Sunday 23 January 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౮(458)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-980-మ.
కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డప్పేద వి
ప్రుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్
ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయుం గుచే
లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్.
10.2-981-క.
కర మర్థి నెదురుగాఁ జని
పరిరంభణ మాచరించి, బంధుస్నేహ
స్ఫురణం దోడ్తెచ్చి, సమా
దరమునఁ గూర్పుండఁ బెట్టెఁ దన తల్పమునన్. 

భావము:
కుచేలుడు కృష్ణుడి దగ్గరకు వెళ్తుండగా. నిరంతర దారిద్ర్య పీడితుడూ; కృశించిన అంగములు కలవాడూ; చినిగిన వస్త్రములు ధరించినవాడూ; ఆశాపూరిత చిత్తుడూ; హాస్యానికి చిరునామా ఐన వాడు; అయిన కుచేలుడు వస్తుంటే అల్లంత దూరంలో చూసిన పద్మాల రేకుల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు. ఆదరాభిమానాలతో కుచేలుని కెదురుగా వెళ్ళి శ్రీకృష్ణుడు అతనిని కౌగలించుకున్నాడు. స్నేహ పూర్వక అనురాగం ఉట్టిపడేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తోడ్కొనివచ్చి తన పాన్పు మీద కూర్చుండ బెట్టాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=981 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...