Friday 20 March 2015

మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

శ్రీ మన్మథ ఉగాది: (21- 03- 2015)

యుగాది శబ్దానికి ప్రతిరూపంగా "ఉగాది"గా వ్యవహారంలోకి వచ్చింది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది "ఉగాది"గా ఆచరించాలని నిర్ణయ సింధులో పేర్కొనడం జరిగింది. మన తెలుగు సంవత్సరాలు అరవై కాగా ఈ సారి వచ్చే సంవత్సరం 'మన్మథ'... ఈ సంవత్సరాలన్నీ కూడా నారద మహాముని సంతానంగా పేర్కొంటారు...

వేదాలను హరించిన సోమకాసురుని వధించి మత్స్యావతారంలో విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణంలో శ్రీ మహా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది జరుపబడుతోందని కూడా చెప్పబడుతూన్నది.

ఉగాది పచ్చడి:

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ ।
సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ॥

ఉగాదినాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాదిపచ్చడిని గ్రహించాలి. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు ఇవే ఈ షడ్రుచులు. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, వేప పవ్వు , కారం, ఉప్పులను చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. ఈ షడ్రుచుల సమ్మేళనమే జీవితంలో కష్టసుఖాలు ఆనందవిషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. ఆరోగ్యానికి ఇది మంచిది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారమే...

పంచాంగ శ్రవణం:
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము, రాహుకాల, దుర్ముహూర్త, వర్జ్యాలను, ఆదాయవ్యయాలు, రాజ పూజ్య, రాజ అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. రాబోయే కాలం ఎలా ఉండబోతోంది అని అందరూ సాయంత్రం వేళ ఓ చోట చేరి పంచాంగం వినడం మనం చూస్తూ ఉంటాం.

ఈ 'మన్మథ' ఉగాది అందరికీ సకల శుభాలను కలుగజేయాలని ఆ రాముణ్ణి ప్రార్థిస్తూ... అందరికీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు... జై శ్రీ రామ....

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...