Sunday 26 October 2014

నాగుల చవితి

నాగుల చవితి కార్తీకశుద్ద చతుర్థి నాడు అంటే దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం.

మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి  చిమిలి, అరటిపళ్ళు నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.


No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...