమో నమో దయా
వననిధయే యటంచు ననివారణ మ్రొక్కిరి భక్తియుక్తులై.
4-168-వ.
అట్లు కృతప్రణాములైన యనంతరంబ.

టీకా:
ఘన = గొప్ప; రుచిన్ = కాంతితో; అట్లు = అలా; వచ్చిన = రాగా; వికారవిదూరున్ = నారాయణునిని {వికారవిదూరుడు - వికారములు మిక్కిలి దూరముగ ఉంచువాడు, విష్ణువు}; ముకుందున్ = నారాయణునిని; చూచి = చూసి; బోరన = వేగముగ; అరవిందనందన = బ్రహ్మదేవుడు {అరవిందనందన - అరవిందము (పద్మము) నందనుడు (పుత్రుడు), బ్రహ్మదేవుడు}; పురందర = ఇంద్రుడు; చంద్రకళాధర = శివుడు {చంద్రకళాధర - చంద్రవంకను ధరించినవాడు, శివుడు}; అమృతాశన = దేవతా {అమృతాశనులు - అమృతము అశన (తినువారు) దేవతలు}; ముఖులు = ప్రముఖులు; అర్థిన్ = కోరి; లేచి = నిలబడి; అతి = మిక్కిలి; సంభ్రమము = ఉత్సాహము; ఒప్పన్ = ఒప్పియుండగ; నమః = నమస్కారము; నమః = నమస్కారము; దయావననిధయే = కృపకు సముద్రమైనవాడ; అటంచున్ = అంటూ; అనివారణన్ = అడ్డులేని విధముగ; మ్రొక్కిరి = నమస్కరించిరి; భక్తి = భక్తితో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి. అట్లు = ఆ విధముగ; కృత = చేసిన; ప్రణాములు = నమస్కరించినవారు; ఐ = అయ్యి; అనంతరంబ = తరువాత.

భావము:
ఆ విధంగా వచ్చిన వికారదూరుడైన ముకుందుని చూచి బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలైన దేవతలు లేచి “దయాసముద్రునకు నమస్కారం! నమస్కారం” అని భక్తితో మ్రొక్కారు. ఆ విధంగా ప్రణామాలు చేసిన తరువాత...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=167

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...