Friday, 28 November 2014

సుబ్రహ్మణ్య షష్ఠి:

(కుమార షష్ఠి, స్కంద షష్ఠి... :  28-11-2014)
(నేడే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి)

బ్రహ్మ నుండి "శివసుతుని చేత" మాత్రమే  మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు... వాడి మరణానికై ఎన్నో వ్యయప్రయాలు కూర్చి శివపార్వతులకు వివాహం జరిపించారు దేవతలు... అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో ఒక వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గుడుపుతున్నారు.. కానీ సమస్త లోకాలన్నీ కూడా తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు...శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అప్పుడే శివుని నుండి మహా తెజస్సు వెలువడింది...

అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు, ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి, ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుద్ధషష్ఠినాడు, అనగా ఈ రోజే, ఒక దివ్య తెజోమయుడైన బాలుడు ఉద్భవించాడు. ఆయనే శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దీనికే కుమారషష్ఠి, స్కంద షష్ఠి అని కూడా పేరు...

ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామం వచ్చింది.

తండ్రి యైన పరమశివుని వద్ద సమస్త విద్యలూ నేర్చుకొన్న స్వామి దేవతల సేనాధిపతిగా నియుక్తుడయ్యాడు... అటు తరువాత తారకుని సంహరించి లోకాలలో శాంతిని నెలకొల్పాడు మన స్వామి....తారకుని విజయం అనంతరం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికిచ్చి వివాహం జరిపిస్తాడు...అటు తరువాత దక్షిణదేశం వచ్చిన స్వామి శ్రీ వల్లి దేవిని కూడా వివాహమాడతాడు... అలా శ్రీ కుమారస్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేతుడై లోకాలను అనుగ్రహిస్తున్నాడు...

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః... అందరికీ స్కంద షష్ఠి శుభాకాంక్షలు...

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...