Friday, 13 September 2019

కపిల దేవహూతి సంవాదం - 115


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1034-వ.
అదియునుం గాక.
3-1035-క.
ధీమహిత! భవన్మంగళ
నామస్మరణానుకీర్తనము గల హీనుల్
శ్రీమంతు లగుదు రగ్ని
ష్టోమాదికృదాళికంటె శుద్ధులు దలఁపన్.
3-1036-వ.
అదియునుం గాక.

భావము:
అంతే కాకుండా ఓ జ్ఞానస్వరూపా! మంగళకరమైన నీ నామాన్ని స్మరించినా, కీర్తించినా దరిద్రులు శ్రీమంతులౌతారు. అటువంటివారు అగ్నిష్ఠోమం మొదలైన యజ్ఞాలు చేసినవారికంటె పరిశుద్ధు లవుతారు. అంతే కాకుండా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1035

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Thursday, 12 September 2019

కపిల దేవహూతి సంవాదం - 114


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1033-సీ.
వరుస విగ్రహపారవశ్యంబునను జేసి; 
రఘురామ కృష్ణ వరాహ నార
సింహాది మూర్తు లంచితలీల ధరియించి; 
దుష్టనిగ్రహమును శిష్టపాల
నమును గావించుచు నయమున సద్ధర్మ; 
నిరతచిత్తులకు వర్ణింపఁ దగిన
చతురాత్మతత్త్వ విజ్ఞానప్రదుండవై; 
వర్తింతు వనఘ! భవన్మహత్త్వ
3-1033.1-తే.
మజున కయినను వాక్రువ్వ నలవిగాదు
నిగమజాతంబు లయిన వర్ణింప లేవ
యెఱిఁగి సంస్తుతి చేయ నే నెంతదాన
వినుత గుణశీల! మాటలు వేయునేల?

భావము:
అవతారాలమీద ముచ్చటపడి వరుసగా రఘురాముడుగా, కృష్ణుడుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారాలు ధరించి దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మంపట్ల ప్రవృత్తమైన చిత్తం కల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించటం కోసం వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు, అనంత కళ్యాణగుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వాన్ని అభివర్ణించడం చతుర్ముఖునకు, చతుర్వేదాలకు కూడా సాధ్యం కాదంటే నేనెంతదాన్ని? వెయ్యి మాటలెందుకు? నిన్ను తెలుసుకొని సన్నుతించటం నాకు శక్యం కాని పని.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1033

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 113


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1029-వ.
అంత.
3-1030-తే.
అతుల భూరి యుగాంతంబు నందుఁ గపట
శిశువవై యొంటి కుక్షినిక్షిప్త నిఖిల
భువననిలయుండవై మహాంభోధి నడుమ
జారు వటపత్రతల్పసంస్థాయి వగుచు.
3-1031-తే.
లీల నాత్మీయ పాదాంగుళీ వినిర్గ
తామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు
గడఁగి నా పూర్వభాగ్యంబు కతన నిపుడు
పూని నా గర్భమున నేడు పుట్టితయ్య!
3-1032-వ.
అట్టి పరమాత్ముండ వయిన నీవు.

భావము:
అప్పుడు మహాప్రళయ సమయంలో సమస్త భువన సముదాయాన్ని నీ ఉదరంలో పదిలంగా దాచుకొని మహాసాగర మధ్యంలో మఱ్ఱి ఆకు పాన్పుమీద మాయాశిశువుగా ఒంటరిగా శయనించి ఉంటావు. మహానుభావా! ఆ విధంగా వటపత్రశాయివైన నీవు లీలగా నీ కాలి బొటనవ్రేలిని నోటిలో నుంచుకొని అందలి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. అటువంటి నీవు నా పూర్వపుణ్య విశేషంవల్ల ఇప్పుడు నా కడుపున పుట్టావు అటువంటి పరమాత్మ స్వరూపుడవైన నీవు..

