Saturday 23 December 2017

ద్వారక అస్తమయం - 7

11-12-సీ.
ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ; 
గర్ణకుండలయుగ్మఘనకపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ; 
గలిత నానారత్న ఘన కిరీటు
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు; 
శ్రీకరపీతకౌశేయవాసు
రుక్మిణీనయన సరోజ దివాకరు; 
బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము
11-12.1-తే.
దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ
గోటిమన్మథలావణ్యకోమలాంగు
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.


భావము:
మహాత్ముడు; కౌస్తుభమణి సంశోభితుడు; ఘనమైన చెంపలపై కర్ణ కుండలాల కాంతులు ప్రకాశించు వాడు; తెల్లతామరల వంటి కన్నుల వాడు; మేఘం వంటి నల్లని దేహఛాయ వాడు; బహురత్నాలు పొదిగిన కిరీటం వాడు; తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టు వాడు; శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు; రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటి వాడు; బ్రహ్మ మున్నగు దేవతలచేత సేవింపదగిన చరణకమలాలు కలవాడు; దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు వాడు; కోటిమంది మన్మథుల లావణ్యం పుణికిపుచ్చుకున్న కోమల శరీరి; ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు; దయకు సముద్రం వంటి వాడు; ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...