Thursday 23 October 2014

నరక చతుర్దశి

హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు.
నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణ్భారణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.

మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇదనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది.

ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశే్చష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.
భూమాత దేవతలందరిలోనికి అత్యంత సహనశీలి. అయితే దేవతలలో అత్యంత ఉన్నతులకు కూడా అప్పుడప్పుడు పరీక్ష తప్పదు. ఆ పరీక్షల ఫలితంగా దుష్టత్వానికి, శిక్షత్వానికి మధ్యగల వ్యత్యాస సత్యం లోకానికి వెల్లడవుతుతూ ఉంటుంది. శిష్టరక్షణార్థం దుర్మార్గుడుగా తయారైన తన కుమారుడినే సంహరించవలసి వచ్చింది. అదే సమయంలో తాను నిర్యాణం చెంది దైవ సాన్నిధ్యాన్ని పొందుతూ తన వంశ ప్రాశస్థ్యాన్ని గ్రహించిన నరకుడు తన మరణానికి విచారించే బదులు ఆ మరణదినాన్ని దుర్మార్గ వర్తనపై విజయంగా భావించి మానవులు ఆనందోత్సాహాలు జరుపుకోవాలని కోరుకున్నాడు.

తన మరణంతో దైవ సాన్నిధ్యాన్ని పొందడానికి, దుష్టమైన ప్రవర్తనలు, ఆలోచనలు విడనాడి, సన్మార్గ వర్తనలు కావలసి ఉంటుందని తెలిసిన నరకుని కోసం నరక చతుర్దశినాడు దీపం వెలిగిస్తారు. ఈ రోజునే మానవుల తనువులు, మనసులు, పరివేష్టిత ప్రకృతి నిర్మాల్యమవుతాయి. శరీరాన్ని పవిత్ర గంగాదేవిని స్మరించుకుంటూ నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి పునీతులవుతారు. మనలోని అంతఃకరణ జ్యోతిని ప్రకాశింపచేయడానికి దీపాలంకరణలు చేస్తారు.

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...