Tuesday 31 January 2017

వామన వైభవం - 102:



8-641-సీ.
దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి;
ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంత భూమియు నొక్క యడుగయ్యె నాకును;
స్వర్లోకమును నొక్క చరణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు;
గడమ పాదమునకుఁ గలదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు;
నిరయంబు బొందుట నిజముగాదె?
8-641.1-తే.
కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు
కాక యిచ్చెదవేని వేగంబ నాకు
నిపుడ మూఁడవ పదమున కిమ్ముఁ జూపు
బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె?

టీకా:
దానవ = రాక్షసుడా; త్రిపద = మూడడుగుల; భూతలమున్ = భూభాగమును; ఇత్తున్ = ఇచ్చెదను; అంటివి = అన్నావు; ధరణిన్ = భూమిని; చంద్ర = చంద్రుడు; అర్కులు = సూర్యుడు; ఎందాక = ఎక్కడిదాక; ఉందురు = కనబడెదరో; అంత = అక్కడివరకు; భూమియున్ = భూమిని; ఒక్క = ఒకేఒక; అడుగు = అడుగు; అయ్యెన్ = అయినది; నా = నా; కునున్ = కు; స్వర్లోకమును = స్వర్గలోకము; ఒక్క = ఒకేఒక; చరణము = అడుగు; అయ్యెన్ = అయినది; నీ = నీ యొక్క; సొమ్ము = సంపద; సకలంబు = అంతా; రెండు = రెండు (2); అడుగులు = అడుగులు; కడమ = మిగిలిన; పాదమున్ = అడుగున; కున్ = కు; కలదె = ఉన్నదా; భూమి = నేల; ఇచ్చెదన్ = దానమిచ్చెదను; అన్న = అనిన; అర్థమున్ = సొమ్ము; ఈని = ఇయ్యనట్టి; దురాత్ముండు = దుష్టుడు; నిరయంబున్ = నరకమును; పొందుట = పొందుట; నిజము = సత్యము; కాదె = కాదా ఏమి. కాన = కనుక; దుర్గతి = నరకమునకుపోవుట; కినిన్ = కి; కొంత = కొంత; కాలము = సమయము; అరుగున్ = పట్టును; కాక = అలాకాకుండగ; ఇచ్చెదవు = ఇచ్చెడివాడవు; ఏని = ఐతే; వేగంబ = శ్రీఘ్రమే; నా = నా; కున్ = కు; ఇపుడ = ఇప్పుడే; మూడవ = మూడవ (3); పదమున్ = అడుగున; కున్ = కు; ఇమ్ము = చోటు; చూపు = చూపుము; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; అధీనములున్ = ఆధీనముకావలసినవానిని; త్రోవన్ = కాదనుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవునకైన; వశమె = సాధ్యమా, కాదు.

భావము:
“ఓ దనుజేంద్రా! బలీ! మూడడుగుల నేల ఇస్తాను అన్నావు కదా. భూలోకమూ, సూర్య చంద్రుల దాకా ఉండే స్థలము నాకు ఒక అడుగుకి సరిపోయింది. స్వర్గలోకం ఒక అడుగుకి సరిపోయింది. నీ సంపద అంతా ఈనాడు రెండు అడుగులైంది. ఇక మూడవ అడుగుకు చోటెక్కడుంది. ఇస్తానన్న అర్ధాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజమే కదా! అందువల్ల, నీకు కొంచెంసేపటిలో నరకం ప్రాప్తిస్తుంది. సందేహం లేదు. అలాకాకుండా మూడవ అడుగు ఇవ్వదలుచుకుంటే ఆచోటు నాకు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు."
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=641

: : చదువుకుందాం భాగవతం: బాగుపడదాం మనం అందరం : :

Monday 30 January 2017

వామన వైభవం - 101:

8-640-క.
సంపద చెడియును దైన్యము
గంపంబును లేక తొంటికంటెను బెంపుం
దెంపును నెఱుకయు ధైర్యము
వంపని సురవైరిఁ జూచి వటుఁ డిట్లనియెన్.

టీకా:
సంపద = ఐశ్వర్యము; చెడియును = నశించినను; దైన్యము = దీనత్వము; కంపంబునున్ = బెదురులు; లేక = లేకుండ; తొంటి = ఇంతకుముందు; కంటెను = కంటె; పెంపున్ = అతిశయము; తెంపు = తెగువ; ఎఱుకయున్ = జ్ఞానము; ధైర్యము = ధైర్యము; వంపని = తగ్గని; సురవైరిన్ = బలిచక్రవర్తిని; చూచి = చూసి; వటుడు = బ్రహ్మచారి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
ఐశ్వర్యం నశించినా బలిచక్రవర్తి లో దీనత్వమూ కంపమూ కలుగలేదు. అంతే కాదు వెనుకటికంటే ఔన్నత్యమూ. తెగువా, జ్ఞానమూ, ధైర్యమూ అధికం అయ్యాయి. అప్పుడు బలిచక్రవర్తిని చూచి వామనుడు ఇలా అన్నాడు.



http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=640

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 29 January 2017

వామన వైభవం - 100:

8-638-వ.
అట్లు గావున రణంబున శత్రుల కిప్పు డెదురు మోహరించుట కార్యంబుఁ గాదు; మనకుం దగు కాలంబున జయింతము; నలంగక తొలంగుం డనిన దలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసా తలంబునకుం జని; రంత హరి హృదయం బెఱింగి తార్క్ష్యనందనుండు యాగసుత్యాహంబున వారుణ పాశంబుల నసురవల్లభుని బంధించెను; అంత.
8-639-క.
బాహులుఁ బదములుఁ గట్టిన
శ్రీహరి కృపగాక యేమి జేయుదు నని సం
దేహింపక బలి నిలిచెను
హాహారవ మెసఁగె దశ దిగంతములందున్.

టీకా:
అట్లుగావున = అందుచేత; రణంబునన్ = యుద్దమునందు; శత్రుల్ = శత్రువుల; కున్ = కు; ఇప్పుడు = ఇప్పుడు; ఎదురు = ఎదురునిల్చి; మోహరించుట = వ్యూహములు పన్నుట; కార్యంబు = తగినపని; కాదు = కాదు; మన = మన; కున్ = కు; తగు = తగినట్టి; కాలంబునన్ = కాలంకలిసివచ్చినప్పుడు; జయింతము = గెలిచెదము; నలంగక = అనవసర శ్రమపడక; తొలంగుడు = తప్పుకొనుడు; అనినన్ = అనగా; తలంగి = తప్పుకొని; భాగవత = భగవంతుని, విష్ణు; భట = భటుల యెడ; భీతులు = భయపడువారు; ఐ = అయ్యి; చిక్కి = తగ్గి; రక్కసులున్ = రాక్షసులు; రసాతలంబున్ = రసాతలమున; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అప్పుడు; హరి = విష్ణుని; హృదయంబున్ = మనసు; ఎఱింగి = తెలిసికొని; తార్క్ష్యనందనుండు = గరుడకుమారుడు; యాగసుత్య = యాగముచివర సుత్య చేసెడి {సుత్య - స్నానము, సోమలతను కొట్టిపిడుచుట, సోమపానము}; అహంబునన్ = దినమున; వారుణపాశంబులన్ = వరుణ పాశములతో; అసురవల్లభుని = బలిచక్రవర్తిని; బంధించెను = బంధించెను; అంత = అంతట. బాహులున్ = చేతులు; పదములున్ = కాళ్ళు; కట్టినన్ = కట్టివేసినను; శ్రీహరి = విష్ణునియొక్క; కృప = దయ; కాక = కాకుండగ; యేమి = ఏమి; చేయుదును = చేయగలను; అని = అని; సందేహింపకన్ = సంకోచములేకుండ; బలి = బలి; నిలిచెను = మౌనమువహించెను; హాహారవములు = హాహాకారములు; ఎసగెన్ = చెలరేగెను; దశదిగంతముల్ = అన్నివైపుల; అందున్ = లోను.

భావము:
కనుక, ఇప్పుడు శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం తగదు. మనకు అనుకూలమైన సమయంలో గెలువవచ్చు. అనవసరంగా శ్రమపడకుండా తొలగిపొండి.” అని బలిచక్రవర్తి చెప్పాడు. అప్పుడు విష్ణుభక్తులకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్ళిపోయారు. అటుపిమ్మట యాగంలో సోమపానంచేసే చివరి దినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకుని గరుడుడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధించాడు. చేతులూ కాళ్ళూ కట్టబడిన బలి చక్రవర్తి, ఇది విష్ణువు దయ దీనికి ఏమీ చేయలేను అనుకుంటూ, సంకోచం ఏమీ లేకుండా మౌనం వహించాడు. అన్నివైపులా హాహాకారాలు చెలరేగాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=639

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 28 January 2017

వామన వైభవం - 99:

8-636-వ.
అదియునుం గాక.
8-637-క.
పలు దుర్గంబులు సచివులు
బలములు మంత్రౌషధములు బహు శేముషియుం
గలిగియు సామోపాయం
బులఁ గాల మెఱింగి నృపుడు పోరుట యొప్పున్.

టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండ.
పలు = అనేక; దుర్గంబులు = కోటలు; సచివులు = మంత్రులు; బలములు = సేనలు; మంత్ర = మంత్రాంగములు; ఔషధములు = ఔషధములు; బహు = మిక్కిలి; శేముషియున్ = యశస్సు; కలిగియున్ = ఉండికూడ; సామోపాయంబులన్ = అనుకూల వర్తనలద్వారా {సామోపాయము - అనుకూలప్రవర్తన, పంచతంత్రములలోనిది, ఇది పదివిధములు 1పరస్పరోపాకారము కనిపింపజేయుట 2మంచితనము 3గుణములను కొనియాడుట 4సంబంధములునెరపుట 5నేను నీవాడనని మంచిమాటలాడుట}; కాలమున్ = సమయము; ఎఱింగి = తెలిసికొని; నృపుండు = రాజు; పోరుట = యుద్దముచేయుట; ఒప్పున్ = సరియైనపని.


భావము:
అంతేకాక....రాజైనవాడు ఎంతటి కోటలూ, మంత్రులూ, సైన్యాలూ, మంత్రాలూ, ఔషదాలూ, తెలివితేటలూ ఉన్నప్పటికీ కాలాన్నిగమనించి ఓర్పుతో ఉపాయంతో యుద్ధం చేయడమే సరైన పని.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=80&Padyam=637

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 27 January 2017

వామన వైభవం - 98:

8-635-సీ.
రాక్షసోత్తములార! రండు పోరాడక;
కాలంబు గాదిది కలహమునకు;
సర్వభూతములకు సంపదాపదలకు;
బ్రభువైన దైవంబుఁ బరిభవింప
మన మోపుదుమె? తొల్లి మనకు రాజ్యంబును;
సురలకు నాశంబు సొరిది నిచ్చి
విపరీతముగఁ జేయు వేల్పు నే మందము;
మనపాలి భాగ్యంబు మహిమ గాక;
8-635.1-తే.
వెఱచి పలుమాఱుఁ బాఱెడి విష్ణుభటులు
మిమ్ము నెగచుట దైవంబు మేర గాదె?
మనకు నెప్పుడు దైవంబు మంచిదగును
నాఁడు గెలుతుము పగవారి నేఁడు వలదు.

