Tuesday 22 May 2018

శ్రీకృష్ణ లీలలు - 16

10.1-316-క.
చేబంతి దప్పి పడెనని 
ప్రాబల్యముతోడ వచ్చి భవనము వెనుకన్
మా బిడ్డ జలక మాడఁగ
నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే?
10.1-317-క.
ఇచ్చెలువఁ జూచి "మ్రుచ్చిలి
యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద; నాతో
వచ్చెదవా?" యని యనినాఁ
డిచ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే?


భావము:
ఓ యింతి! తన చేతి ఆట బంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేసాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు, ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా! ఈ చక్కటామెను “దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా” అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లీ! ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...