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1031

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Wednesday, 11 September 2019

కపిల దేవహూతి సంవాదం - 112


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1028-సీ.
"అనయంబు విను, మింద్రియార్థ మనోమయం; 
బును భూతచయ మయంబును నశేష
భూరి జగద్బీజభూతంబును గుణప్ర; 
వాహ కారణమును వలనుమెఱయు
నారాయణాభిఖ్యనాఁ గల భవదీయ; 
దివ్యమంగళమూర్తిఁ దేజరిల్లు
చారు భవద్గర్భసంజాతుఁ డగునట్టి; 
కమలగర్భుండు సాక్షాత్కరింప
3-1028.1-తే.
లేక మనమునఁ గనియె ననేక శక్తి
వర్గములు గల్గి సుగుణప్రవాహరూప
మంది విశ్వంబు దాల్చి సహస్రశక్తి
కలితుఁడై సర్వకార్యముల్ కలుగఁజేయు.

భావము:
ఇంద్రియాలతో, ఇంద్రియార్థాలతో, మనస్సుతో, పంచభూతాలతో నిండి సమస్త జగత్తుకు బీజభూతమై సత్త్వరజస్తమోగుణ ప్రవాహానికి మూలకారణమై నారాయణుడనే నామంతో నీ దివ్యమంగళ విగ్రహం తేజరిల్లుతూ ఉంటుంది. అటువంటి నీ కళ్యాణమూర్తిని నీ నాభికమలం నుండి జన్మించిన చతుర్ముఖుడే సాక్షాత్తుగా దర్శించలేక ఎలాగో తన మనస్సులో కనుగొన గలిగాడు. అలా చూచి నీ అనుగ్రహంవల్ల అనేక శక్తులను తనలో వ్యక్తీకరించుకొని వేలకొలది శక్తులతో కూడినవాడై ప్రవాహరూపమైన ఈ విశ్వాన్ని సృజింప గల్గుతున్నాడు. సృష్టి సంబంధమైన సర్వకార్యాలను నిర్వహింప గలుగుతున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1028

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 111


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1027-వ.
అదిగావున, నీకుం జతుర్విధ భక్తియోగప్రకారంబుఁ దేటపడఁ నెఱింగించితి; అదియునుం గాక, కామరూప యగు మదీయ గతి జంతువుల యందు నుత్పత్తి వినాశ రూపంబుల నుండు నవిద్యా కర్మ నిర్మితంబు లైన జీవునిగతు లనేక ప్రకారంబులై యుండు; అదియు జీవాత్మ వాని యందుం బ్రవర్తించి యాత్మగతి యిట్టిదని యెఱుంగక యుండు" నని చెప్పి, మఱియు నిట్లనియె "ఇట్టి యతి రహస్యం బగు సాంఖ్యయోగ ప్రకారంబు ఖలునకు నవినీతునకు జడునకు దురాచారునకు డాంబికునకు నింద్రియలోలునకుఁ బుత్ర దారాగారాద్యత్యంతాసక్త చిత్తునకు భగవద్భక్తిహీనునకు విష్ణుదాసుల యందు ద్వేషపడు వానికి నుపదేశింప వలవదు; శ్రద్ధాసంపన్నుండును, భక్తుండును, వినీతుండును, నసూయారహితుండును, సర్వభూత మిత్రుండును, శుశ్రూషాభిరతుండును, బాహ్యార్థజాత విరక్తుండును, శాంతచిత్తుండును, నిర్మత్సరుండును, శుద్ధాత్ముండును, మద్భక్తుండును, నగు నధికారికి నుపదేశింప నర్హంబగు; ఈ యుపాఖ్యానం బే పురుషుండేనిఁ బతివ్రత యగు నుత్తమాంగన యేని శ్రద్ధాభక్తులు గలిగి మదర్పితచిత్తంబునన్ వినుఁ బఠియించు నట్టి పుణ్యాత్ములు మదీయ దివ్యస్వరూపంబుఁ బ్రాపింతు" రని చెప్పెను" అని మైత్రేయుండు విదురునకు వెండియు నిట్లనియె "ఈ ప్రకారంబునం గర్దమదయిత యైన దేవహూతి గపిలుని వచనంబులు విని నిర్ముక్తమోహ పటల యగుచు సాష్టాంగ దండప్రణామంబు లాచరించి తత్త్వవిషయాంకిత సాంఖ్యజ్ఞానప్రవర్తకం బగు స్తోత్రంబుసేయ నుపక్రమించి కపిలున కిట్లనియె.