టీకా:
రాక్షస = రాక్షసులలో; ఉత్తములారా = ఉత్తములు; రండు = వెనుకకివచ్చేయండి; పోరాడక = యుద్ధముచేయకుండ; కాలంబు = తగుసమయము; కాదు = కాదు; ఇది = ఇది; కలహమున్ = యుద్ధమున; కున్ = కు; సర్వ = సమస్తమైన; భూతముల్ = జీవుల; కున్ = కు; సంపద = కలిసివచ్చుటకు; ఆపదలకు = దుఃఖముల; కున్ = కు; ప్రభువు = అధిదేవత; ఐన = అయిన; దైవంబున్ = దేవుని; పరిభవింపన్ = ఓడించుటకు; మనము = మనము; ఓపుదుమె = సరిపోగలమా, సరిపోము; తొల్లి = ఇంతకుముందు; మన = మన; కున్ = కు; రాజ్యంబునున్ = రాజ్యమును; సురల్ = దేవతల; కున్ = కు; నాశంబున్ = చేటును; సొరిదిన్ = క్రమముగా; ఇచ్చి = ఇచ్చి; విపరీతముగన్ = దానికి వ్యతిరేకముగా; చేయు = చేసెడి; వేల్పున్ = దేవుని; ఏమందము = ఏమనగలము; మన = మన; పాలి = పాలిటి; భాగ్యంబు = యొక్క; మహిమ = ఫలమును; కాక = తప్పించి. వెఱచి = భయపడి; పలుమాఱు = అనేకసార్లు; పాఱెడి = పారిపోయెడి; విష్ణు = నారాయణుని; భటులు = సైనికులు; మిమ్మున్ = మిమ్ములను; ఎగచుట = ఎదిరించుట; దైవంబు = దేవునియొక్క; మేర = ఏర్పాటు ప్రకారము; కాదె = కాదా అవును; మన = మన; కున్ = కు; ఎప్పుడు = ఎప్పుడు; దైవంబు = అదృష్టము; మంచిది = అనుకూలము; అగును = అగునో; నాడు = అప్పుడు; గెలుతుము = నెగ్గెదము; పగవారి = శత్రువును; నేడున్ = ఈరోజు; వలదు = వద్దు.

భావము:
“ఓ రాక్షసవీరులారా! ఆగండి! యుద్ధానికి వెళ్ళకండి. మనకు ఇది సమయం కాదు. సర్వప్రాణుల సుఖాలకూ దుఃఖాలకూ అధికారియైన దేవుని ఓడించడం మన వల్ల కాదు. మొదట మనకు రాజ్యాన్ని ఇచ్చాడు. దేవతలకు చేటు కలిగించాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేసాడు. అటువంటి దేవుని ఏమనగలము. ఇదే మన అదృష్టఫలం. అనేక సార్లు భయపడి పారిపోయిన విష్ణుసేవకులు ఇప్పుడు మిమ్మల్ని ఎదిరించడం దైవనిర్ణయం. మనకు అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయిద్దాము. ఇప్పుడు వద్దు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=80&Padyam=635

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 26 January 2017

గణతంత్రం.....

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.... జై హింద్.....

వామన వైభవం - 97



8-634-వ.
అంత నొయ్యన పూర్వప్రకారంబున వామనాకారంబు వహించి యున్న వామనునిం గని "పదత్రయ వ్యాజంబున నితండు సకల మహీ మండలంబు నాక్రమించె కపటవటురూప తిరోహితుండగు విష్ణుండని యెఱుంగక మన దానవేంద్రుఁడు సత్యసంధుండు గావున మాటఁ దిరుగక యిచ్చె నతని వలన నేరంబు లేదు ఈ కుబ్జుం డప్రతిహత తేజః ప్రభావంబున సజ్జకట్టుగా ని జ్జగంబులం బరిగ్రహించి, పర్జన్యాదులకు విసర్జనంబు చేయందలంచి యున్నవాఁ, డీ పాఱునిం దూఱి పాఱనీక నిర్జించుటఁ గర్జం" బని తర్జనంబులును గర్జనంబులునుఁ జేయుచు, వజ్రాయుధాధి మరుజ్జేతలగు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులయిన రక్కసులు పెక్కం డ్రుక్కుమిగిలి యుద్ధంబునకు సన్నధులై పరశు పట్టిస భల్లాది సాధనంబులు ధరియించి కసిమెసంగి ముసరికొని దశదిశలఁ బ్రసరించినఁ జూచి హరిపరిచరులు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత విష్వక్సేన శ్రుతదేవ సాత్వత ప్రముఖులగు దండనాథు లయుత వేదండ సముద్దండ బలులుఁ దమతమ యూథంబుల నాయుధంబులతోడం గూర్చుకొని దానవానీకంబులం బరలోకంబున కనుచువారలై వారల నెదుర్కొని కదనంబునకున్ బరవసంబు చేయుచున్నం గనుంగొని శుక్రుశాపంబుఁ దలంచి దనుజ వల్లభుం డిట్లనియె.

టీకా:
అంతన్ = అంతట; ఒయ్యన్ = మెల్లగ; పూర్వ = ఇంతకుముందు; ప్రకారంబునన్ = వలెనె; వామన = వామనుని; ఆకారంబున్ = రూపును; వహించి = ధరించి; ఉన్నన్ = ఉండగా; వామనునిన్ = వామనుని; కని = చూసి; పదత్రయంబు = మూడడుగులు; వ్యాజంబునన్ = నెపంతో; ఇతండు = ఇతడు; సకల = సమస్తమైన; మహీ = భూ; మండలంబున్ = మండలమును; ఆక్రమించెన్ = ఆక్రమించెను; కపట = మాయా; వటు = బ్రహ్మచారి; రూప = రూపమున; తిరోహితుండు = మారువేషమునున్నవాడు; అగు = అయిన; విష్ణుండు = విష్ణువు; అని = అని; ఎఱుంగక = తెలియక; మన = మనయొక్క; దానవేంద్రుడు = రాక్షసరాజు; సత్యసంధుండు = సత్యవాది; కావున = కనుక; మాట = ఇచ్చినమాట; తిరుగక = వెనుతిరుగక; ఇచ్చెన్ = దానమిచ్చెను; అతని = అతని; వలన = వలన; నేరంబు = తప్పు; లేదు = లేదు; ఈ = ఈ; కుబ్జుండు = వామనుడు; అప్రతిహత = తిరుగులేని; తేజస్ = మహిమయొక్క; ప్రభావంబునన్ = ప్రభావమువలన; సజ్జకట్టుగాన్ = సిద్ధముగ; ఈ = ఈ; జగంబులన్ = లోకములను; పరిగ్రహించి = తీసుకొని; పర్జన్య = ఇంద్రుడు {పర్జన్య}; ఆదుల్ = మున్నగువారల; కిన్ = కు; విసర్జనంబు = ఇచ్చివేయుట; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొనుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఈ = ఈ; పాఱునిన్ = బ్రాహ్మణుని; తూఱి = తప్పించుకొని; పాఱనీక = పారిపోనీయక; నిర్జించుట = సంహరించుట; కర్జంబు = చేయవలసినపని; అని = అని; తర్జనంబులునున్ = వేలెత్తిబెదిరించుటలు; గర్జనంబులును = కేకలేయుటలు; చేయుచున్ = చేయుచు; వజ్రాయుధ = ఇంద్రుడు; ఆది = మున్నగు; మరుత్ = దేవతలను {మరుత్తులు - సప్తసప్తసంఖ్యులగు వేల్పులు}; జేతలు = జయించినవారు; అగు = అయిన; హేతి = హేతి; ప్రహేతి = ప్రహేతి; విప్రచిత్తి = విప్రచిత్తి; ముఖ్యులు = మున్నగువారు; అయిన = ఐన; రక్కసులున్ = రాక్షసులు; పెక్కండ్రు = అనేకమంది; ఉక్కుమిగిలి = పరాక్రమించి; యుద్దంబున్ = యుద్దముచేయుట; కున్ = కు; సన్నధులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి; పరశు = గండ్రగొడ్డలి; పట్టిస = అడ్డకత్తులు; భల్ల = బల్లెములు; ఆది = మున్నగు; సాధనంబులున్ = ఆయుధములు; ధరియించి = ధరించి; కసిమెసంగి = చెలరేగి; ముసురికొని = మూగి; దశదిశలన్ = అన్నివైపులనుండి; ప్రసరించినన్ = వ్యాపించుచుండగ; చూచి = చూచి; హరి = విష్ణుని; పరిచరులు = దూతలు; సునంద = సునందుడు; నంద = నందుడు; జయ = జయుడు; జయంత = జయంతుడు; విజయ = విజయుడు; ప్రబల = ప్రబలుడు; ఉద్బల = ఉద్బలుడు; కుముద = కుముదుడు; కుముదాక్ష = కుముదాక్షుడు; తార్క్ష్యు = తార్క్ష్యుడు; పుష్పదంత = పుష్పదంతుడు; విష్వక్శేన = విష్వక్సేనుడు; శ్రుతదేవ = శ్రుతదేవుడు; సాత్వత = సాత్వతుడు; ప్రముఖులు = మొదలైనవారు; అగు = అయిన; దండనాథులు = సేనానాయకులు; అయుత = పదివేల; వేదండ = ఏనుగులతో; సమ = సమానమైన; ఉద్దండ = అధికమైన; బలులు = బలములుకలవారు; తమతమ = వారివారి; యూథంబులన్ = సేనలను; ఆయుధంబుల్ = ఆయుధములు; తోడన్ = తోపాటు; కూర్చుకొని = కూడగొట్టుకొని; దానవ = దానవుల; అనీకంబుల్ = సైన్యములను; అంబర = పై; లోకంబుల్ = లోకముల; కున్ = కు; అనుచు = పంపెడి; వారలు = వారు; ఐ = అయ్యి; వారల్ = వారిని; ఎదుర్కొని = ఎదుర్కొని; కదనంబున్ = యుద్దమున; కున్ = కు; పరవసంబున్ = ఉత్సహించుట; చేయుచున్న = చేయుచుండగా; కనుంగొని = చూసి; శుక్రు = శుక్రుని; శాపంబున్ = శాపమును; తలంచి = గుర్తుచేసుకొని; దనుజ = రాక్షస; వల్లభుండు = చక్రవర్తి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
అటు పిమ్మట విష్ణువు మరల తన వామనరూపాన్ని ధరించాడు. హేతి ప్రహేతి విప్రచిత్తీ మొదలైన రాక్షసులు ఇంద్రుడు మొదలగు దేవతలను గెలిచిన వీరులు. అంతటి ఆ రాక్షస వీరులు “ఇతడు మూడడుగుల నెపంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువు అని తెలియక మన రాజు ఆడినమాట తప్పకుండా దానమిచ్చాడు. బలిచక్రవర్తి వద్ద తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రుడు మున్నగువారికి ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పారిపోకుండా పట్టి చంపేయాలి.” అంటూ బెదిరిస్తూ కేకలు వేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. గండ్రగొడ్డళ్ళూ, అడ్డకత్తులూ, ఈటెలూ మొదలైన ఆయుధాలు ధరించి, చెలరేగి అన్నివైపులా మూగారు. అదంతా చూసి విష్ణుసేవకులైన సునందుడూ, నందుడూ, జయుడూ, జయంతుడూ, విజయుడూ, ప్రబలుడూ, ఉద్బలుడూ, కుముదుడూ, కుముదాక్షుడూ, గరుడుడూ, పుష్పదంతుడూ, విష్వక్సేనుడూ, శ్రుతదేవుడూ, సాత్వతుడూ మొదలైన సేనాపతులు పదివేల ఏనుగుల బలంతోచొప్పున గల తమతమ సైన్యాలనూ ఆయుధాలనూ సమకూర్చుకున్నారు. యుద్ధంలో రాక్షస సైన్యాలను ఎదిరించి తుదముట్టించడానికి ఉత్సాహంతో సిద్ధపడ్డారు. అప్పుడు బలి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తు తెచ్చుకొని రాక్షసులతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=80&Padyam=634

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 25 January 2017

వామన వైభవం - 96:



8-633-క.
అన్నిజగంబులఁ దానై
యున్న జగన్నాథుఁ జూడ నొగి భావింపం
గన్నందక మన మందక
సన్నుతులం జేసి రపుడు సభ్యులు బలియున్.

టీకా:
అన్ని = సర్వ; జగంబులున్ = లోకములు; తాను = తానే; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; జగన్నాథున్ = విష్ణుని; చూడన్ = చూచుటకు; ఒగిన్ = సరిగా; భావింపన్ = భావించుటకు; కన్నందక = కంటికందక; మనమందక = మనసునకందక; సన్నుతులన్ = స్తోత్రములను; చేసిరి = చేసితిరి; అపుడు = అప్పుడు; సభ్యులు = సభలోనివారు; బలియున్ = బలిచక్రవర్తి.

