ఆషాఢ శుద్ధ విదియ మొదలు శుద్ధ ఏకాదశి వరకు బలభద్ర, సుభధ్ర, జగన్నాథుల రథయాత్ర ఉత్సవాలు ఒడిషా రాష్ట్రంలోని పూరీలో కన్నుల పండుగగా జరుగుతాయి. పూరీలో వెలసిన శ్రీకృష్ణమూర్తే జగన్నాథుడు. సువిశాలమైన ప్రాంగణములో కళింగ దేవాలయ శైలిలో కట్టబడిన మనోహరమైన మందిరములో జగన్నాథుడు, బలరామ, సుభధ్రా సమేతుడై శోభిల్లుతున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద రథయాత్రగా పేరుపొందిన ఈ రథయాత్ర భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు తలమానికం.
దుఃఖభంజనకు, పాపహరణకు నారాయణుడు ప్రతి ఏటా రథారూఢుడై పురీ నగరవీథుల గుండా ఊరేగుతూ గుండిచా ఉద్యానవనమందిమైన ‘గుండిచా ఆలయానికి’ చేరుకుంటాడు. అక్కడ తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనమిస్తూ వారి పాపాలను పటాపంచలు చేస్తుంటాడు. ఈ యాత్రనే గుండిచా యాత్రగా అని కూడా అంటారు.
రథయాత్రలో ముగ్గురి దేవతలకూ మూడు విడి రథాలు ఉంటాయి. పీతాంబరధరుడైన జగన్నాథుడు ఎరుపుపై పసుపు రంగుతో శోభితమైన రథముపై ఊరేగుతాడు.ఈ రథాన్నే ” నందిఘోష ” అని అంటారు.
అగ్రజుడైన బలభద్రుడు ఎరుపుపై నీలం రంగుతో మెరిసే రథముపై ఊరేగుతాడు. ఈ రథాన్నే ” తాళధ్వజ ” అని అంటారు. సుభద్రా దేవిని ఎరుపుపై నలుపు వర్ణంతో భాసిల్లే రథముపై ఊరేగేస్తారు. ఈ రథాన్నే ” ద్వర్పదళన లేదా పద్మదళన ” అని అంటారు. జగన్నాథుని రథం నలభై ఐదు అడుగులు, బలభద్రుని రథం నలభై నాలుగు అడుగులు, సుభధ్ర రథం నలభై మూడు అడుగుల పొడుగు ఉంటాయి. నందిఘోషకు 16 చక్రాలు, తాళధ్వజకు 14 చక్రాలు, ద్వర్పదళనకు 12 చక్రాలుంటాయి.
ప్రతి సంవత్సరము పాత రథాలను భిన్నంచేసి, కొత్తగా రథాలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒడిషా వాసులకు అత్యంత శుభకరమైన రోజుగా భావించే అక్షయ తృతీయనాడు కొత్త రథాల తయారు మొదలు పెడతారు. పురీ మహారాజు ఇంటి ముంగిట మొదలవుతుంది తయారి ప్రక్రియ. ఇదే రోజు 3 వారాలపాటు జరిగే చందన యాత్ర కూడా మొదలవుతుంది. రథాలకు వాడే చెక్కలను దసపల్లా నుండి దుంగల్లా తయారు చేసి మహానది నదిలోని నీటిలో పురీకి తీసుకువస్తారు.
తరతరాలుగా వంశ పారంపర్యంగా ఈ రథాలను తయారుచేసే వడ్రంగుల వంశానికి చెందినవారే ఈ రథాలను తయారు చేస్తారు. ప్రతిరథము చుట్టూ 9 మంది పార్శ్వదేవతల మూర్తులు ఉంటాయి. బలభద్రుని రథానికి తెల్లని గుర్రాలు, జగన్నాథుని రథానికి నల్లని గుర్రాలు, సుభద్ర రథానికి ఎర్రని గుర్రాలు నాలుగు చొప్పున ఉంటాయి. రథాలకు చోదకులుగా మాతలి, దారుక, అర్జునులు ఉంటారు......
No comments:
Post a Comment