Saturday 15 July 2017

దక్ష యాగము - 89:

4-191-సీ.
"దేవాదిదేవ! యీ దృశ్యరూపంబగు; 
సుమహిత విశ్వంబుఁ జూచు ప్రత్య
గాత్మభూతుండ వై నట్టి నీవు నసత్ప్ర; 
కాశ రూపంబులై గలుగు మామ
కేంద్రియంబులచేత నీశ్వర! నీ మాయ; 
నొందించి పంచభూతోపలక్షి
తంబగు దేహి విధంబునఁ గానంగఁ; 
బడుదువు గాని యేర్పడిన శుద్ధ
4-191.1-తే.
సత్త్వగుణ యుక్తమైన భాస్వత్స్వరూప
ధరుఁడవై కానఁబడవుగా? పరమపురుష! 
యవ్యయానంద! గోవింద! యట్లు గాక
యెనయ మా జీవనము లింక నేమి కలవు?"

టీకా:
దేవాధిదేవ = నారాయణ {దేవాధిదేవ - దేవతలకే అధిదేవత, విష్ణువు}; ఈ = ఈ; దృశ్య = కనబడెడి; రూపంబున్ = రూపము; అగు = అయినట్టి; సు = మంచి; మహిత = మహిమకలగిన; విశ్వంబున్ = జగమును; చూచు = చూసెడి; ప్రత్యగాత్మభూతుండవు = ప్రత్యగాత్మభూతుడవు; ఐనట్టి = అయినట్టి; నీవు = నీవు; అసత్ = సత్యముకాని; ప్రకాశ = ప్రకాశము యొక్క; రూపంబులు = రూపులము; ఐ = అయ్యి; కలుగు = ఉండెడి; మామక = మాయొక్క; ఇంద్రియంబుల = ఇంద్రియముల; చేతన్ = చేత; ఈశ్వర = నారాయణ; నీ = నీ; మాయన్ = మాయను; ఒందించి = చెంది; పంచభూత = పంచభూతములందు; ఉపలక్షితంబు = ప్రవర్తించునది; అగు = అయిన; దేహి = దేహముకలవాని; విధంబునన్ = విధముగ; కానంగబడుదువు = కనబడెదవు; కాని = కాని; ఏర్పడిన = సిద్ధించిన; శుద్ధ = పరిశుద్ధమైన. 
సత్త్వగుణ = సత్త్వగుణముతో; యుక్తము = కూడినది; ఐన = అయినట్టి; భాస్వత్ = ప్రకాశవంతమైన; రూప = రూపము; ధరుడవు = ధరించినవాడవు; ఐ = అయ్యి; కానబడవుగా = కనబడవుకదా; పరమపురుష = నారాయణ {పరమపురుషుడు - సర్వమునకు పరమము (అతీతము) యైన పురుషుడు, విష్ణువు}; అవ్యయానంద = నారాయణ {అవ్యయానంద -అవ్యయము (తగ్గిపోని) ఆనందము కలవాడు వాడు, విష్ణువు}; గోవింద = నారాయణ {గోవింద - గోవులకు ఒడయుడు}; అట్లుగాన = అందుచేత; ఎనయన్ = పొందుటకు; మా = మా యొక్క; జీవనములన్ = జీవితములలో; ఇంక = ఇంకను; ఏమి = ఏమి; కలవు = ఉన్నది.

భావము:
“దేవాదిదేవా! ఈ కనిపించే విశ్వాన్ని నీవు వేరుగా ఉండి చూస్తావు. నీవు బహిర్ముఖాలైన మా ఇంద్రియాలకు పంచభూతోపలక్షితమైన జీవివలె కనిపిస్తావు. ఇదంతా నీ మాయా విలాసం. ఓ అవ్యయానందా! గోవిందా! పురుషోత్తమా! శుద్ధ సత్త్వ గుణంతో కూడిన నీ రూపాన్ని మాకు చూపించవు. ఏమి బ్రతుకులయ్యా మావి?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=191

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...