భావము:
అన్ని లోకాలలోనూ వ్యాపించి నిండిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి కానీ, మనసుతో ఊహించడానికి కానీ వీలుకాక బలిచక్రవర్తి, ఆయన సభలోని వారూ చక్కటి స్తోత్రాలు చేసారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=633

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday 24 January 2017

వామన వైభవం - 95:

8-632-సీ.
యోగమార్గంబున నూహించి బహువిధ;
పుష్పదామంబులఁ బూజ చేసి
దివ్యగంధంబులుఁ దెచ్చి సమర్పించి;
ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి
భూరి లాజాక్షతంబులు జల్లి ఫలములుఁ;
గానిక లిచ్చి రాగములఁ బొగడి
శంఖాదిరవములు జయఘోషములుఁ జేసి;
కరుణాంబునిధి! త్రివిక్రమ! యటంచు
8-632.1-ఆ.
బ్రహ్మ మొదలు లోకపాలురుఁ గొనియాడి;
రెల్ల దిశల వనచరేశ్వరుండు
జాంబవంతుఁ డరిగి చాటె భేరిధ్వని
వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు.

టీకా:
యోగమార్గంబునన్ = దివ్యదృష్టితో; ఊహించి = ఊహించి; బహు = అనేకమైన; విధ = రకములైన; పుష్పదామంబులన్ = పూలమాలలతో; పూజచేసి = పూజించి; దివ్య = మేలైన; గంధంబులున్ = సుగంధద్రవ్యములను; తెచ్చి = తీసుకొచ్చి; సమర్పించి = సమర్పించి; ధూపదీపములన్ = ధూపదీపములను; తోడ్తోడన్ = వెంటవెంటనే; ఇచ్చి = ఇచ్చి; భూరి = అధికముగా; లాజ = పేలాలు; అక్షతలున్ = అక్షింతలు; చల్లి = వేసి; ఫలములన్ = పండ్లు; కానికలు = కానుకలు; ఇచ్చి = సమర్పించి; రాగములన్ = రాగయుక్తముగా; పొగడి = కీర్తించి; శంఖ = శంఖములు; ఆది = మున్నగు; రవములు = శబ్దములు; జయ = జయజయయనెడి; ఘోషములున్ = నాదములు; చేసి = చేసి; కరుణాంబునిధి = దయాసాగరుడా; త్రివిక్రమ = త్రివిక్రముడా; అట = అని; అంచున్ = అనుచు. బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మొదలు = మొదలగు; లోకపాలురు = లోకపాలకులు; కొనియాడిరి = కీర్తించిరి; ఎల్లన్ = అన్ని; దిశలన్ = వైపులను; వనచర = భల్లూకము; ఈశ్వరుండు = రాజు; జాంబవంతుడు = జాంబవంతుడు; అరిగి = వెళ్ళి; చాటె = చాటింపువేసెను; భేరి = బాజాల; ధ్వని = చప్పుడు; వెలయన్ = ప్రసిద్ధముగ; చేసి = చేసి; విష్ణు = విష్ణుమూర్తి; విజయము = జయము జయము; అనుచు = అనుచు.

భావము:
యోగమార్గంలో ఊహించి లోకాలను పాలించే బ్రహ్మదేవుడు మున్నగువారు మహావిష్ణువును అనేక రకాలైన పూలమాలలతో పూజలు చేసారు; మేలైన సుగంధ ద్రవ్యాలను, ధూపదీపాలనూ సమర్పించారు; అనంతమైన పేలాలనూ అక్షతలనూ చల్లారు; ఫలాలూ కానుకలూ పెట్టారు; సంతోషంతో కీర్తించారు; శంఖాలు మున్నగువాటిని ఊదారు; జయజయ నాదాలు చేసారు; కరుణాసముద్రా! త్రివిక్రమదేవా! అని కొనియాడారు; భల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులమ్మటా ఢంకా మ్రోగిస్తూ విష్ణుదేవుని విజయాన్ని చాటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=632

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 23 January 2017

వామన వైభవం - 94:



8-630-మ.
తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుఁడుం దన్నాభిపంకేరుహం
బు నిరీక్షించి నటించి యున్నత పదంబుం జూచి తత్పాదసే
చనముం జేసెఁ గమండలూదకములం జల్లించి; తత్తోయముల్
వినువీథిం బ్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్తిప్రభన్.
8-631-వ.
తత్సమయంబున.

టీకా:
తన = తన యొక్క; పుట్టిల్లు = జన్మస్థానము; ఇదె = ఇదె; పొమ్ము = సుమా; అంచున్ = అనుచు; అజుడు = బ్రహ్మదేవుడు; తత్ = అతని; నాభి = బొడ్డు; పంకేరుహంబున్ = తమ్మిని; నిరీక్షించి = చూసి; నటించి = మిక్కలి సంతోషించి; ఉన్నత = ఉన్నతమైన; పదంబున్ = పాదములను; చూచి = చూసి; తత్ = అతని; పాద = పాదములను; సేచనమున్ = తడపుట; చేసెన్ = చేసెను; కమండలు = కమండలములోని; ఉదకములన్ = నీటిని; చల్లించి = చల్లి; తత్ = ఆ; తోయముల్ = నీరు; వినువీథిన్ = ఆకాశమునందు; ప్రవహించెన్ = పారినవి; దేవనదిన్ = ఆకాశగంగ; నా = అనబడుతు; విశ్వాత్మున్ = విష్ణుమూర్తి; కీర్తి = యశస్సు యనెడి; ప్రభన్ = కాంతులై. తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు.

భావము:
మహవిష్ణువు బొడ్డు తామరను చూసి “నా జన్మస్థానం ఇదే సుమా!” అనుకుంటూ అజుడు అయిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మహొన్నతమైన ఆ పాదాన్ని దర్శించుకున్నాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జలధారలు కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఇంకా ఆ సమయంలో . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=630

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 22 January 2017

వామన వైభవం - 93:



8-629-సీ.
భవబంధములఁ బాసి బ్రహ్మలోకంబునఁ;
గాపురంబులు చేయు ఘనులు రాజు
లా మరీచ్యాదులు, నా సనందాదులు;
నా దివ్యయోగీంద్రు లచట నెపుడు
మూర్తిమంతంబులై మ్రోయు పురాణ త;
ర్కామ్నాయ నియమేతిహాస ధర్మ
సంహితాదులు గురుజ్ఞానాగ్నినిర్దగ్ద;
కర్ములై మఱియును గలుగునట్టి
8-629.1-తే.
వార లెల్లఁ జొచ్చి వచ్చి సర్వాధిపు
నంఘ్రిఁ జూచి మ్రొక్కి రధిక భక్తిఁ
దమ మనంబు లందుఁ దలచు నిధానంబుఁ
గంటి మనుచు నేఁడు మంటి మనుచు.

టీకా:
భవ = సంసార; బంధములన్ = బంధములను; పాసి = వదలి; బ్రహ్మలోకమునన్ = సత్యలోకమునందు; కాపురంబులుచేయు = నివాసము ఉండెడి; ఘనులు = గొప్పవారు; రాజులు = రాజులు; ఆ = ఆ; మరీచి = మరీచి; ఆదులున్ = మున్నగువారు; ఆ = ఆ; సనంద = సనందుడు; ఆదులున్ = మున్నగువారు; ఆ = ఆ; దివ్యయోగీంద్రుల్ = దేవర్షులు; అచటన్ = అక్కడ; ఎపుడున్ = ఎప్పుడు; మూర్తిమంతంబులు = రూపుదాల్చినవి; ఐ = అయ్యి; మ్రోయు = మారుమోగెడి; పురాణ = పురాణములు {పురాణము - పురాతన చరిత్రము, 1సర్గ (సృష్టి) 2ప్రతిసర్గ (ప్రతిసృష్టి) 3(మను)వంశము 4మన్వంతరము 5వంశానుచరితము అను పంచలక్షణములు కలవి ఇవి 18}; తర్క = తర్కశాస్త్రములు {తర్కము - శాస్త్రములు (నియమనగ్రంధములు) ఆరింటిలోనిది, 1తర్కము 2వ్యాకరణము 3ధర్మము 4మీమాంస 5వైద్యము 6జ్యోతిషము}; ఆమ్నాయ = వేదములు; నియమ = నియమము {నియమము - అష్టాంగయోగములలోని శరీరముకంటె భిన్నమైన మృజ్జలాదులు సాధనములుగా కలిగి నిత్యముగా ఆచరింపదగిన ఒక యోగాంగము (ఇది దశవిధము - 1తపము 2సంతోషము 3ఆస్తికత్వము 4దానము 5భగవదర్చన 6వేదాంతశ్రవణము 7లజ్జ 8మతి 9జపము 10వ్రతము}; ఇతిహాస = ఇతిహాసములు {ఇతిహాసము - పూర్వము జరిగిన కథ}; ధర్మ = ఉపనిషత్తులు; సంహిత = వేదాంగములు; ఆదులున్ = మొదలగునవాని; గురు = గొప్ప; జ్ఞాన = జ్ఞానము యనెడి; అగ్నిన్ = అగ్నిలో; నిర్దగ్ధ = పూర్తిగా కాలిపోయిన; కర్ములు = కర్మవాసనలుకలవారు; ఐ = అయ్యి; మఱియును = అతిశయించి; కలుగునట్టి = ఉండెడి. వారలు = వారు; ఎల్లన్ = అందరును; చొచ్చి = తోసుకు; వచ్చి = వచ్చి; సర్వాధిపున్ = విష్ణుని; అంఘ్రిన్ = పాదములను; చూచి = దర్శించుకొని; మ్రొక్కిరి = నమస్కరించిరి; అధిక = మిక్కలి; భక్తిన్ = భక్తితోటి; తమ = వారియొక్క; మనంబులన్ = మనసుల; అందున్ = లో; తలచు = భావించెడి; నిధానంబున్ = పెన్నిధిని; కంటిమి = దర్శించితిమి; అనుచున్ = అనుకొనుచు; నేడున్ = ఇవాళ; మంటిమి = ధన్యులమైతిమి; అనుచున్ = అనుకొనుచు.

భావము:
సంసార బంధాలను త్రెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మ లోకంలో నివాసం చేస్తున్న మహారాజులు మరీచీ మొదలైన వారూ; సనందుడూ మొదలైన దేనర్షులూ; అక్కడ ఎప్పుడూ ఆకారం ధరించి మారుమ్రోగుతుండే పురాణాలూ, తర్కశాస్త్రాలూ, వేదాలూ, వేదాంగాలు, ఇతిహాసాలూ, ధర్మశాస్తాలూ; మహజ్ఞానులైన పుణ్యాత్ములూ మున్నగువారు అందరూ ఆ సర్వనియంత అయిన మహావిష్ణువు పాదాన్ని దర్సించారు. ఆ పాదానికి మిక్కలి భక్తితో మ్రొక్కారు. మనస్సులలో “మేము భావిస్తున్న పెన్నిధీ కనిపించింది. ఈనాడు మేము ధన్యులం అయ్యాము. ” అనుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=629

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 21 January 2017

వామన వైభవం - 92:

8-627-వ.
తత్సమయంబున.
8-628-ఆ.
జగము లెల్ల దాఁటి చనిన త్రివిక్రము
చరణనఖర చంద్ర చంద్రికలను
బొనుఁగు పడియె సత్యమున బ్రహ్మతేజంబు
దివసకరుని రుచుల దివియ బోలె.
టీకా:తత్ = ఆ; సమయంబునన్ = సమయములో. జగములున్ = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; దాటి = మించి; చనిన = పోయిన; త్రివిక్రమున్ = త్రివిక్రముని; చరణ = కాలి; నఖర = గోరులనెడి; చంద్ర = చంద్రుని; చంద్రికలను = వెన్నెలలను; పొనుగుపడియెన్ = వెలవెలబోయెను; సత్యమునన్ = సత్యలోకములోని; బ్రహ్మ = బ్రహ్మదేవుని; తేజంబున్ = తేజస్సు; దివసకరుని = సూర్యుని; రుచులన్ = కాంతులందు; దివియన్ = దివిటీ, దీపము; పోలెన్ = వలె.

భావము:ఆ సమయంలో..... అన్నిలోకాలనూ దాటిపోయిన త్రివిక్రముని కాలిగోళ్ళకాంతికి సత్యలోకం లోని బ్రహ్మ తేజస్సు సూర్యునిముందు దివిటీ వలె వెలవెల పోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=628

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 20 January 2017

వామన వైభవం - 91:

8-625-మ.
ఒక పాదంబున భూమి గప్పి దివి వే ఱొంటన్ నిరోధించి యొం
డొకటన్ మీఁది జగంబు లెల్లఁ దొడి, నొండొంటిన్ విలంఘించి. ప
ట్టక బ్రహ్మాండకటాహముం బెటిలి వేండ్రంబై పరుల్ గానరా
కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్.
8-626-ఆ.
ఒక పదంబు క్రింద నుర్వి పద్మము నంటి
కొన్న పంకలవము కొమరుఁ దాల్చె;
నొకటి మీఁదఁ దమ్మి కొదిఁగిన తేఁటినా
వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున.

