Friday 14 December 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 72

10.1-565-క.
జలచర మృగ భూసుర నర
కులముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపన్
జెలిమిని సుజనుల మనుపను
దలపోయఁగ రాదు నీ విధంబు లనంతా!
10.1-566-ఆ.
మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన
యో! పరాత్మభూమ! యోగిరాజ! 
యే తెఱంగు లెన్ని యెంత యెచ్చోట నీ
హేల లెవ్వఁ డెఱుఁగు నీశ్వరేశ!

భావము:
ఓ అనంత కృష్ణా! నీవలనే నీ మార్గాలు కూడా అంతం లేనివి. నీవు దుర్మార్గులను శిక్షించడానికీ, సజ్జనులను ప్రేమతో రక్షించడానికీ జలచరములుగా, మృగములుగా, బ్రాహ్మణులుగా, సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు ఈవిధంగా ఉంటాయని ఊహించడం అసాధ్యం కదా. ఓ పరమాత్మా! మహాయోగీశ్వరేశ్వరా! శ్రీకృష్ణా! నీ కన్న ఇతరులుగా జీవిస్తున్న జీవులందరూ “ఎవరికివారు “నేను” అని మిగిలినవారిని “వారు” అని అనుకుంటున్నారు. వారందరిలో ఉన్న “నేను” నివాసంగా “నీవు” ఉన్నావు. దానిని దర్శించడానికి సాధన చేసేవారే యోగులు. వారి యోగంగా వారిలో వెలుగుతూ ఉన్నదీ నీవే మిగిలినవారు ఈ నీ యందు మరుపు కలిగి ఉంటారు. “తాము ఉన్నామనే తెలివి” మైకంగా కప్పుతుంది. ఈ మైకాన్నికలిగించి నీవు లోపల ఉంటే వారికి నీవు నిద్రిస్తున్నట్లు ఉంటావు. అలాంటి యోగనిద్రలో ఉన్న నీ లీలలు ఎవరికి తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తాయి? ఎక్కడ తెలుస్తాయి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=566

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...