Saturday 7 November 2015

ద్వారక అస్తమయం - 8:

వసుదేవుడు యాదవుల పోట్లాట గురించి చెప్తున్నాడు కాని కృష్ణుడికి ఏమయ్యింది ఎక్కడ ఉన్నాడు అని చెప్పలేదు. కనుక శ్రీకృష్ణుడు క్షేమముగా ఉన్నాడు. అతడికి ఏమి కాలేదు అని తన మనసును సమాధాన పరచుకున్నాడు. అర్జునుడు అలా ఆలోచిస్తున్న సమయములో వసుదేవుడు తిరిగి అర్జునుడితో " ఏమి చెప్పను అర్జునా ! అలా యాదవులు తుంగకర్రలతో కొట్టుకుని మరణించిన తరువాత శ్రీకృష్ణుడు అంతఃపుర కాంతలను వెంట పెట్టుకుని ద్వారకకు వచ్చాడు " అన్నాడు. అర్జునుడు ఇక ఆగలేక " అదిసరే! ప్రస్తుతము కృష్ణుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడు. నేను కృష్ణుడిని వెంటనే చూడాలి " అని వసుదేవుడితో అన్నాడు. వసుదేవుడు " ఇక్కడే ఉన్నాడు. అంతఃపుర కాంతలను తీసుకు వచ్చిన తరువాత నా వద్దకు వచ్చి " తండ్రీ ! ప్రస్థుతము భోజక, అంధక కుల యాదవులు వృష్టి వంశము వారు ఒకరితో ఒకరు కలహించుకుని సమూలముగా మరణించారు. నేను అర్జునుడి కొరకు దారుకుడిని పంపాను. అర్జునుడు ఈ సమయానికి వస్తూ ఉంటాడు.

అర్జునుడు నీకు భక్తుడు, నీ ఆజ్ఞను పాటిస్తాడు, అన్ని పనులు చేయగల సమర్ధుడు, కార్యదక్షుడు, పరాక్రమవంతుడు నాకు అర్జునుడికి ఏ భేదము లేదు. నేనే అతడూ అతడే నేను అతడి సాయంతో నీవు మిగిలిన యాదవులను రక్షించు. అర్జునుడు అంతఃపుర కాంతలను, బాలురను, వృద్ధులను కాపాడతాడు. ఇంకా కొన్ని దినములలో సముద్రము పొంగి ద్వారకానగరము సముద్రములో కలసి పోతుంది. యాదవులు ఈ విధముగా కొట్టుకుని మరణిస్తున్న తరుణములో బలరాముడు అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని యోగసమాధిలో మునిగి పోయాడు. నాకు కూడా ఆ మార్గము ఉత్తమము అని అనిపిస్తుంది. కనుక మీరు నాకు తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి నేనిక అడవిలో తపమాచరిస్తాను. నీవు అర్జునుడు చెప్పిన విధముగా చెయ్యి. మరణించిన యాదవులకు అర్జునుడు ఉత్తర క్రియలు నిర్వహిస్తాడు.

అంతే కాదు కాలక్రమంలో అర్జునుడే మీకు అందరికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు " అని శ్రీకృష్ణుడు నాతో చెప్పాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఇప్పుడు నీవు వచ్చావు. అంతకు మించి నాకు ఏమీ తెలియదు. అర్జునా ! ఏ కారణము లేకుండా కొడుకులు, మనుమలు, బంధువులు ఇలా హటాత్తుగా పీనుగులు అయినప్పుడు ఆ బాధ తట్టు కోవడము నా వలన ఔతుందా చెప్పు. ఆహారము, నీరు కూడా సహించడము లేదు. నా ప్రాణము మాత్రము ఈ దేహమును విడిచి పోవడము లేదు. ఏమి చెయ్యను ? నా వల్ల ఏమీకాదు. ఇక ఈ యాదవకుల స్త్రీలను, బాలురను, వృద్ధులను, అశ్వసంపదను నీవే కాపాడాలి. ఈ బాధ్యతను శ్రీకృష్ణుడు నీ భుజస్కందముల మీద పెట్టాడు కదా ! " అన్నాడు. వసుదేవుడి మాటలు విన్న అర్జునుడు మనసులో ఇలా అనుకున్నాడు. శ్రీకృష్ణుడు లేని ద్వారకలో నేను మాత్రము ఎలా ఉండగలను.

వేంటనే హస్థినకు వెళ్ళాలి అనుకుని వసుదేవుడితో " అనఘా ! ఈ విషయములో ధర్మరాజు ఒక నిర్ణయము తీసుకున్నాడు. ఆ నిర్ణయము ప్రకారము నేను అంతఃపుర కాంతలను, యాదవ స్త్రీలను, బాలురను, వృద్ధులను తీసుకుని హస్థినకు వెళతాను. అక్కడ వారంతా సుఖముగా ఉండే ఏర్పాటు జరిపిస్తాము. మీరు దయచేసి నాతో హస్థినకు రండి. అంతా విధిలిఖితము అనుకుని ఊరడిల్లండి " అన్నాడు. తరువాతఅర్జునుడు దారుకుడితో " దారుకా ! మనము శ్రీకృష్ణుడు వెళ్ళిన దారిన వెళ్ళి  శ్రీకృష్ణుడి కొరకు వెతుకుతాము. ఇక్కడ జరుగవలసిన పనులను అందరినీ పిలిచి ఆదేశాలు ఇస్తాము.

దారుకుడు ద్వారకలో ఉన్న మంత్రులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, పుర ప్రముఖులను అందరినీ సుధర్మఅనే రాజ మందిరముకు పిలిచి " ఈ రోజు మొదలు ఏడవనాటికి సముద్రము పొంగి ద్వారక సముద్రములో మునిగి పోతుంది అని ఆకాశవాణి చెప్పగా అందరూ విన్నారు. కనుక మనము అందరము ద్వారకను విడిచి ఇంద్రప్రస్థ నగరానికి వెళదాము. అక్కడ మీరు అందరూ సుఖముగా ఉండవచ్చు. మీకు అవసరమైన సామాను మూటలు కట్టండి. స్త్రీలకు, బాలురకు,వృద్ధులకు బండ్లు కట్టండి. అన్నింటినీ సిద్ధముగా ఉంచుకుని ఎప్పుడైనా ద్వారకను వదలడానికి సిద్ధముగా ఉండండి......  (ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...