టీకా:
ఒక = ఒక; పాదంబులన్ = పాదముతో; భూమిన్ = భూమిని; కప్పి = కప్పివేసి; దివిన్ = స్వర్గమును; వేఱొంటన్ = ఇంకొకదానితో; నిరోధించి = ఆపి; ఒండొకటన్ = ఇంకొకదానితో; మీది = పైనున్న; జగంబులన్ = లోకములను; ఎల్లన్ = అన్నిటిని; తొడిన్ = క్రమముగా; ఒండొంటిన్ = ఒక్కొదానిని; విలంఘించి = దాటిపోయి; పట్టక = పట్టకపోవుటచేత; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; కటాహంబు = పైపెంకు; పెటిలి = బద్దలై; వేండ్రంబు = మిక్కిలి తీక్షణమైనదై; పరుల్ = ఇతరులు; కానరాక = కనబడకుండగ; ఒకడు = ఏకలుడు; ఐ = అయ్యి; వాక్ = మాటలకు; దృక్ = చూపులకు; అలభ్యుడు = అందనివాడు; ఐ = అయ్యి; హరి = విష్ణుడు; విభుండు = విష్ణుడు; ఒప్పారెన్ = ప్రసిద్దముగనుండెను; విశ్వాకృతిన్ = విశ్వరూపమునందు.
              ఒక = ఒక; పదంబు = పాదము; క్రిందన్ = కింద; ఉర్వి = భూమండలము; పద్మమున్ = పద్మమునకు; అంటికొన్న = అంటుకొన్నట్టి; పంక = బురద; లవము = రేణువువలె; కొమరు = మనోజ్ఞతను; తాల్చెన్ = ధరించెను; ఒకటి = ఇంకొకదాని; మీదన్ = మీద; తమ్మి = పద్మమున; ఒదిగిన = వంగియున్న; తేటిన్ = తుమ్మద; నా = వలె; వెలసె = ప్రకాశించెను; మిన్ను = ఆకాశము; నృపా = రాజా; త్రివిక్రమమున = విశ్వాకారమునందు.

భావము:
విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒకఅడుగులో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని, మరియొక అడుగుతో పైలోకాలనూ కప్పివేసాడు. క్రమంగా అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడంవలన బ్రహ్మాండభాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనేవించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానివాడై సంశోభించాడు.రాజా! విశ్వరూపంతో ఒకపాదం క్రింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురద ముద్ద వలె ఒప్పింది. ఇంకొక పాదం మీద ఉన్నఆకాశం పద్మం మీద వ్రాలిన తుమ్మెదవలె ప్రకాశించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=626

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 19 January 2017

వామన వైభవం - 90:

8-624-వ.
ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించి భువియును, నభంబును, దివంబును, దిశలును, దిశాఛిద్రంబు లును, సముద్రంబులునుఁ, జలదచల దఖిల భూతనివహంబులుం దానయై యేకీభవించి, క్రమక్రమంబున భూలోకంబునకుం బొడవై భువర్లో కంబు నతిక్రమించి, సువర్లోకంబును దలకడచి, మహర్లోకంబు దాఁటి, జనలోకంబునకు మీఁదై, తపంబునకు నుచ్ఛ్రితుండై, సత్యలోకంబు కంటె నౌన్నత్యంబు వహించి, యెడ లిఱుములు సందులు రంధ్ర ములు లేకుండ నిండి, మహాదేహ మహితుండై చరణతలంబున రసాతలంబునుఁ, బాదంబుల మహియును, జంఘల మహీధ్రంబు లును, జానువులఁ బతత్త్ర్రిసముదయంబులును, నూరువుల నింద్రసేన మరుద్గణంబులును, వాసస్థ్సలంబున సంధ్యయు, గుహ్యంబునఁ బ్రజాపతులును, జఘనంబున దనుజులును, నాభిని నభంబును, నుదరంబున నుదధిసప్తకంబును, నురంబున దారకానికరంబును, హృదయంబున ధర్మంబును, నురోజంబుల ఋతసత్యంబులును, మనంబునఁ జంద్రుండును, వక్షంబున గమలహస్త యగు లక్ష్మియుఁ, గంఠంబున సామాది సమస్త వేదంబులును, భుజంబులఁ బురంద రాది దేవతలునుఁ, గర్ణంబుల దిశలును, శిరంబున నాకంబును, శిరో జంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువును, నయ నంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణి నఖిలచ్ఛంద స్సముదయంబును, రసనంబున జలేశుండును, భ్రూయుగళం బున విధినిషేధంబులును, ఱెప్పల నహోరాత్రంబులును, లలాటం బునఁ గోపంబును, నధరంబున లోభంబును, స్పర్శంబునఁ గామం బును, రేతంబున జలంబును, బృష్ఠంబున నధర్మంబును, గ్రమణం బుల యజ్ఞంబులును, ఛాయల మృత్యువును, నగవులవలన ననేక మాయావిశేషంబులును, రోమంబుల నోషధులును, నాడీప్రదేశం బుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, బ్రాణం బుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘం బులును గలవాఁడయి, జలధరనినద శంఖ శార్ఙ సుదర్శన గదాదండ ఖ డ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కే యూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండును, నై బ్రహ్మాండంబు దన మేనికప్పు తెఱంగున నుండ విజృంభించి.

టీకా:
ఇట్లు = ఈ విదముగ; విష్ణుండు = నారాయణుండు; గుణత్రయ = త్రిగుణములతో {గుణత్రయము - 1సత్త్వ 2రజస్ 3తమస్ అనెడి 3 గుణములు}; ఆత్మకంబు = కూడినది; అగు = అయిన; విశ్వరూపంబున్ = విశ్వరూపమును; ధరియించి = ధరించి; భువియును = భూమండలము; నభంబును = ఆకాశమును; దివంబును = స్వర్గమును; దిశలును = నలుదిక్కులును; దిశాఛిద్రంబులును = నలుమూలలును; సముద్రంబులును = సముద్రములును; చలదచల = చరాచర; అఖిల = మున్నగు సమస్తమైన; భూత = జీవ; నివహంబులున్ = జాలములును; తాన = తనే; ఐ = అయ్యి; ఏకీభవించి = ఒకటిచేసి; క్రమక్రమంబునన్ = క్రమక్రమముగా; భూలోకంబున్ = భూలోకమున; కున్ = కంటె; పొడవు = పెద్ద; ఐ = అయ్యి; భువర్లోకంబున్ = భువర్లోకమును; అతిక్రమించి = దాటి; సువర్లోకంబునున్ = సువర్లోకమును; తలకడచి = దాటేసి; మహర్లోకంబున్ = మహర్లోకమును; దాటి = దాటి; జనలోకంబున్ = జనలోకమున; కున్ = కంటెను; మీద = ఎక్కువ ఎత్తు; ఐ = అయ్యి; తపంబున్ = తపోలోకమున; కున్ = కు; ఉచ్చితుండు = దాటినవాడు; ఐ = అయ్యి; సత్యలోకంబున్ = సత్యలోకము; కంటెన్ = కంటె; ఔన్నత్యంబు = ఎత్తగుటను; వహించి = చెంది; ఎడలు = చోటులు; ఇఱుములు = మరుగుస్థానములు; సందులు = సందులు; రంధ్రములున్ = కన్నములు; లేకుండ = లేకుండునట్లు; నిండి = నిండిపోయి; మహా = బాగాపెద్ద; దేహ = శరీరము కల; మహితుండు = గొప్పవాడు; ఐ = అయ్యి; చరణతలంబునన్ = అరికాళ్ళవద్ద; రసాతలంబును = రసాతలము; పాదంబులన్ = పాదములవద్ద; మహియును = భూతలము; జంఘలన్ = పిక్కలవద్ద; మహీధ్రంబులును = పర్వతములును; జానువులన్ = మోకాళ్ళవద్ద; పతత్రి = పక్షుల; సముదయంబులును = సమూహములు; ఊరువులన్ = తొడలవద్ద; ఇంద్రసేన = దేవతలను; మరుత్ = మరుత్తుల; గణంబులును = సమూహములు; వాసస్థ్సలంబునన్ = వస్త్రములవద్ద; సంధ్యయున్ = సంధ్యలు; గుహ్యంబునన్ = రహస్యాంగమువద్ద; ప్రజాపతులును = ప్రజాపతులు; జఘనంబున = పిరుదులవద్ద; దనుజులును = రాక్షసులు; నాభిన్ = బొడ్డువద్ద; నభంబును = ఆకాశము; ఉదరంబునన్ = పొట్టవద్ద; ఉదధిసప్తకంబును = సప్తసముద్రములు; ఉరంబున = వక్షమువద్ద; తారకా = నక్షత్రముల; నికరంబును = సమూహములు; హృదయంబునన్ = హృదయమువద్ద; ధర్మంబునున్ = ధర్మము; ఉరోజంబులన్ = స్తనములవద్ద; ఋత = నిజము; అసత్యంబులును = అబద్దములు; మనంబునన్ = మనసునందు; చంద్రుండును = చంద్రుడు; వక్షంబునన్ = వక్షస్థలమున; కమల = పద్మము; హస్త = చేత కలామె; అగు = అయిన; లక్ష్మియున్ = లక్ష్మీదేవి; కంఠంబునన్ = కంఠమునందు; సామ = సామవేదము; ఆది = మున్నగు; సమస్త = సమస్తమైన; వేదంబులును = వేదములు; భుజంబులన్ = భుజములందు; పురందర = ఇంద్రుడు; ఆది = మున్నగు; దేవతలును = దేవతలు; కర్ణంబులన్ = చెవులందు; దిశలును = దిక్కులు; శిరంబునన్ = తలయందు; నాకంబును = ఆకాశము; శిరోజంబులన్ = తలవెంట్రుకలందు; మేఘంబులును = మేఘములును; నాసాపుటంబునన్ = ముక్కు పుటములందు; వాయువును = వాయువు; నయనంబులన్ = కళ్ళయందు; సూర్యుండును = సూర్యుడు; వదనంబునన్ = ముఖమునందు; వహ్నియున్ = అగ్ని; వాణిన్ = మాటయందు; అఖిల = సమస్తమైన; ఛందస్ = ఛందస్సుల; సముదయంబును = సమూహములు; రసనంబున = నాలికయందు; జలేశుండును = వరుణుడు; భూయుగళంబునన్ = కనుబొమలయందు; విధి = తప్పక చేయవలసినవి; నిషేదంబులును = తప్పక చేయకూడనివి; ఱెప్పలన్ = కనురెప్పలందు; అహోరాత్రంబులు = రాత్రింబగళ్ళు; లలాటంబునన్ = నుదుట; కోపంబును = కోపము; అదరంబున = కిందిపెదవియందు; లోభంబును = లోభము; స్పర్శంబునన్ = స్పర్శయందు; కామంబును = కామము; రేతంబునన్ = వీర్యమున; జలంబును = నీరు; పృష్ఠంబునన్ = వీపునందు; అధర్మంబును = అధర్మము; క్రమణంబులన్ = అడుగులలో; యజ్ఞంబులును = యాగములు; ఛాయలన్ = నీడలందు; మృత్యువు = మరణము; నగవుల = నవ్వుల; వలనన్ = వలన; అనేక = అనేకమైన; మాయా = మాయల; విశేషంబులును = విశేషములు; రోమంబులన్ = శరీరరోమములందు; ఓషధులును = ఓషధులు; నాడీ = నాడుల; ప్రదేశంబులన్ = భాగములందు; నదులును = నదులు; నఖంబులన్ = గోర్లుయందు; శిలలును = బండరాళ్ళు; బుద్ధిన్ = బుద్ధియందు; అజుండును = బ్రహ్మదేవుడు; ప్రాణంబులన్ = ప్రాణములయందు; దేవర్షి = దేవఋషుల; గణంబులును = సమూహములు; గాత్రంబున = దేహమునందు; జంగమస్థావర = చరాచర; జంతు = జీవ; సంఘంబులునున్ = జాలమును; కలవాడు = కలిగినవాడు; అయి = అయ్యి; జలధరనినద = ఉరుములవలెమోగెడి; శంఖ = శంఖము; శార్ఙ = శార్ఙమనెడివిల్లు; సుదర్శన = సుదర్శనచక్రము; గదాదండ = గదాయుధము; ఖడ్గ = ఖడ్గము; అక్షయతూణీర = అక్షయములైన అంబులపొదితోను; విభాజితుండును = ప్రకాశించెడివాడును; మకరకుండల = చెవిమకరకుండలములు; కిరీట = కిరీటములు; కేయూర = భుజకీర్తులు; హార = హారములు; కటక = కాలిఅందెలు; కంకణ = చేతికంకణములు; కౌస్తుభమణి = కౌస్తుభమణి; మేఖలా = రత్నాలమొలనూళ్ళు; అంబర = పీతాంబరములు; వనమాలికా = వనమాలికలుతోను; విరాజితుండును = విరాజిల్లెడివాడును; సునంద = సునందుడు; నంద = నందుడు; జయ = జయుడు; విజయ = విజయుడు; ప్రముఖ = మొదలగు; పరిచర = పరిచారకుల; వాహినీ = సమూహములు; సందోహ = గుమిగూడి; పరివృతుండును = చుట్టునుచేరినవాడు; అమేయ = అంతులేని; తేజో = తేజస్సుతో; విరాజితుండును = విరాజిల్లెడివాడును; ఐ = అయ్యి; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; తన = తన యొక్క; మేని = దేహమునకు; కప్పు = మేలిముసుగు; తెఱంగునన్ = వలె; ఉండన్ = ఉండగా; విజృంభించి = విజృంభించి.