భావము:
అందువల్ల నీకు నాలుగు విధాలైన భక్తి మార్గాలను విశదంగా తెలియజెప్పాను. అంతేకాక స్వేచ్ఛారూపమైన నా సంకల్పం ప్రాణులందు జనన మరణ రూపాలతో ఉంటుంది. అజ్ఞానంతో ఆచరించే కర్మల మూలంగా కలిగే జీవుని ప్రవర్తనలు అనేక విధాలుగా ఉంటాయి. జీవాత్మ అటువంటి అకర్మలు ఆచరిస్తూ అత్మస్వరూపం ఇటువంటిది అని తెలియని స్థితిలో ఉంటాడు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “ఇటువంటి అతిరహస్యమైన సాంఖ్యయోగ పద్ధతి దుష్టునకు, నీతి హీనునకు, మూర్ఖునకు, దురాచారునకు, డంబాలు కొట్టేవానికి, ఇంద్రియ సుఖాలకు లోబడిన వానికి, పిల్లలూ ఇల్లాలూ ఇల్లూ మొదలైన వానిపై ఆసక్తి కలవానికి, భగవంతునిపై భక్తి లేనివానికి, విష్ణు భక్తులను ద్వేషించే వానికి ఉపదేశింపకూడదు. శ్రద్ధాసక్తుడు, భక్తుడు, వినయసంపన్నుడు, ద్వేషరహితుడు, సర్వప్రాణులను మైత్రీభావంతో చూచేవాడు, విజ్ఞాన విషయాలను వినాలనే అసక్తి కలవాడు, ప్రాపంచిక విషయాలపై విరక్తుడు, శాంతచిత్తుడు, మాత్సర్యం లేనివాడు, స్వచ్ఛమైన మనస్సు కలవాడు, భక్తులందు ప్రేమ కలవాడు, పరస్త్రీలను మంచి భావంతో చూచేవాడు, చెడు కోరికలు లేనివాడు అయిన వానికి మాత్రమే ఈ సాంఖ్యయోగం ఉపదేశింప తగినది. అటువంటివాడే ఇందుకు అర్హుడైన అధికారి. ఈ ఉపాఖ్యానాన్ని ఏ పురుషుడైనా, పతివ్రత అయిన ఏ స్త్రీ అయినా శ్రద్ధాభక్తులతో నాపై మనస్సు నిలిపి వినినా, చదివినా అటువంటి పుణ్యాత్ములు నా దివ్య స్వరూపాన్ని పొందుతారు” అని కపిలుడు దేవహూతితో చెప్పాడని చెప్పి మైత్రేయుడు విదురుణ్ణి చూచి ఇంకా ఇలా అన్నాడు. “ఈ విధంగా కర్దమమహర్షి అర్ధాంగి అయిన దేవహూతి కపిలుని ఉపదేశం విని, మోహం తొలగిపోగా అతనికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, పరబ్రహ్మకు సంబంధించిన తాత్త్వికమైన సాంఖ్య జ్ఞానంతో కపిలుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించి ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1027

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Sunday, 8 September 2019

కపిల దేవహూతి సంవాదం - 110


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1026-సీ.
అంబ! నారాయణుం డఖిలశాస్త్రములను; 
సమధికానుష్ఠిత సవన తీర్థ
దర్శన జప తపోధ్యయన యోగక్రియా; 
దానకర్మంబులఁ గానఁబడక
యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి; 
సకల కర్మత్యాగసరణి నొప్పి
తలకొని యాత్మతత్త్వజ్ఞానమున మించి; 
యుడుగక వైరాగ్యయుక్తిఁ దనరి
3-1026.1-తే.
మహిత ఫలసంగరహిత ధర్మమునఁ దనరు
నట్టి పురుషుండు దలపోయ నఖిల హేయ
గుణములనుఁ బాసి కల్యాణగుణ విశిష్టుఁ
డైన హరి నొందుఁ బరమాత్ము ననఘుఁ డగుచు

