Saturday 6 September 2014

వామన జయంతి

ఆ పరమాత్మ వామనావతారం ధరించిన రోజే భాద్ర పద శుద్ధద్వాదశి రోజు.ఈ రోజు శ్రవణానక్షత్రం కలిసివస్తే మరింత మంచిది. భగవంతుడు 'ఇందుగలడందు లేడని...' నిర్ద్వంద్వంగా చాటడమే కాదు తండ్రికి స్వయంగా స్తంభంలో చూపించిన పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి. అతడెంత దయాగుణం, దాతృగుణం కలవాడైనప్పటికీ అహంకార పూరితుడు కాబట్టే అతడిని సంహరించాల్సి వచ్చింది. అందుకోసం పరమాత్మ ధరించిన అవతారమే వామనావతారం. ఇందులోనూ ఒక పరమార్థం ఉంది.

ఆయన తనకు నచ్చిన భక్తులకు ఏదైనా   ఇవ్వాలనుకుంటే ముందుగా భక్తుని సర్వస్వాన్నీ తన స్వంతం చేసుకుంటాడట. బలిచక్రవర్తికి ఆయన ఎన్నో ఇవ్వాలనుకున్నాడు. కాబట్టే బలివద్ద పూచికపుల్ల కూడా లేకుండా దానమడిగి తన కైవశం చేసుకున్నాడు. ఆ తరువాతే ఆయనకు ఎన్నో వరాలిచ్చాడు. బలి ఎన్నో యజ్ఞయాగాలు చేసిన మహాభక్తుడు. అడిగిన వారికి లేదనకుండా దానం చెయ్యగల మహా దాత. బలి నూరో యజ్ఞం చేస్తున్న సందర్భంగా మహా విష్ణువు చిన్నవటుని రూపంలో వచ్చి బలిని మూడడుగుల నేలదానం అడుగుతాడు. రాక్షస గురువైన శుక్రచార్యుడు వచ్చింది శ్రీమహావిష్ణువని, దానం ఈయవద్దని ఎంత వారిస్తున్నా అంతటి మహానుభావుని చేయి కింద, నాచేయి పైన ఉండడం కంటే నాకేం కావాలంటూ ఇచ్చేస్తాడు బలి. అంతే! అంత చిన్న వటుడూ నేలానింగీ అక్రమించి మూడోఅడుగుకోసం స్థలం చూపించమంటాడు. వామనుడలా ఎదుగుతున్నప్పుడు నింగిలోని సూర్య బింబం ఒక్కో దశలో స్వామికి ఒక్కో ఆభరణంగా మారి పోయిందంటూ ఆ రూపాన్ని పోతన్న మహాద్భుతంగా వర్ణిస్తాడు. ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన బలి మూడో అడుగును శిరస్సుపై పెట్టమని స్థలాన్ని చూపిస్తాడు. పరమాత్మ మూడో పాదంతో బలిని సుతల లోకంలోకి అణచివేస్తాడు.

అయినా బలి సత్యసంధతకు మెచ్చి ఆ లోకంలో తానే స్వయంగా బలికి కాపలాగా ఉండడమే కాదు, సావర్ణి మనువు కాలంలో ఇంద్రపదవిని వరంగా ఇచ్చాడు మహావిష్ణువు. అంతటి పవిత్రమైనదీ రోజు. ఈరోజున

శ్లో|| దేవేశ్వరాయ దేవాయ దేవసంభూతి కారిణః |
      ప్రభవే సర్వదేవానాం వామనాయ నమోనమః ||

అంటూ యధాశక్తి వామనుణ్ని పూజించాలి. ఈ ద్వాదశినాడు ఉపవాసుంటే ఏకాదశి ఉపవాస పుణ్యం కూడా కలిసివస్తుందట.

శ్లో|| నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే|
      తుభ్యమర్ఘ్యం ప్రయచ్ఛామి బాలవామన రూపిణ |
      నమశ్శాజ్గ ధనుర్భాణ పాణయే వామనాయ చ|
      యజ్ఞభుక్ ఫలద్రాత్ చవామనాయ నమోనమః|| ''

అంటూ అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఈరోజు బ్రాహ్మణులకు పెరుగు దానం చేస్తే మంచిదంటారు.

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...