భావము:
ఈ విధంగా విష్ణువు సత్త్వరజస్తమో రూపకమైన విశ్వరూపాన్ని పొంది విజృంభించాడు. భూమి, ఆకాశమూ, స్వర్గమూ, దిక్కులూ, దిక్కుల మధ్య ప్రదేశాలూ, సముద్రాలూ, చరాచరములైన సమస్త ప్రాణులూ తానే అయ్యాడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించాడు. భువర్లోకమూ, సువర్లోకమూ, మహార్లోకమూ, జనోలోకమూ, తపోలోకమూ, దాటిపోయాడు. సత్యలోకం కంటే ఎత్తుగా ఎదిగిపోయాడు. అన్నిచోట్ల మూలమూలలూ సందుసందులూ నిండిపోయాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలలో భూమినీ, పిక్కలలో పర్వతాలనూ, మోకాళ్ళలో పక్షులను, తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్నీ, రహస్యాంగంలో ప్రజాపతులనూ, పిరుదులలో రాక్షసులనూ, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్తసముద్రాలనూ, వక్షంలో నక్షత్రసమూహాన్నీ, హృదయంలో ధర్మాన్ని, స్తనద్వయంలో ఋతాన్ని సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, ఎదలో లక్ష్మి దేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులూ, తలలో స్వర్గలోకాన్ని, తలవెంట్రుకలలో మేఘాలనూ, ముక్కుపుటాలలో వాయువునూ, కన్నులలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కులో సమస్త చందస్సునూ, నాలుకలో వరుణునీ, కనుబొమ్మలలో కార్యాకార్యాలనూ, రెప్పలలో రేయింబవళ్ళనూ, ఫాలభాగంలో కోపాన్నీ, క్రింది పెదవిలో లోభాన్నీ, స్పర్సలో కామాన్ని, రేతస్సులో జలాన్నీ, వీపులో అధర్మాన్నీ, అడుగులలో యజ్ఞాలనూ, నీడలో మరణాన్నీ, నవ్వులో మాయావిశేషాలనూ, రోమాలలో సస్యాలనూ, నరాలలో నదులనూ, గోళ్ళలో రాళ్లను, బుద్ధి
లో బ్రహ్మనూ, ప్రాణాలలో దేవర్షిగణాలనూ, శరీరంలో చరాచర సకలప్రాణులనూ, ఇమిడించికొన్నాడు. ఆయన మేఘంవలే మ్రొగే పాంచజన్యమనే శంఖంతో, శార్జ్గమనే ధనస్సుతో, సుదర్సనమనే చక్రముతో, కౌమోదకి అనే గదాదండంతో, నందకమనే ఖడ్గంతో, అక్షయములైన అంపపొదులతో ప్రకాశించుచున్నాడు. మకరకుండలాలతో, కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, కాలి అందెలుతో, కంకణాలతో, కౌస్తుభమణితో, రత్నాలమొల మొలనూలుతో, పీతాంబరంతో, వైజయంతీమాలికతో విరాజిల్లుతున్నాడు. సునందుడూ, జయుడూ, విజయడూ మొదలైన పరిచారకుల సమూహం చుట్టూ చేరి ఉంది. ఆయన మేరలేని తేజస్సుతో మెరుస్తున్నాడు. బ్రహ్మాండం ఆయన దేహానికి మేలిముసుగుగా ఒప్పుతున్నది.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=624

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 18 January 2017

వామన వైభవం - 89:

8-623-మ.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

టీకా:
రవిబింబంబున్ = సూర్యబింబము; ఉపమింపన్ = సరిపోల్చుటకు; పాత్రము = తగినది; అగు = అయిన; ఛత్రంబు = గొడుగు; ఐ = వలెనయ్యి; శిరోరత్నము = శిరసుపైని ఆభరణము; ఐ = వలెనయ్యి; శ్రవణ = చెవుల; అలంకృతి = అలంకారము; ఐ = వలెనయ్యి; గళ = కంఠమునందలి; ఆభరణము = ఆభరణము; ఐ = వలెనయ్యి; సౌవర్ణ = బంగారపు; కేయూరము = భుజకీర్తి; ఐ = వలెనయ్యి; ఛవిమత్ = మెరిసెడి; కంకణము = చేతికంకణము; ఐ = వలెనయ్యి; కటిస్థలిన్ = నడుమున; ఉదంచత్ = వేయబడిన; గంట = గంట; ఐ = వలెనయ్యి; నూపుర = కాలిఅందెల; ప్రవరంబు = పేరు; ఐ = వలెనయ్యి; పదపీఠంబు = పాదపీఠము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; తాన్ = అతను; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; నిండుచోన్ = అంతవ్యాపించునప్పుడు.

భావము:
వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలిఅందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట. 
అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్దహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తు ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=623

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday 17 January 2017

వామన వైభవం - 88:

8-622-శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

టీకా:
ఇంతింత = కొంచముమరికొంచము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరికొంచము; ఐ = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొచము; ఐ = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; ఐ = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవతలంత; ఐ = అయ్యి; ప్రభారాశి = వెలుగులరాశి, పాలపుంత; పైన్ = కంటెఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; ఐ = అయ్యి; ధ్రువుని = ధ్రువుడికంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకముకంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకముకంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివరవరకు; సంవర్ధి = నిండాపెరిగినవాడు; ఐ = అయ్యి.

భావము:
బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, కొంచం కొంచం ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. చూడండి అప్పుడే మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=622

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 16 January 2017

వామన వైభవం - 87:


8-619-ఆ.
చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు.
8-620-ఆ.
గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర
యక్ష పక్షి దేవతాహి పతులు
పొగడి రతని పెంపుఁ; బుష్పవర్షంబులు
గురిసె దేవతూర్యకోటి మొరసె.
8-621-వ.
ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి.

టీకా:
పుట్టి = పుట్టినతరవాత; నేర్చుకొనెనొ = నేర్చుకొన్నాడో లేక; పుట్టక = పుట్టుటకు ముందే; నేర్చెనో = నేర్చుకొన్నాడో; చిట్టి = లీలా, ముద్దుల {చిట్టి - చిట్టకము కలవి, లీలమాత్రపు}; బుద్దులు = బుద్దులు; ఇట్టి = ఇటువంటి; పొట్టి = పొట్టివాడైన; వడుగు = బ్రహ్మచారి; పొట్టన్ = కడుపునిండా; ఉన్నవి = ఉన్నట్టివి; ఎల్ల = అన్ని; బూమెలున్ = మాయలు; అని = అని; నవ్వి = నవ్వి; ఎలమిన్ = సంతోషముతో; ధరణిదానమున్ = భూదానమును; ఇచ్చెన్ = ఇచ్చెను; అపుడు = అప్పుడు. గ్రహ = గ్రహములు; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులు; సిద్ద = సిద్ధులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; యక్ష = యక్షులు; పక్షి = గరుడులు; దేవత = దేవతలు; అహిపతులు = సర్పరాజులు; పొగిడిరి = శ్లాఘించిరి; అతని = అతని యొక్క; పెంపున్ = ఔదార్యమును; పుష్ప = పూల; వర్షంబులున్ = వానలు; కురిసె = కురిసెను; దేవ = దివ్య; తూర్య = వాద్య; కోటి = సమూహములు; మొరసెన్ = మోగినవి. ఇట్లు = ఈ విదముగ; ధారా = దానజలధారను; పరిగ్రహంబు = తీసుకొనుట; చేసి = చేసి.

భావము:
ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్దులు పుట్టేకా నేర్చుకున్నాడా? పుట్టకముందే నేర్చుకున్నాడా? ఇతని పొట్ట నిండా మాయలే అంటు నవ్వి సంతోషంగా భూదానం యిచ్చాడు. బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలూ, మునీశ్వరులూ. సిద్ధులూ, గంధర్వులూ, కిన్నరులూ, యక్షులూ, గరుడులూ, దేవతలూ, సర్పరాజులూ అందరూ అతని గొప్పదనాన్ని పొగిడారు. పూలవానలు కురిపించారు. దేవతల విజయ దుందుభులు మారుమ్రోగాయి. ఈ విధంగా వామనుడు దానాన్ని గ్రహించి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=620

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 15 January 2017

వామన వైభవం - 86:



8-617-క.
"ఇది యేమి వేఁడితని నీ
మది వగవక ధారపోయుమా; సత్యము పెం
పొదవఁగ గోరిన యర్థం
బిది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకున్."
8-618-వ.
అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచ నుండు.

టీకా:
ఇది = దీనిని; ఏమి = దేనికి; వేడితి = అడిగితిని; అని = అని; నీ = నీ యొక్క; మదిన్ = మనసున; వగవక = చితించకుండ; ధారపోయుమా = దానమిమ్ము; సత్యమున్ = సత్యము; పెంపొదవన్ = పెంపొందేవిధముగ; కోరిన = అడిగిన; అర్థంబు = కోరిక; ఇది = ఇది; ఇచ్చుట = ఇచ్చుట; ముజ్జగంబులున్ = ముల్లోకములను; ఇచ్చుట = ఇచ్చుట; మాకున్ = మాకు. అని = అని; పలికిన = అనిన; వటుని = బ్రహ్మచారి; పలుకుల = మాటల; కున్ = కు; హర్ష = సంతోషముతో; నిర్భర = మిక్కిలి నిండిన; చేతస్కుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; వైరోచనుండు = బలిచక్రవర్తి {వైరోచనుడు - విరోచనునిపుత్రుడు, బలి};

భావము:
“నేనెందుకు దీనిని అడిగానని నీ మనస్సులో చింతించకుండా దానమియ్యి. సత్యం పెంపొందే విధంగా దీన్ని అడిగాను. ఈ మూడడుగులూ ఇస్తే మాకు మూడు లోకాలూ ఇచ్చినట్లే.” ఇలా పలికిన వామనుడి పలుకలకు విరోచనుడి కొడుకు అయిన బలి మనస్సు ఎంతగానో సంతోషంతో నిండిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=617

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 14 January 2017

శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు - 2017:

శ్రీ త్యాగరాజ స్వామి నాదోపాసనలో ముక్తి పొంది భక్తుల కందరికి దారి చూపిన మాహా వాగ్గేయకారుడు. పురందరదాసు, కబీరు తులసీదాసు, రామదాసు వంటి వారు కూడా భక్తిలో నాద యోగస్ధితిని పొంది మోక్షం పొందిన వారే. త్యాగరాజు కారణజన్ముడు.

తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో ఉండే కాకర్ల రామబ్రహ్మానికి జన్మించాడు త్యాగరాజు. తల్లి పేరు సీతమ్మ. త్యాగరాజు తాతగారు వీణాకాళహస్తయ్య ఈయన ప్రసిద్ధి కెక్కిన సంగీత విద్వాంసుడు. సంస్కృత, తెలుగు భాషల్లో పాండిత్యం గడించిన త్యాగరాజు శొంఠి వెంకట రమణయ్యగారి వద్ద చేరి సంగీతం అభ్యసించారు. రామకృష్ణానంద స్వామి అనే సన్యాసి ‘నారదోపాస్తి’ మంత్రాన్ని త్యాగరాజుకు ఉపదేశించారు. నారదుడు యతి రూపంలో వచ్చి ‘స్వరార్ణవం’ అనే సంగీత గ్రంధాన్ని అనుగ్రహించారు. త్యాగరాజు తన కృతులలో అనేక విధాలుగా వారిని స్తుతి చేశారు.

త్యాగయ్యకు పద్దెనిమిదవయేటనే పార్వతమ్మతో వివాహము జరిగింది. తదనంతరం రెండేడ్లకు తండ్రి మరణించాడు. పార్వతమ్మ ఐదు సంవత్సరాల తరువాత మరణించగా, ఆమె చెల్లెలు కమలాంబతో తిరిగి వివాహము జరిగింది. తంజావూరు రాజు శరభోజి ఎన్నో కానుకలను ఇచ్చి వారి సంస్ధానానికి ఆహ్వానించారు. కాని త్యాగయ్య తిరస్కరించారు. అప్పుడు ‘‘నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా’’ అని కళ్యాణి రాగంలో ఆలాపించారు.

దీంతో విసిగిన అన్నయ్య జపేశం త్యాగయ్య పూజించే రామపంచాయతన విగ్రహాలను కావేరీలో పారవేయగా తెల్లవారుజామున ఆ సంగతి తెలిసి ‘‘ ఎందు దాగినావో ’’ అనే కృతికి ఆకృతి నిచ్చారని ప్రతీతి. దుఃఖంతో భార్య కమాలాంబ మరియు కూతురు సీతాలక్ష్మిని వదిలి అనేక తీర్థయాత్రలు చేసి అనేకానేక ప్రసిద్ధ కీర్తనలు రాసారు.ఆయన పరితాపము చూసి రాముడే కలలో కన్పించి తాను కావేరీలో ఉన్నానని తెలియజేశారట. త్యాగరాజు విగ్రహమూర్తిని తెచ్చుకుంటూ ‘‘రారా మాయింటి దాకా’’ అని అసావేరి రాగంలో పాడారట.

వాల్మీకి లాగానే 2,400 కృతులను ఈయన రచించగా నేడు లభ్యం అవుతున్నవి 600 లకు మించి ఉండవని విజ్ఞుల అభిప్రాయం.ఈయన 72 మేళకర్త రాగాలు మరియు ఎన్నో జన్యరాగాలలో కీర్తనలు రచించారు. అయితే అది కూడా వరుస క్రమంగా సులభ లభ్యం కావడంలేదు. వీరి రచనలలో అత్యున్నతమైన "ఘనరాగ పంచరత్న కృతులు" జగత్‌ ప్రసిద్ది కెక్కాయి. త్యాగయ్య ప్రహ్లాద భక్త విజయము, నౌకా చరిత్ర, సీతారామ విజయం అనే సంగీత నాటికలను కూడా రచించారు.

1767సంవత్సరం మే 4న పుట్టిన త్యాగరాజు దాదాపు 80 సంత్సరాలు జీవించి 1847వ సంవత్సరం జనవరి 6న అంటే పుష్య బహుళ పంచమినాడు ఆ రామునిలో ఐక్యం చెందారు. అప్పటి నుండి అశేష సంగీతప్రియులు ఆయన పుణ్యతిథినాడు 'త్యాగరాజ ఆరాధనోత్సవాల' పేరిట ప్రతి యేటా ఐదు రోజుల పాటు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నారు. ఆరాధనోత్సవాలు ఆయన పుణ్యతిథికి ఐదు రోజుల ముందు ప్రారంభమై సరిగ్గా పుణ్యతిథి నాడు ముగుస్తాయి. ఈ సంవత్సరం 13-01-2017 నుండి 17-01-2017 వరకు 170వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరగుతున్నాయి.... జై శ్రీ రామ...

వామన వైభవం - 85:



8-615-క.
"క్షితి దానమిచ్చు నతఁడును
నతికాంక్షఁ బరిగ్రహించు నతఁడును దురిత
చ్యుతులై శతవత్సరములు
శతమఖ లోకమునఁ గ్రీడ సలుపుదు రెలమిన్.
8-616-వ.
అట్లుగావున నే దానంబును భూదానంబునకు సదృశంబు గానేరదు; గావున వసుంధరా దానం బిచ్చితి; వుభయలోకంబులం గీర్తి సుకృతం బులు పడయు" మని పలికి య మ్మాయావటుం డిట్లనియె.

టీకా:
క్షితిదానము = భూదానమును; ఇచ్చు = ఇచ్చెడి; అతడున్ = వాడు; అతి = మిక్కిలి; కాంక్షన్ = కోరికతో; పరిగ్రహించు = తీసుకొనెడి; అతడున్ = వాడు; దురిత = పాపములు; చ్యుతులు = నశించినవి; ఐ = అయ్యి; శత = నూరు (100); వత్సరములు = సంవత్సరములు; శతమఖ = ఇంద్రుని; లోకమునన్ = లోకమునందు; క్రీడన్ = విహరించుట; సలుపుదురు = చేసెదరు; ఎలమిన్ = సంతోషముతో. అట్లుగావున = అందుచేత; ఏ = ఎట్టి; దానంబును = దానముకూడ; భూదానంబున్ = భూదానమున; కున్ = కు; సదృశంబున్ = సమానమైనది; కానేరదు = కాలేదు; కావున = అందుచేత; వసుంధరాదానంబు = భూదానము; ఇచ్చితివి = ఇచ్చినావు; ఉభయ = ఇహపరరెండు; లోకంబులన్ = లోకములలోను; కీర్తి = యశము; సుకృతంబులు = పుణ్యములు; పడయుము = పొందుదువుగాక; అని = అని; పలికి = చెప్పి; ఆ = ఆ; మాయా = కపట; వటుండు = బ్రహ్మచారి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
అంతట మాయాబ్రహ్మచారి బలిచక్రవర్తి తో ఇలాఅన్నాడు. “భూమిని దానం ఇచ్చిన వాడికి; దానిని ప్రీతితో తీసుకున్న వాడికి పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా నూరు యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో నూరేండ్లు విహరిస్తారు. అందుచేత, ఏదానమూ భూదానానికి సమానంకాదు. భూదానం ఇచ్చిన నీకు ఇహ పర లోకాలు రెంటిలోనూ కీర్తీ, పుణ్యమూ కలుగుతుంది.” అని పలికి మాయాబ్రహ్మచారి మళ్లీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=615

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 13 January 2017

వామన వైభవం - 84:

8-613-ఆ.
కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ
మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁ గలఁడె.
8-614-క.
బలి చేసిన దానమునకు
నళినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం
గలకల మని దశదిక్కులు
బళిబళి యని పొగడె భూతపంచక మనఘా!

టీకా:
కమలనాభున్ = విష్ణుడని; ఎఱిగి = తెలిసి; కాలంబు = కాలప్రభావము; దేశంబు = ప్రదేశప్రభావములను; ఎఱిగి = తెలిసి; శుక్రు = శుక్రుని; మాటలు = మాటలను; ఎఱిగి = తెలిసి; నాశమున్ = కలిగెడిచేటు; ఎఱిగి = తెలిసి; పాత్రము = యోగ్యమైనది; అనుచున్ = అనుచు; ఇచ్చెన్ = ఇచ్చెను; దానమున్ = దానమును; బలి = బలి; మహిన్ = భూమిమీద; వదాన్యుడు = దాత; ఒరుడు = ఇంకొకడు; మఱియున్ = మఱి; కలడె = ఉండగలడా, లేడు. బలి = బలి; చేసిన = చేసినట్టి; దానమున్ = దానమున; కున్ = కు; నళినాక్షుండు = విష్ణువు; నిఖిల = సమస్తమైన; భూత = జీవుల; నాయకుడు = ప్రభువు; అగుటన్ = అగుటవలన; కలకలము = కలకల; అని = అని; దశ = పది; దిక్కులు = దిశలందు {దశదిక్కులు - 4దిక్కులు 4మూలలు పైన కింద మొత్తం 10వైపులు}; భళిభళి = ఓహో ఓహో; అని = అని; పొగడె = శ్లాఘించెను; భూతపంచకము = పంచభూతములును {పంచభూతములు - 1పృథివి 2అప్పు 3తేజస్సు 4వాయువు 5ఆకాశము}; అనఘా = పుణ్యుడా.

భావము:
బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తెలుసుకున్నాడు. దేశకాలాలు తెలుసుకున్నాడు. శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు. తనకు చేటువాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికి యోగ్యమైనదిగా భావించి ఆ దాన మిచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడుంటాడా? ఓ పరీక్షన్మహారాజా! సర్వ భూతాలకూ విష్ణువు అధిపతి కదా. కనుక, ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులు అన్నీ కళకళలాడాయి. పంచభూతాలూ “భళి భళి” అని పొగిడాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=614

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 12 January 2017

వామన వైభవం - 83:

8-611-మ.
అమరారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభః కణశ్రేణికిం
గమలాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌకస్స్వామిజిన్మస్తముం
గమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకుచోపాస్తమున్
విమలశ్రీ కుచశాత చూచుక తటీవిన్యస్తమున్ హస్తమున్.
8-612-క.
మునిజన నియమాధారను
జనితాసుర యువతి నేత్రజలకణ ధారన్
దనుజేంద్ర నిరాధారను
వనజాక్షుఁడు గొనియె బలివివర్జితధారన్.

టీకా:
అమరారాతి = బలిచక్రవర్తి {అమరారాతి - దేవతల శత్రువు (బలి)}; కరా = చేతిలోని; అక్షత = అక్షతలతో; ఉజ్జిత = విడువబడిన; పవిత్ర = పవిత్రమైన; అంభస్ = నీటి; కణ = బిందువుల; శ్రేణి = వరుస; కిన్ = కు; కమలాధీశుడు = విష్ణువు {కమలాధీశుడు - కమలా (లక్ష్మీదేవి) అధీశుడు (భర్త), విష్ణువు}; ఒడ్డె = పట్టెను; ఖండిత = తెగగొట్టబడిన; దివౌకస్స్వామి = ఇంద్రుని {దివౌకస్స్వామి - దివౌకస్ (స్వర్గవాసుల) స్వామి (ప్రభువు), ఇంద్రుడు}; జిత్ = జయించువాని; మస్తమున్ = తల కలదానిని; కమల = లక్ష్మీదేవిని; ఆకర్షణ = పిలుచుటలో; సుప్రశస్తమున్ = మిక్కిలి ప్రసిద్దమైనదానిని; రమాకాంత = లక్ష్మీదేవి; కుచ = స్తనములమీద; అపాస్తమున్ = మర్యాదలుపొందుదానిని; విమల = నిర్మలమైన; శ్రీ = లక్ష్మీదేవి; కుచ = స్తనముల; చూచుక = అగ్రముల; తటీ = ప్రదేశమున; విన్యస్తమున్ = కదలెడిదానిని; హస్తమున్ = చేతిని.  ముని = మునుల; జన = సమూహముయొక్క; నియమ = నిష్ఠలకు; ఆధారను = ఆధారభూతమైన దానిని; జనిత = కలిగించబడిన; అసుర = రాక్షస; యువతి = స్త్రీల; నేత్రజల = కన్నీటి; కణ = బిందువుల; ధారన్ = ధారకలదానిని; దనుజేంద్ర = బలిచక్రవర్తిని; నిరాధారను = నిరాధారుని చేసెడిదానిని; వనజాక్షుడు = విష్ణువు; కొనియె = గ్రహించెను; బలి = బలిచేత; వివర్జిత = విడువబడిన; ధారన్ = దానజలధారను.

