Saturday 9 September 2017

పోతన రామాయణం - 1

9-258-వ.
అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహుండు, దీర్ఘబాహునకు రఘువు, రఘువునకుఁ బృథుశ్రవుండుఁ, బృథుశ్రవునకు నజుండు, నజునకు దశరథుండును, పుట్టి; రా దశరథునకు సురప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి నాల్గువిధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించె; తచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునులచేత వర్ణితంబైనది; యైననుం జెప్పెద సావధానమనస్కుండవై యాకర్ణింపుము.
9-259-మ.
అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుండై నట్లు నారాయణాం
శమునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన
క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకుం గౌసల్యకున్ సన్నుతా
సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్.

భావము:
ఖట్వాంగుడికి దీర్ఘబాహుడు, దీర్ఘబాహునికి రఘువు, రఘువుకు పృథుశ్రవణుడు, పృథుశ్రవణునికి అజుడు, అజునికి దశరథుడు జన్మించారు. దేవతలు వేడగా పరబ్రహ్మ స్వరూపుడు నారయణుడు నాలుగు (4) రకాలుగ అయ్యి, ఆ దశరథునికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే పేర్లతో తన అంశతో అవతరించి పుట్టాడు. వారి కథను వాల్మీకి మున్నగు మహర్షుల వలన వివరింపబడింది. ఆ ఇతిహాసాన్ని చెప్తాను శ్రద్ధగా విను. తూర్పుదిక్కున నిండుచంద్రుడు ఉదయించినట్లు; పతివ్రత, పరిశుద్ధురాలు, సంసారసాఫల్యం పొందినామె, సాటిలేని సాధ్వీ ఐన కౌసల్యాదేవికి; గర్వాంథుడైన రావణుని తలలు నరకుటలో ఆరితేరినవాడు శ్రీరాముడు, విష్ణుమూర్తి అంశతో జన్మించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=259

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...