భావము:
అమ్మా! నారాయణుడు సమస్త శాస్త్రాలను చదివినందువల్లను, అనుష్ఠానాలూ యజ్ఞాలూ తీర్థయాత్రలూ జపతపాలూ ఆచరించినందువల్లనూ కనిపించడు. వేదాలు అధ్యయనం చేయడం వల్లనూ, యోగాభ్యాసాల వల్లనూ, దానాలూ వ్రతాలూ చేసినందువల్లనూ గోచరింపడు. చంచలమైన మనస్సును లోగొని చెలరేగిన ఇంద్రియాలను జయించి, కర్మ లన్నింటినీ భగవదర్పితం చేసి, ఆత్మస్వరూపాన్ని గుర్తించి, తరిగిపోని వైరాగ్యంతో ఫలితాలను అపేక్షించకుండా ప్రవర్తించే పురుషుడు మాత్రమే దుర్గుణాలను దూరం చేసుకొని పాపాలను పటాపంచలు గావించి అనంత కళ్యాణ గుణ విశిష్టుడు పరమాత్మ అయిన ఆ హరిని చేరగలుగుతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1026

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 109


( చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1025-వ.
అనిచెప్పి; వెండియు నిట్లనియె "భగవంతుం డగు వాసుదేవుని యందు బ్రయుక్తం బగు భక్తియోగంబు బ్రహ్మసాక్షాత్కార సాధనంబు లగు వైరాగ్య జ్ఞానంబులం జేయు; అట్టి భగవద్భక్తి యుక్తం బైన చిత్తం బింద్రియవృత్తులచే సమంబు లగు నర్థంబు లందు వైషమ్యంబును బ్రియాప్రియంబులును లేక నిస్సంగంబు సమదర్శనంబు హేయోపాదేయ విరహితంబునై యారూఢంబైన యాత్మపదంబు నాత్మచేఁ జూచుచుండు జ్ఞానపురుషుండును బరబ్రహ్మంబును బరమాత్ముండును నీశ్వరుండును నగు పరమపురుషుం డేకరూపంబు గలిగి యుండియు దృశ్యద్రష్టృ కరణంబులచేతం బృథగ్భావంబు బొందుచుండు; ఇదియ యోగికి సమగ్రం బగు యోగంబునం జేసి ప్రాప్యంబగు ఫలంబు; కావున విషయ విముఖంబు లగు నింద్రియంబులచేత జ్ఞానరూపంబును హేయగుణ రహితంబును నగు బ్రహ్మంబు మనోవిభ్రాంతిం జేసి శబ్దాది ధర్మం బగు నర్థరూపంబునం దోఁచు; అది యెట్టు లర్థాకారంబునం దోఁచు నని యడిగితివేని నహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును భూతరూపంబునం బంచవిధంబును నింద్రియరూపంబున నేకాదశవిధంబును నై యుండు; జీవరూపుం డగు విరాట్పురుషుండు జీవవిగ్రహం బైన యండం బగు జగంబునం దోఁచుచుండు; దీని శ్రద్ధాయుక్తం బయిన భక్తిచేత యోగాభ్యాసంబునం జేసి సమాహితమనస్కుం డై నిస్సంగత్వంబున విరక్తుం డైనవాడు పొడగనుచుండు; అది యంతయు బుధజనపూజనీయ చరిత్రవు గావున నీకుం జెప్పితి; సర్వ యోగ సంప్రాప్యుం డగు నిర్గుణుండు భగవంతుం డని చెప్పిన జ్ఞానయోగంబును మదీయభక్తి యోగంబును నను రెండు నొకటియ యింద్రియంబులు భిన్నరూపంబులు గావున నేకరూపం బయిన యర్థం బనేక విధంబు లగు నట్లేకం బగు బ్రహ్మం బనేక విధంబులుగఁ దోఁచు; మఱియును.