భావము:
ఆటంకం లేకుండా దైవవిద్వేషి బలిచక్రవర్తి చేతిలోని అక్షింతలతో పవిత్రమైన జలం ధారపోసాడు. పవిత్రమైన ఆ నీటిబిందువులకు ఆ లక్ష్మీపతి వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి ఎలాంటిది అంటే. రాక్షసుల శిరస్సులు ఖండించునది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది. లక్ష్మీదేవి శిరోజాలచే సేవించబడునది. నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది.
                                                బలిచక్రవర్తి అందించిన దానధారను పద్మాలవంటి కన్నులు గలస్వామి వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది. రాక్షసస్త్రీలను కన్నీటి పాలుచేసేది. రాక్షసరాజులను నిరాధారులుగా మార్చేది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=611

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 11 January 2017

వామన వైభవం - 82:

8-609-ఆ.
నీరధారఁ బడఁగ నీక యడ్డంబుగాఁ
గలశరంధ్ర మాఁపగాను దెలిసి
హరియుఁ గావ్యు నేత్ర మటఁ గుశాగ్రంబున
నడువ నేకనేత్రుఁ డయ్యె నతఁడు.
8-610-వ.
అంత

టీకా:
నీరన్ = నీటిని; ధారన్ = ధారగా; పడనీక = పడనీయకుండ; అడ్డంబుగాన్ = అడ్డముగా; కలశ = కలశము యొక్క; రంధ్రమున్ = కన్నమును; ఆపగాను = ఆపివేయగా; తెలిసి = తెలిసికొని; హరియున్ = విష్ణువు; కావ్యు = శుక్రాచార్యుని {కావ్యుడు - కవ ియొక్క పుత్రుడు, శుక్రుడు}; నేత్రమున్ = కంటిని; అటన్ = అక్కడ; కుశ = దర్భ; అగ్రమునన్ = కొనతో; నడువన్ = పొడువగా; ఏకనేత్రుడు = ఒంటికన్నువాడు; అయ్యెన్ = అయ్యెను; అతడు = అతను.... అంత = అంతట.

భావము:
నీళ్ళధార పడకుండా శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడి ఆపేసాడు. సాక్షాత్తు విష్ణువు అయిన వామనుడు ఆ సంగతి తెలుసుకుని దర్భకొనతో పొడిచాడు. దానివలన శుక్రునికి ఒంటి కన్ను వాడు అయ్యాడు. అలా ఒంటి కన్నువాడై శుక్రాచార్యుడి అడ్డు తప్పుకున్న పిమ్మట. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=609

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday 10 January 2017

వామన వైభవం - 81:

8-607-శా.
"విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!" యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర
హ్మప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్.
8-608-వ.
తత్కాలంబున.

టీకా:
విప్రాయ = బ్రాహ్మణుడవు; ప్రకట = ప్రసిద్దమైన; వ్రతాయ = నిష్ఠ కలవాడవు; భవతే = నీకు; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; స్వరూపాయ = స్వరూపము ఐనవాడవు; వేద = వేదములందలి; ప్రామాణ్య = ప్రమాణములను; విదే = తెలిసివాడవు; త్రి = మూడు (3); పాద = అడుగుల; ధరణిన్ = భూమిని; దాస్యామి = దానము చేయుచుంటిని; అంచున్ = అనుచు; క్రియాక్షిప్రుండు = పనియందు త్వరకలవాడు; ఐ = అయ్యి; దనుజేశ్వరుండు = రాక్షసరాజు; వడుగున్ = బ్రహ్మచారిని; చేన్ = చేయి; చాచి = చాచి; పూజించి = పూజచేసి; బ్రహ్మ = పరబ్రహ్మకి; ప్రీతమ్ము = ప్రీతికలుగగాక; అని = అని; ధారపోసె = ధారపోసెను {ధారపోయు - దానముచేసెడి క్రియలో నీటిధారను దాత చేతినుండు గ్రహీత చేతిలో పడునట్లు పోసెడి విధి}; భువనంబు = జగత్తంతా; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యము; పొందగన్ = పడునట్లుగా..... తత్ = ఆ; కాలంబునన్ = సమయమునందు.

భావము:
బలిచక్రవర్తి చేతులు సాచి వామడిని పూజించాడు. “బ్రాహ్మణుడవూ; ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు; విష్ణు స్వరూపుడవూ; వేదాల నియమాలు తెలిసినవాడవూ; అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను.” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక. ” అంటూ వెనువెంటనే ధారపోసాడు. అదిచూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో. . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=607

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 9 January 2017

వామన వైభవం - 80:

8-605-క.
సురలోక సముద్ధరణము
నిరతశ్రీకరణ మఖిల నిగమాంతాలం
కరణము భవసంహరణము
హరిచరణము నీఁటఁ గడిగె నసురోత్తముడున్.
8-606-వ.
ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణ నంబు చేసి.

టీకా:
సురలోక = దేవతలు అందరను; సముద్ధరణమున్ = చక్కగా కాపాడెడిది; నిరత = కలకాలము; శ్రీకరణ = మేలుకలిగించెడిది; అఖిల = సర్వ; నిగమాంత = వేదాంతములకు; అలంకరణమున్ = అలంకారమైనది; భవ = పునర్జన్మప్రాప్తి; హరణమున్ = పోగొట్టునది; హరి = విష్ణునియొక్క; చరణమున్ = పాదమును; నీటన్ = నీటితో; కడిగెన్ = శుభ్రపరచెను; అసుర = రాక్షసులలో; ఉత్తముడున్ = శ్రేష్ఠుడు. ఇట్లు = ఈ విధముగ; ధరణీసుర = బ్రాహ్మణుని {ధరణీసురుడు - భూమిపైదేవత, విప్రుడు}; దక్షిణ = కుడి; చరణ = పాదమును; ప్రక్షాళనము = కడుగుట; చేసి = చేసి; వామ = ఎడమ; పాదంబున్ = పాదమును; కడిగి = కడిగి; తత్ = ఆ; పావన = పవిత్రమైన; జలంబున్ = నీటిని; శిరంబునన్ = తలపైన; చల్లుకొని = ప్రోక్షించుకొని; వార్చి = ఆచమనముచేసి; దేశ = ప్రదేశము; కాల = కాలము; ఆది = మున్నగువాని; పరిగణన = ఎంచిపలికుట; చేసి = చేసి.

భావము:
దేవతలను కష్టాలనుండి కాపాడేది. కలకాలమూ మేలుకలిగించేవి. సమస్త ఉపనిషత్తులకూ అలంకారం అయినవి. భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేవి వామనుడైన విష్ణువు కుడిపాదాలు. అటువంటి ఆయన కుడి పాదాన్ని బలిచక్రవర్తి నీటితో కడిగాడు. అదే విధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్నికూడా కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తి మీద చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశమూ కాలమూ మొదలైన వాటిని లెక్కించి. . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=605

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 8 January 2017

వామన వైభవం - 79:

8-603-వ.
అనిన విని
8-604-మ.
బలి దైత్యేంద్ర కరద్వయీ కృత జలప్రక్షాళనవ్యాప్తికిన్
జలజాతాక్షుఁడు చాఁచె యోగి సుమనస్సంప్రార్థితశ్రీదముం
గలితానమ్ర రమా లలాటపదవీ కస్తూరికా శాదమున్
నలినామోదము రత్ననూపురిత నానావేదముం బాదమున్.

టీకా:
అనిన = అనగా; విని = విని.  బలిదైత్యేంద్ర = బలిచక్రవర్తి; కర = చేతుల; ద్వయీ = రెంటి (2) చేతను; కృత = చేయబడెడి; జల = నీటితో; ప్రక్షాళన = కడుగుట; వ్యాప్తికిన్ = నడచుటకు; జలజాతాక్షుడు = విష్ణువు {జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; చాచెన్ = చాచెను; యోగి = యోగులయొక్క; సుమనస్ = మంచి మనసులచే; సంప్రార్థిత = చక్కగా సేవింపబడెడి; శ్రీ = శుభములను; దమున్ = కలిగించెడిది; కలిత = కలిగిన; ఆనమ్ర = వంగినట్టి; రమా = లక్ష్మీదేవి; లలాట = నుదుట; పదవీ = ఉన్న; కస్తూరికా = కస్తూరితిలకము; శాదము = పంకముకలది; నలినా = పద్మముల; ఆమోదమున్ = పరిమళము కలది; రత్న = మణులుపొదిగిన; నూపురిత = అందెలు కలగిన; నానా = సమస్త; వేదమున్ = వేదములునునైనది; పాదమున్ = పాదమును.

భావము:
బలిచక్రవర్తి పిలుపును విని.... బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనువుగా వామనుడు తన కుడిపాదాన్ని సాచాడు. ఆ పాదం యోగులూ, దేవతలూ కోరుకొనే సంపదలను సమకూర్చునది; భక్తితో వంగిన లక్ష్మిదేవి నొసటి మీది కస్తూరి కుంకుమతో కూడినది; పద్మాల పరిమళం గుబాళించునది; ఆ పాదం వేదాలరాశి అనే మణిమంజీరాలు అలంకరించుకున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=604

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 7 January 2017

వైకుంఠ ఏకాదశి:

(08 - 01 - 2017, ఆదివారం ):

రేపే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.

పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటిఏకాదశి అంటారు. వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందు వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.



ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్నదానం చేస్తారు. ఒక రోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండడం చాలా శ్రేష్ఠం. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి.



కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే!వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటి నుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు...


వామన వైభవం - 78:

8-601-వ.
అయ్యవసరంబునఁ గపటవటునకు న ద్దానవేంద్రుం డిట్లనియె.
8-602-క.
"రమ్మా మాణవకోత్తమ!
లెమ్మా నీ వాంఛితంబు లే దన కిత్తుం
దెమ్మా యడుగుల నిటు రా
నిమ్మా కడుగంగవలయు నేటికిఁ దడయన్? "



టీకా:
ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; కపట = మాయా; వటున్ = బ్రహ్మచారి; కున్ = కి; ఆ = ఆ; దానవేంద్రుడు = రాక్షసరాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను. రమ్మా = రమ్ము; మాణవక = బ్రహ్మచారి; ఉత్తమ = శ్రేష్ఠుడ; లెమ్మా = లెమ్ము; నీ = నీ యొక్క; వాంఛితంబున్ = కోరికను; లేదు = లేదు; అనకన్ = అనకుండగా; ఇత్తున్ = ఇచ్చెదను; తెమ్మా = తెమ్ము; అడుగులన్ = పాదములను; ఇటు = ఇటుపక్కకి; రానిమ్మా = రానిమ్ము; కడుగంగ = కడుగుట; వలయున్ = చేయవలెను; ఏటికి = దేనికి; తడయన్ = ఆలస్యముచేయుట.

భావము:
అప్పుడు మాయా బ్రహ్మచారి వామనుడితో, ఆ రాక్షసేంద్రుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు. “ఓ బాలకా! లేవయ్యా! ఇలా రావయ్యా! నీవు అడిగింది ఇస్తాను. నీ పాదాలు కడగనియ్యి. ఇంకా ఆలస్యం చేయటం దేనికి. ”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=602

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 6 January 2017

వామన వైభవం - 77:

8-599-వ.
అ య్యవసరంబున.
8-600-ఆ.
దనుజలోకనాథు దయిత వింధ్యావళి
రాజవదన మదమరాళ గమన
వటుని కాళ్ళుఁ గడుగ వరహేమ ఘటమున
జలముఁ దెచ్చె భర్త సన్న యెఱిఁగి.

టీకా:
ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు. దనుజలోక = రాక్షసులందరికి; నాథు = రాజుయొక్క; దయిత = భార్య; వింధ్యావళి = వింధ్యావళి; రాజవదన = చంద్రముఖి; మదమరాళ = రాయంచలవంటి; గమన = నడకలు కలామె; వటుని = బ్రహ్మచారి; కాళ్ళు = పాదములు; కడుగ = కడుగుటకు; వర = శ్రేష్ఠమైన; హేమ = బంగారు; ఘటమునన్ = కలశముతో; జలమున్ = నీటిని; తెచ్చెన్ = తీసుకువచ్చెను; భర్త = మొగుని; సన్న = సంజ్ఞను; ఎఱిగి = అర్థముచేసికొని.

