Tuesday 30 June 2015

శ్రీ దత్తాత్రేయ వైభవం - 19:

మనిషి ఎప్పటివరకైతే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడతాడో అప్పటి వరకు తాను సుఖపడడు సరికదా తన చుట్టూ ఉన్నవారికి కష్టాలు, దుఃఖాలు తెచ్చిపెడతాడు. ఎప్పటివరకైతే ప్రాపంచిక వస్తువుల వెనుక పరిగెత్తుతాడో అప్పటివరకు తాను సుఖపడడు. ఎప్పుడైతే తాను ఆ విషయాలపై వ్యామోహాన్ని వదిలిపెడో అప్పుడే పరమపదాన్ని చేరుకోవడంలో ముందుకు సాగుతాడు.

మనం చూసిన కథలో ఎంతవరకైతే రాబందు తన దగ్గర మాంసం ముక్క ఉంచుకుందో అప్పటివరకు తాను ఆ గద్దల చేత వెంటాడబడింది. కానీ ఆ మాంసపు ముక్కని వదిలిపెట్టిన క్షణాన అది రక్షింపబడింది. అలాగే మనిషి కూడా ఎంతవరకైతే తాను ప్రాపంచిక వస్తువిషయాలపై మక్కువ పెంచుకుంటాడో అప్పటివరకు తాను ఈ భవసాగరంలో మునుగితేలుతూనే ఉంటాడు. కానీ వాటిపై వ్యామోహం వదలగానే అమితమైన ప్రశాంతతను పొంది పరమాత్మను చేరడంలో ముందుకు సాగిపోతాడు.

జీవి తను పరమాత్మను చేరడంలో కూడా పరమాత్మ సాయాన్నే అర్థించాలి. ఆయన కృపలేనిదే ఆయనను చేరడం అసంభవం. భాగవతంలో కుంతీదేవి శ్రీకృష్ణుడితో " పరంధామా! ఈ భవసాగరంలో మునిగితేలుతూ  వీటిపై ఆసక్తి పెంచుకున్న మేము నిన్ను ఎలా చేరుకుంటామయ్యా! ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ మనిషి జన్మ ఎత్తలేము. ఎత్తినా నిన్ను చేరటంలో కొంతమాత్రమే ముందుకుపోగలుగుతాం. నిన్ను చేరాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి తండ్రి? కాస్త దయ చూపించవయ్యా!! " అని ఆర్తితో వేడుకుంది.

అప్పుడు కృష్ణుడు కుంతీదేవితో " అమ్మా కుంతీదేవి! బాధపడకు. నన్ను చేరటానికి ఎందుకంత శ్రమ? భక్తితో పిలిచే ఒక్క పిలుపు చాలు! నేను మీకు వశుడనైపోతాను. సాధ్వీ! భక్తి ఉంటే నన్ను చేరటంలో నేనే మీకు సహాయపడతాను. వేరే ఏ శక్తి అవసరం లేదు. కేవలం భక్తి ముఖ్యం " అని సెలవిస్తాడు. కానీ మనకు కనీసం ఒక్క క్షణమైనా భక్తితో పరమాత్మపై దృష్టి కేంద్రీకరించడం కష్టతరమైన విషయంగా మారిపోయింది.

మనం రోజూ చదివే స్తోత్రాలవలన దేవుడు మనకు వశుడైపోతాడనుకోవడం కన్నా  మూర్ఖత్వం ఉండదు. ఆ స్తోత్రాలు చదివేటప్పుడు భక్తి ఇంకా ఆర్తి ముఖ్యం. అంతేగానీ పొగడ్తలకు లొంగేవాడు పరమాత్ముడెందుకవుతాడు? స్తోత్రం చదివితే చదివిన ఫలం లభిస్తుందేమో గానీ పరమాత్మ లొంగుతాడా? పరమాత్మ లొంగేది కేవలం భక్తికి, ఆర్తికి మరియు మనకు ఆయన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వలన మాత్రమే..... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...