భావము:
అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. “పరమేశ్వరుడైన వాసుదేవుని యందు అభివ్యక్తమైన భక్తియోగం బ్రహ్మసాక్షాత్కారానికి సాధనాలైన జ్ఞానాన్నీ వైరాగ్యాన్నీ కలుగజేస్తుంది. అటువంటి భగవద్భక్తితో కూడిన చిత్తం ఇంద్రియ వ్యాపారాలలో సమంగా వర్తిస్తుంది. అటువంటి మనస్సు కలవానికి హెచ్చుతగ్గులు, ప్రియాప్రియములు, విషయ లాలస, గ్రహింప దగినవీ, తిరస్కరింప దగినవీ ఉండవు. సర్వత్ర సమదర్శన మేర్పడుతుంది. తనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తాను చూడగలుగుతాడు. జ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మ, పరమాత్ముడు, ఈశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఒకే రూపం కలవాడై ఉండికూడా కనబడే రూపాన్ని బట్టీ, చూచేవారినిబట్టీ, చూడటానికి ఉపయోగపడే సాధనాలనుబట్టీ వేరువేరు రూపాలలో గోచరిస్తాడు. ఇదే యోగి అయినవాడు సంపూర్ణ యోగంవల్ల పొందదగిన ఫలం. కావున విషయాలనుండి వెనుకకు మరలిన ఇంద్రియాలవల్ల జ్ఞాన స్వరూపమూ, హేయగుణ రహితమూ అయిన పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. ఆ పరబ్రహ్మమే మనస్సు యొక్క భ్రాంతి వలన శబ్దం స్పర్శం మొదలైన వాని ధర్మాలైన అర్థాల స్వరూపంతో గోచరిస్తున్నది. ఆ పరబ్రహ్మం అర్థస్వరూపంతో ఎట్లా కనిపిస్తుందని నీకు సందేహం కలుగవచ్చు. అహంకారం గుణరూపం ధరించి సత్త్వరజస్తమస్సులై మూడు విధాలుగానూ, భూతరూపం ధరించి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలనే అయిదు విధాలుగానూ, ఇంద్రియరూపం ధరించి పదకొండు విధాలుగానూ ఉంటుంది. ఈ విధంగా అహంకారమే నానావిధాలుగా భాసిస్తుంది. విరాట్పురుషుడు జీవస్వరూపుడు. జీవరూపమైన ఈ జగత్తు అనే గ్రుడ్డులో అతడు నిండి ఉంటాడు. ఈ పరమ రహస్యాన్ని శ్రద్ధా సహితమైన భక్తితోనూ, యోగాభ్యాసంతోనూ, నిశ్చల చిత్తం కలవాడై వైరాగ్యం పొందినవాడు దర్శిస్తాడు. అమ్మా! నీవు జ్ఞాన సంపన్నులైన పెద్దలు పూజింపదగిన చరిత్ర గలదానవు. కాబట్టి నీకు ఈ విషయమంతా వెల్లడించాను. సమస్త యోగసాధనలవల్ల పొందదగిన పరబ్రహ్మను నిర్గుణుడని జ్ఞానయోగులు పలుకుతున్నారు. నేను చెప్పిన భక్తియోగం ఆ పరమాత్మను సగుణుడుగా పేర్కొంటున్నది. వాస్తవానికి జ్ఞానయోగం భక్తియోగం రెండూ ఒక్కటే. ఇంద్రియాలు వేరువేరు రూపాలతో ఉంటాయి. అందువల్లనే ఒకే రూపంలో ఉండే వస్తువు అనేక విధాలుగా తోచినట్లు, ఒకే పరమాత్మ అనేక విధాలుగా గోచరిస్తున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1025

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

కపిల దేవహూతి సంవాదం - 115

( చంద్ర సూర్య పితృ మార్గంబు ) 3-1034-వ. అదియునుం గాక. 3-1035-క. ధీమహిత! భవన్మంగళ నామస్మరణానుకీర్తనము గల హీనుల్ శ్రీమంతు లగుదు రగ్ని ...