Tuesday 25 July 2017

దక్ష యాగము - 98

4-210-సీ.
అంగప్రధానక యాగంబులను జేసి; 
యమరుల రుద్రుని నర్థిఁ బూజ
చేసి విశిష్టేష్ట శిష్టభాగమున ను; 
దవసాన కర్మంబుఁ దవిలి తీర్చి
తాను ఋత్త్విక్కులుఁ దగ సోమపులఁ గూడి; 
యవభృథ స్నానంబు లాచరించి
కడఁక నవాప్త సకల ఫలకాముఁడై; 
తనరు దక్షునిఁ జూచి ధర్మబుద్ధి
4-210.1-తే.
గలిగి సుఖవృత్తి జీవింతుఁగాక యనుచుఁ
బలికి దివిజులు మునులును బ్రాహ్మణులును
జనిరి నిజమందిరముల; కా జలజనయన
భవులు వేంచేసి రాత్మీయ భవనములకు.

టీకా:
అంగ = భాగములతో కూడిన; ప్రధానక = ప్రధానమైనట్టి; యాగంబులను = యహ్ఞములు; చేసి = వలన; అమరుల = దేవతలను; రుద్రుని = శివుని; అర్థిన్ = కోరి; పూజ = పూజ; చేసి = చేసి; విశిష్ట = ప్రత్యేకమైన; ఇష్ట = యాగమును; శిష్ట = ప్రథాన; భాగమునను = భాగమున; ఉదవసాన = ఉద్వసానము అనెడి {ఉదవసానము - ఉత్ (నీరు) తో అవసానము (పూర్తి అగునప్పుడు చేయునట్టిది), ఉద్వాసనము}; కర్మంబున్ = కర్మములను; తవిలి = పూని; తీర్చి = పూర్తిచేసి; తాను = తాను; ఋత్విక్కులున్ = ఋత్విక్కులు; తగన్ = తగ్గట్లు; సోమపులన్ = సోమయాజులు {సోమపులు - యాగముచేసి అవశిష్టమైన సోమలతరసములు తాగినవారు, సోమయాజులు}; కూడి = కూడి; అవభృతస్నానము = యజ్ఞాంతస్నానము; ఆచరించి = చేసి; కడకన్ = పూనికతో; అవాప్త = ప్రాప్తించిన; సకల = సమస్తమైన; ఫల = ఫలించిన; కాముడు = కామములు కలవాడు; ఐ = అయ్యి; తనరు = అతిశయించిన; దక్షునిన్ = దక్షుని; చూచి = చూసి; ధర్మబుద్ధి = ధర్మబుద్ధి; కలిగిన = కలిగి. సుఖ = సుఖమైన; వృత్తిన్ = విధముగ; జీవింతుగాక = జీవించెదవుగాక; అనుచున్ = అంటూ; పలికి = పలికి; దివిజులు = దేవతలు; మునులును = మునులు; బ్రాహ్మణులును = బ్రాహ్మణులు; చనిరి = వెళ్ళిరి; నిజ = తమ; మందిరముల్ = మందిరముల; కున్ = కు; ఆ = ఆ; జలజనయన = విష్ణువు; భవులు = శివుడు; వేంచేసి = వెళ్ళిరి; ఆత్మీయ = స్వంత; భవనముల్ = నివాసముల; కున్ = కు.

భావము:
దక్షుడు అంగప్రధానకాలైన యాగాలను చేసి, దేవతలను, శివుణ్ణి పూజించి, వారి వారి భాగాలను వారికి సమర్పించి, ఋత్విక్కులతోను సోమపానం చేసినవారితోను అవభృథ స్నానం చేసి, యజ్ఞఫలాన్ని సమగ్రంగా పొందాడు. దేవతలు, మునులు, బ్రాహ్మణులు దక్షుని చూచి “ధర్మబుద్ధి కలిగి సుఖంగా జీవింతువు గాక!” అని దీవించి తమ తమ గృహాలకు వెళ్ళారు. విష్ణువు, శివుడు తమ తమ మందిరాలకు వెళ్ళారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=210

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...