Tuesday 26 September 2017

శ్రీ కాత్యాయినీ దేవి

(ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి, 26 - 09 - 2017, మంగళవారం )

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాతనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ॥

దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని.
పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వ విఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి. ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది. ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి). ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.

కాత్యాయనీ దేవి అమోఘఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రను, మరొకటి వరదముద్రను కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి.ఈమె సింహవాహని. ఆ దినానసాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది.

ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు.ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసన యందూ తత్పరులము కావాలి.

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...