Sunday 3 July 2016

జగన్నాథ వైభవం - 3:

శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన ప్రసిద్ధ జగన్నాథాష్టకాన్ని చదివి తరిద్దాం....!!!

కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 1 ॥

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటక్షం విదధత్
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 2 ॥

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 3 ॥

కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 4 ॥

రథారూఢో గచ్ఛన్పథీ మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకలజగతాః సింధుసుతయా
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 5 ॥

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 6 ॥

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవే
న యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరపధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 7 ॥

హరత్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశ
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 8 ॥

ఇతిశ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ జగన్నాథాష్టకం సంపూర్ణం....

జగన్నాథ వైభవం - 4:


ఏ ఆలయంలోనైనా గర్భాలయంలోని మూల విరాట్టు కరచరణాలతో, సర్వాలంకారాలతో, నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కానీ పూరీలోని జగన్నాథుడు మాత్రం కరచరణాలు లేకుండా, కొలువుదీరి దర్శనమిస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు ఓ కథ వుంది.

పూర్వం ద్వాపర యుగంలో భరతఖండాన్ని ఇంద్రద్యుమ్నుడనే మహారాజు పాలించేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు. ఒకసారి నారాయణుడు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించి, తన కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు ఆదేశాన్ని తన సకృతంగా భావించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ఆలయంలో మూల విరాట్టు రూపాలు ఎలా వుండాలనే విషయంలో మాత్రం ఆలోచనలో పడ్డాడు.

ఎందుకంటే కలలో కనిపించిన విష్ణువు రూపాన్ని తాను శిల్పంగా మలచలేడు కాబట్టి. ఎందుకంటే శిల్పులు మహారాజు దర్శించిన రూపాన్ని శిల్పంగా మలచలేరు కదా, ఎందుకంటే వారికి నారాయణుని దర్శనం కలుగకపోవడమే అసలు విషయం. ఈ విషయంలో మహారాజుకు చింత రోజురోజుకీ పెరిగిపోసాగింది. తన భక్తుడు పడుతున్న ఆవేదన సకలలోక రక్షకుడైన నారాయణుడికి అర్థమయ్యి, తానే ఒక శిల్పి రూపమును ధరించి, ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరకు వచ్చాడు.
మహారాజు దగ్గరకు వచ్చన శిల్పి, మహారాజుతో ” అయ్యా! మీకు సంతృప్తి కలిగే విధంగా మూలవిరాట్టు నిర్మాణం చేస్తాను, అయితే విగ్రహ తయారీకి 21 రోజుల సమయం పడుతుంది. అయితే నా పని పూర్తి అయ్యేంత వరకు, ఎవరూ కూడా నా గదిలోకి రాకూడదు. నాకు నేనుగా బయటకు వచ్చేవరకు, నా యొక్క పనికి ఎవరూ కూడా అంతరాయం కలిగించకూడదు” అని నిబంధన విధించాడు. మహారాజు అందుకు సమ్మతించాడు.

ఒక ఏకాంత మందిరంలో నారాయణుడైన మాయాశిల్పి తన పని ప్రారంభించాడు. వారాలు, నెలలు గడుస్తున్నాయి. మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే వున్నాయి. పని జరగుతూనే ఉంది. కానీ మూలవిరాట్టు రూపాన్ని చూడాలనే ఆత్రుత, మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది. కొన్ని రోజుల తరువాత ఆ మందిరం నుంచి శబ్దాలు రావడం మానేశాయి....

జగన్నాథ వైభవం - 1:

ఆషాఢ శుద్ధ విదియ మొదలు శుద్ధ ఏకాదశి వరకు బలభద్ర, సుభధ్ర, జగన్నాథుల రథయాత్ర ఉత్సవాలు ఒడిషా రాష్ట్రంలోని పూరీలో కన్నుల పండుగగా జరుగుతాయి. పూరీలో వెలసిన శ్రీకృష్ణమూర్తే జగన్నాథుడు. సువిశాలమైన ప్రాంగణములో కళింగ దేవాలయ శైలిలో కట్టబడిన మనోహరమైన మందిరములో జగన్నాథుడు, బలరామ, సుభధ్రా సమేతుడై శోభిల్లుతున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద రథయాత్రగా పేరుపొందిన ఈ రథయాత్ర భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు తలమానికం.

దుఃఖభంజనకు, పాపహరణకు నారాయణుడు ప్రతి ఏటా రథారూఢుడై పురీ నగరవీథుల గుండా ఊరేగుతూ గుండిచా ఉద్యానవనమందిమైన ‘గుండిచా ఆలయానికి’ చేరుకుంటాడు. అక్కడ తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనమిస్తూ వారి పాపాలను పటాపంచలు చేస్తుంటాడు. ఈ యాత్రనే గుండిచా యాత్రగా అని కూడా అంటారు.
రథయాత్రలో ముగ్గురి దేవతలకూ మూడు విడి రథాలు ఉంటాయి. పీతాంబరధరుడైన జగన్నాథుడు ఎరుపుపై పసుపు రంగుతో శోభితమైన రథముపై ఊరేగుతాడు.ఈ రథాన్నే ” నందిఘోష ” అని అంటారు.

అగ్రజుడైన బలభద్రుడు ఎరుపుపై నీలం రంగుతో మెరిసే రథముపై ఊరేగుతాడు. ఈ రథాన్నే ” తాళధ్వజ ” అని అంటారు. సుభద్రా దేవిని ఎరుపుపై నలుపు వర్ణంతో భాసిల్లే రథముపై ఊరేగేస్తారు. ఈ రథాన్నే ” ద్వర్పదళన లేదా పద్మదళన ” అని అంటారు. జగన్నాథుని రథం నలభై ఐదు అడుగులు, బలభద్రుని రథం నలభై నాలుగు అడుగులు, సుభధ్ర రథం నలభై మూడు అడుగుల పొడుగు ఉంటాయి. నందిఘోషకు 16 చక్రాలు, తాళధ్వజకు 14 చక్రాలు, ద్వర్పదళనకు 12 చక్రాలుంటాయి.

ప్రతి సంవత్సరము పాత రథాలను భిన్నంచేసి, కొత్తగా రథాలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒడిషా వాసులకు అత్యంత శుభకరమైన రోజుగా భావించే అక్షయ తృతీయనాడు కొత్త రథాల తయారు మొదలు పెడతారు. పురీ మహారాజు ఇంటి ముంగిట మొదలవుతుంది తయారి ప్రక్రియ. ఇదే రోజు 3 వారాలపాటు జరిగే చందన యాత్ర కూడా మొదలవుతుంది. రథాలకు వాడే చెక్కలను దసపల్లా నుండి దుంగల్లా తయారు చేసి మహానది నదిలోని నీటిలో పురీకి తీసుకువస్తారు.
తరతరాలుగా వంశ పారంపర్యంగా ఈ రథాలను తయారుచేసే వడ్రంగుల వంశానికి చెందినవారే ఈ రథాలను తయారు చేస్తారు. ప్రతిరథము చుట్టూ 9 మంది పార్శ్వదేవతల మూర్తులు ఉంటాయి. బలభద్రుని రథానికి తెల్లని గుర్రాలు, జగన్నాథుని రథానికి నల్లని గుర్రాలు, సుభద్ర రథానికి ఎర్రని గుర్రాలు నాలుగు చొప్పున ఉంటాయి. రథాలకు చోదకులుగా మాతలి, దారుక, అర్జునులు ఉంటారు......

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...