Tuesday 7 December 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౭(417)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-889-చ.
మిణుఁగుఱు లెల్లెడం జెదర; మింటను మంటలు పర్వ; ఘంటికా
ఘణఘణ భూరినిస్వన నికాయమునన్ హరిదంతరాళముల్‌
వణఁక; మహోగ్రశక్తిఁ గొని వారక దారుకుమీఁద వైవ దా
రుణగతి నింగినుండి నిజరోచులతోఁ బడు చుక్కకైవడిన్.
10.2-890-క.
వడిఁ జనుదేరఁగఁ గని య
ప్పుడు నగధరుఁ డలతి లీలఁ బోలెన్ దానిం
బొడిపొడియై ధరఁ దొరఁగఁగఁ
నడుమన వెసఁ ద్రుంచె నొక్క నారాచమునన్. 

భావము:
నిప్పురవ్వలు అంతటా చెదరిపడేలా; అకాశం అంతా మంటలు వ్యాపించేలా; గంటలశబ్దంతో దిగ్గజాలు వణికేలా; సాల్వుడు భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని కృష్ణుడి రథసారథి అయిన దారుకుడి మీద ప్రయోగించాడు. అది ఆకాశం నుండి రాలిపడే కాంతిమంతమైన నక్షత్రంలా దూసుకు వస్తోంది అలా నింగినుండి దూసుకు వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడు ఒక్క బాణంతో మార్గం మధ్యలోనే పొడిపొడి చేసి నేలరాల్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=890 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...