భావము:
ఆ సమయంలో..... బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి. ఆమె ముఖము చందమామ వంటిది. ఆమె నడకలు రాజహంస నడకలు. ఆ సందర్భంలో ఆమె భర్త సైగ గమనించింది. బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=600

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 5 January 2017

వామన వైభవం - 76:

8-597-వ.
అని యిట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్త్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియతసత్యసంధుండును, నర్థిజన కమలబంధుండును నైన బలిం జూచి శుక్రుండు గోపించి "మదీయ శాసనం బతిక్రమించితివి గావున శీఘ్రకాలంబునఁ బదభ్రష్టుండవుఁ గ" మ్మని శాపం బిచ్చె బలియును గురుశాపతప్తుండయ్యు ననృతమార్గంబు నకభిముఖుండుఁ గాకుండె; అప్పుడు.
8-598-ఆ.
బ్రతుక వచ్చుఁగాఁక బహుబంధనములైన
వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక
జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
మాటఁ దిరుఁగ లేరు మానధనులు.

టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; సత్యపదవీ = సత్యమార్గమునుండి; ప్రమాణ = చలించని; తత్పరుండు = నిష్ఠ కలవాడు; వితరణ = దానముచేయవలెనని; కుతూహల = కౌతుకము; సత్వరుండును = తహతహలాడువాడు; విమల = నిర్మలమైన; యశస్కుండును = కీర్తి కలవాడు; దృఢ = గట్టి; మనస్కుండును = మనసు కలవాడు; నియత = నియమబద్దమైన; సత్యసంధుడును = సత్యసంధుడు; ఐనన్ = అయినట్టి; బలిన్ = బలిని; చూచి = చూసి; శుక్రుండు = శుక్రుడు; కోపించి = కోపగించుకొని; మదీయ = నా యొక్క; శాసనంబున్ = ఆజ్ఞను; అతిక్రమించితివి = మీరితివి; కావునన్ = కనుక; శీఘ్ర = కొద్ది; కాలంబునన్ = కాలములోనే; పద = పదవినుండి; భ్రష్టుండవు = జారిపోయినవాడవు; కమ్ము = అయిపో; అని = అని; శాపంబున్ = శాపమును; ఇచ్చెన్ = ఇచ్చెను; బలియునున్ = బలి; గురు = గురువు యొక్క; శాప = శాపమునకు; తప్తుండు = గురైనవాడు; అయ్యున్ = అయినప్పటికి; అనృత = అసత్యము; మార్గంబున్ = వైపునకు; అభిముఖుండు = వెళ్ళువాడు; కాకుండెన్ = కాలేదు; అప్పుడు = ఆ సమయమునందు.
          బ్రతుకన్ = బాగాబతుక; వచ్చుగాక = కలిగినసరే; బహు = పలువిధముల; బంధనములు = కష్టములు; ఐనన్ = కలిగిన; వచ్చుగాక = కలిగినసరే; లేమి = పేదరికము; వచ్చుగాక = కలిగినసరే; జీవ = ప్రాణ; ధనములు = సంపదలు; ఐనన్ = అయినను; చెడుగాక = హానికలగనిమ్ము; పడుగాక = నష్టపోనిమ్ము; మాట = ఇచ్చినమాట; తిరుగలేరు = తప్పలేరు; మానధనులు = అబిమానవంతులు.

భావము:
అతను ఇచ్చిన మాటతప్పని దీక్ష పట్టినవాడు; దానం చేయాలని మిక్కిలి ఆసక్తి కలవాడు; నిర్మలమైన కీర్తి ప్రతిష్ఠలు కలవాడు; చాలా గట్టి మనస్సు కలవాడు; సత్యమే పలుకుతాను అనే నియమం కలవాడు; దానం అడిగే వారికి దగ్గర బంధువు; అటువంటి బలిచక్రవర్తి పలికిన పలుకు విని, అతడు వామనునికి దానమిచ్చే కుతూహలంతో తహతహలాడడం చూసి, అతనిపై శుక్రాచార్యుడు కోపగించుకున్నాడు. “నా ఆజ్ఞ మీరావు కాబట్టి త్వరలో పదవీభ్రష్టుడవు అవుతావు. ” అని శాపము ఇచ్చాడు. గురువుగారి శాపానికి గురైనా కూడా బలిచక్రవర్తి బాధపడలేదు. అతడు అసత్యమార్గం అవలంబించ లేదు. అప్పుడు..... బాగా బ్రతికినా; పెక్కుకష్టాలకు గురి అయినా; పేదరికం వచ్చినా; ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా; కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=77&Padyam=598

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

వామన వైభవం - 75:



8-595-క.
మేరువు దల క్రిం దైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్.
8-596-మత్త.
ఎన్నడుం బరువేఁడఁ బోఁడట; యేకలుం డఁట; కన్న వా
రన్నదమ్ములు నైన లేరఁట; యన్నివిద్యల మూల గో
ష్ఠిన్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్ని పాపనిఁ ద్రోసిపుచ్చఁగ జిత్త మొల్లదు సత్తమా! "

టీకా:
మేరువు = మేరుపర్వతము; తలక్రింద = తలకిందులు; ఐనన్ = అయిపోయినసరే; పారావారంబులు = సముద్రములు; ఇంకబాఱినన్ = ఇంకిపోయినసరే; లోలోన్ = లోపలలోపలే; ధారుణి = భూమండలము; రజము = పొడి; ఐపోయినన్ = అయిపోయినసరే; తారాధ్వము = ఆకాశము {తారాధ్వము - తార (నక్షత్రపు) అధ్వము (దారి), ఆకాశము}; బద్ధమైనన్ = బద్దలైపోయినసరే; తప్పక = తప్పకుండ; ఇత్తున్ = ఇచ్చెదను.
         ఎన్నడున్ = ఎప్పుడు; పరున్ = ఇతరులను; వేడన్ = అడుగుటకు; పోడు = వెళ్ళడు; అటన్ = అట; ఏకలుండు = ఒంటరి, అసహాయుడు; అట = అట; కన్నవారు = తల్లిదండ్రులు; అన్నదమ్ములు = సోదరులు; ఐనన్ = అయినను; లేరు = లేరు; అటన్ = అట; అన్ని = సర్వ; విద్యలన్ = విద్యలయొక్క; మూలగోష్ఠి = ముఖ్యసారాంశమును; ఎఱింగిన = తెలిసిన; ప్రోడగుజ్జు = బహునేర్పరి; అటన్ = అట; చేతులు = చేతులు; ఒగ్గి = చాచి; వసింపన్ = ఉండగా; ఈ = ఈ; చిన్నిపాపనిన్ = పసివానిని; త్రోసిపుచ్చగన్ = గెంటివేయుటకు; చిత్తము = మనసు; ఒల్లదు = ఒప్పుటలేదు; సత్తమా = సమర్థుడా.

భావము:
మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు, సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడిపొడి అయితే కావచ్చు, ఆకాశం బద్దలు అయితే కావచ్చు. కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను. మహానుభావా! ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగటం అన్నది లేదుట. ఒంటరి యట. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు లేరుట. అన్ని విద్యల మూల సారం తెలిసిన నేర్పరి యట. నా ముండదు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయటానికి నాకు మన సొప్పటం లేదు."

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=77&Padyam=595

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday 3 January 2017

వామన వైభవం - 74:

8-593-మ.
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?
8-594-ఆ.
నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో
నేల కట్టు విష్ణుఁ డేటి మాట?
గట్టెనేనిఁ దాన కరుణించి విడుచును
విడువకుండ నిమ్ము విమలచరిత! "

టీకా:
నిరయంబు = నరకము దాపురించినది; ఐనన్ = అయినసరే; నిబంధము = కట్టివేయబడుట; ఐనన్ = జరిగినసరే; ధరణీ = రాజ్యము; నిర్మూలనంబు = నాశనము; ఐనన్ = అయినాసరే; దుర్మరణంబు = దుర్మరణము; ఐనన్ = సంబవించినసరే; కుల = వంశము; అంతము = నాశనము; ఐనన్ = జరిగినసరే; నిజమున్ = సత్యమునే; రానిమ్ము = ఒప్పుకొనెదను; కానిమ్ము = జరిగెడిదిజరగనమ్ము; పో = భయంలేదు; హరుడు = శివుడు; ఐనన్ = అయినా; హరి = విష్ణువు; ఐనన్ = అయినా; నీరజభవుండు = బ్రహ్మదేవుడయినా; అభ్యాగతుండు = అతిథిగావచ్చినవాడు; ఐనన్ = అయిన; ఔ = సరే; తిరుగన్ = వెనుతిరుగుట; నేరదు = చేయలేదు; నాదు = నా యొక్క; జిహ్వ = నాలుక; వినుమా = వినుము; ధీవర్య = విజ్ఞాని; వేయేటికిన్ = పలుమాటలుదేనికి. నొడివినంతపట్టున్ = అన్నమాటప్రకారము; నుసలక = ఆలస్యములేక; ఇచ్చుచోన్ = ఇచ్చిన ఎడల; ఏల = ఎందుకు; కట్టు = బంధించును; విష్ణుడు = విష్ణుమూర్తి; ఏటిమాట = అదేమిమాట; కట్టెనేని = బంధిచినను; తాన = అతను; కరుణించి = దయచేసి; విడుచును = వదలిపెట్టును; విడువక = వదలిపెట్టక; ఉండనిమ్ము = పోతేపోనియ్యి; విమల = నిర్మలమైన; చరిత = వర్తన కలవాడా.

భావము:
మిగతావి అన్నీ అనవసరమయ్య! నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకం దాపురించటం కాని, నా కులమే నాశనం కావటం కాని, భూమండలం బద్దలవటం కాని, నిజంగానే వస్తే రానియ్యి; జరుగుతే జరగనీ; ఏమైనా సరే నేను మాత్రం అబద్దమాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు. పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య! నా నిర్ణయం వినవయ్య! నిర్మల ప్రవర్తన గల శుక్రాచార్యా! అదేం మాట, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు. ఒకవేళ బంధించాడే అనుకో అతడే దయతో విడిచి పెడతాడు. విడిచి పెట్టకపోతే పోనీ ఇబ్బందేం ఉంది?. ”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=594

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 2 January 2017

వామన వైభవం - 73:

8-591-క.
ఉడుగని క్రతువులఁ వ్రతములఁ
బొడగనఁ జన నట్టి పొడవు పొడవునఁ గుఱుచై
యడిగెడినఁట; ననుబోఁటికి
నిడరాదె మహానుభావ! యిష్టార్థంబుల్.
8-592-శా.
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

టీకా:
ఉడుగని = ఎడతెగని; క్రతువులన్ = యాగములతో; వ్రతములన్ = వ్రతములతో; పొడగనన్ = దర్శించుటకు; చననట్టి = వీలుకానట్టి; పొడవు = గొప్పవాడు; పొడవున = ఔన్నత్యముతో, కొలతలో; కుఱుచ = తక్కువ, పొట్టి; ఐ = అయ్యి; అడిగెడిన్ = అడుగుతున్నాడు; అట = అట; నను = నా; పోటి = వంటివాని; కిన్ = కి; ఇడన్ = దానమిచ్చుట; రాదె = చేయకూడదా ఏమి; మహానుభావ = గొప్పవాడా; ఇష్ట = కోరిన; అర్థంబుల్ = సంపదలను. ఆదిన్ = ముందుగా; శ్రీసతి = లక్ష్మీదేవి; కొప్పు = జుట్టుముడి; పైనన్ = మీద; అంసోత్తరీయంబు = పైట; పైన్ = మీద; పాద = పాదములుయనెడి; అబ్జంబుల = పద్మముల; పైన్ = మీద; కపోలతటి = చెక్కిళ్ళ; పైన్ = మీద; పాలిండ్ల = స్తనముల; పైన్ = మీద; నూత్న = సరకొత్త; మర్యాదన్ = గౌరవమును; చెందు = పొందెడి; కరంబు = చేయి; క్రింద = కింద ఉన్నది; అగుట = అగుట; మీద = పైన ఉన్నది; ఐ = అయ్యి; నా = నా యొక్క; కరంబున్ = చేయి; ఉంటన్ = ఉండుట; మేల్ = గొప్ప; కాదే = కాదా ఏమిటి; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; సతతమే = శాశ్వతమా కాదు; కాయంబు = దేహము; నాపాయమే = చెడిపోనిదా కాదు.

భావము:
ఓ మహత్మా! శుక్రాచార్యా! ఎడతెగని యజ్ఞ యాగాలు, వ్రతాలూ చేసినా, పుణ్యకార్యాలు చేసినా విష్ణువును దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్ప వాడు కురచ అయి అడుగుతున్నాడు. అతడు కోరినదానిని ఇవ్వడం కంటే నావంటి వాడికి ఇంకేం కావాలి. ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=592

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...