Monday, 7 August 2017

శ్రీ కృష్ణ జననం - 14

10.1-54-మ.
కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుడై పట్టి బ
ద్ధులఁ గావించి హరిం దలంచి వెస తోడ్తో వారు గన్నట్టి పు
త్రులఁ జంపెన్; గురు నుగ్రసేను యదుఁ దద్భోజాంధకాధీశు ని
ర్మలు బట్టెం గడు వాలి యేలెఁ జల మారన్శూరసేనంబులన్.
10.1-55-ఆ.
తల్లిఁ దండ్రి నైనఁ దమ్ము లనన్నల
సఖుల నైన బంధుజనుల నైన 
రాజ్యకాంక్షఁ జేసి రాజులు చంపుదు
రవనిఁ దఱచు జీవితార్థు లగుచు.
10.1-56-వ.
మఱియును బాణ భౌమ మాగధ మహాశన కేశి ధేనుక బక ప్రలంబ తృణావర్త చాణూర ముష్టి కారిష్ట ద్వివిధ పూతనాది సహాయ సమేతుండై కంసుండు కదనంబున మదంబు లడంచిన వదనంబులు వంచికొని, సదనంబులు విడిచి యదవలై, యదువులు, పదవులు వదలి నిషధ కురు కోసల విదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వ దేశంబులుఁ జొచ్చిరి; మచ్చరంబులు విడిచి కొందరు కంసునిం గొలిచి నిలిచి; రంత.
10.1-57-క.
తొడితొడిఁ గంసుడు దేవకి
కొడుకుల నార్వుర వధింప గురుశేషాఖ్యం
బొడవగు హరిరుచి యా సతి
కడుపున నేడవది యైన గర్భం బయ్యెన్.

భావము:
ఈవిధంగా తలచుకొని మనస్సులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగినకోపంతో దేవకీవసుదేవులను పట్టి బంధించాడు. వారిపుత్రులను విష్ణుస్వరూపంగా స్మరించి వెంటనే సంహరించాడు. విజృంభించి యదుభోజ అంధకదేశాల నేలుతున్న తనతండ్రి ఉగ్రసేనుని పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుపట్టి శూరసేనదేశాలకు తానే రాజై పరిపాలించాడు. రాజులు ఈ లోకంలో రాజ్యకాంక్షతో తమ జీవితాలను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు. స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, తల్లితండ్రులు ఎవరినైనా వారు వదలిపెట్టరు. ఇలా రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు అనేకులైన రాక్షసులను అనుచరులుగా కూడకట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడూ, మహాశనుడూ, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు అరిష్టుడు ద్వివిదుడు పూతన మొదలైన రాక్షసులతో కలుపుకున్నవాడై యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయినవాళ్ళు అవమానంతో తమ ఇండ్లు వదలి పదవులు వదలి దీనులై నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాలు పట్టిపోయారు. కొందరు మాత్రం కంసుని సేవిస్తూ మధురలో ఉండిపోయారు. దేవకీదేవి కొడుకులు ఆరుగురిని వెంటవెంటనే కంసుడు వధించాడు. మహనీయమైన మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు అయిన ఆదిశేషుడనే పేర ప్రసిద్ధుడు దేవకీదేవి గర్భాన ఏడవదిగా ప్రవేశించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=7&padyam=57

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

కపిల దేవహూతి సంవాదం - 21

3-895-సీ. అట్టి యహంకార మం దధిష్టించి సా;  హస్రఫణామండలాభిరాముఁ డై తనరారు ననంతుఁడు సంకర్ష;  ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు మహిత భూతేంద్రియ...