Thursday 25 April 2019

కపిల దేవహూతి సంవాదం - 6


3-874-వ.
"మఱియుఁ, జిత్తం బహంకార మమకార రూపాభిమానజాతంబు లగు గామలోభాది కలుష వ్రాతంబులచేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధం బగు; నప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు నేకరూపంబు నై ప్రకృతి కంటెఁ బరుండును, బరమ పురుషుండును, నిర్భేదనుండును, స్వయంజ్యోతియు, సూక్ష్మస్వరూపుండును, నితరవస్త్వంతరా పరిచ్ఛిన్నుండును, నుదాసీనుండును నైన పరమాత్మునిం దన్మయంబును హతౌజస్కంబు నైన ప్రపంచంబును జ్ఞాన వైరాగ్య భక్తి యుక్తం బగు మనంబుచేఁ బొడగాంచి; యోగిజనులు పరతత్త్వసిద్ధికొఱకు నిఖిలాత్మకుం డైన నారాయణు నందు నియుజ్యమానం బయిన భక్తిభావంబువలన నుదయించిన మార్గంబునకు నితరమార్గంబులు సరి గావండ్రు; విద్వాంసులు సంగం బింద్రియా ర్థాద్యసద్విషయంబుగ నొనరింపబడి జీవునకు నశిధిలం బగు బంధంబునకుఁ గారణం బగు ననియు; నదియె సద్విషయం బైన నంతఃకరణ సంయమన హేతుభూతం బగుచు సాధుజనులకు ననర్గళ మోక్షద్వారం బగు ననియుఁ దెలియుదురు; సహనశీలురు సమస్త శరీరధారులకు సుహృత్తులును బరమశాంతులును గారుణికులును నై పరిత్యక్త కర్మఫల స్వభావులును విసృష్ట స్వజన బంధుజనులును నై మత్పదాశ్రయులును, మద్గుణధ్యానపారీణులును, మత్కథాప్రసంగ సంభరిత శ్రవణానందులును నగుచు మదీయ కథల నొడువుచు వినుచునుండు పరమ భాగవతోత్తముల నాధ్యాత్మికాది తాపత్రయంబు దపింప జాలదు; అట్టి సర్వసంగవివర్జితు లగు పరమభాగవతజనుల సంగం బపేక్షణీయంబు; అది సకలదోష నివారకం బగు; అట్టి సత్సంగంబున సర్వప్రాణి హృత్కర్ణరసాయనంబు లగు మదీయ కథా ప్రసంగంబులు గలుగు; మద్గుణాకర్ణనంబునం జేసి శ్రీఘ్రంబుగఁ గ్రమంబునం గైవల్య మార్గదంబు లగు శ్రద్ధాభక్తు లుదయించు; అదియునుం గాక యే పురుషుం డైననేమి మద్విరచిత జగత్కల్పనాది విహారచింతచే నుదయించిన భక్తింజేసి యింద్రియసుఖంబు వలనను దృష్ట శ్రుతంబు లైన యైహి కాముష్మికంబుల వలనను విముక్తుం డగుచుఁ జిత్తగ్రహణార్థంబు ఋజువు లైన యోగమార్గంబులచే సంయుక్తుం డగునట్టి యోగి ప్రకృతిగుణ సేవనంబుచేత వైరాగ్యగుణ విజృంభితం బైన జ్ఞానయోగంబుచేతను మదర్పిత భక్తియోగంబుచేతను బ్రత్యగాత్మకుండ నైన నన్ను నంతఃకరణ నియుక్తునిం గావించు" నని చెప్పిన విని దేవహూతి గపిలున కిట్లనియె.

భావము:
“ఇంకా నేను నాది అనే అహంకార మమకార రూపమైన అభిమానంవల్ల కామం, క్రోధం, లోభం మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వానికి లోనుగాకుండ వానినుండి విడివడినప్పుడు పరిశుద్ధ మవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు సుఖం, దుఃఖం అనేవి ఉండక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్మ ప్రకృతికంటె అతీతుడు, స్వయంప్రకాశుడు, సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, ఉదాసీనుడు. అటువంటి పరమాత్మనూ, ఆ పరమాత్మ తేజస్సువల్ల నిస్తేజమైన ప్రపంచాన్నీ యోగివరేణ్యులు భక్తిజ్ఞానవైరాగ్యాలతో కూడిన చిత్తంతో దర్శించినవారై మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తి మార్గమే ఉత్తమోత్తమ మైనదని, తక్కిన మార్గాలు దానికి సాటిరావని చాటిచెప్పారు. ఇంద్రియార్థాలైన శబ్దస్పర్శరూపరసగంధాలతో కలయిక అసద్విషయమై, దృఢమైన బంధానికి కారణం అవుతుంది. ఆ సంగమమే భగవంతుని సంబంధమై సద్విషయమైనపుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై సత్పురుషులకు తెరిచిన మోక్షద్వారం అవుతుంది అని విద్వాంసుల అభిప్రాయం. సహన స్వభావం కలిగి, సమస్త జీవులకు ఆప్తబంధువులై, శాంతమూర్తులై, కరుణార్ద్రహృదయులై, కర్మఫలాలను పరిత్యజించి, తనవారు, బంధువులు అనే అభిమానం విడిచి, నన్ను చక్కగా ఆశ్రయించినవారై, నా గుణగణాలను ధ్యానిస్తూ, నా చరిత్రను వీనులవిందుగా ఆలకించి ఆనందిస్తూ, నా కథలే చెప్పుకొంటూ, నా కథలే వింటూ ఉండేవారు పరమ భాగవతోత్తములు. అటువంటి వారిని ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపత్రయాలు ఏమీ చేయలేవు. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యం మాత్రమే కోరదగినది. అదే సకల దోషాలను నివారిస్తుంది. అటువంటివారి స్నేహంవల్ల సర్వప్రాణుల హృదయాలలో చెవులలో సుధారసం చిందించే నా కథాప్రసంగాలు ప్రాప్తిస్తాయి. నా గుణాలను వినడంవల్ల సక్రమమైన మార్గంలో శీఘ్రంగా మోక్షాన్ని ప్రసాదించే శ్రద్ధాభక్తులు ఉద్భవిస్తాయి. ఎవడు నేను చేసిన ఈ విశ్వసృష్టినీ, నా లీలావిహారాలనూ తలపోస్తూ అందువల్ల ప్రభవించిన భక్తిచేత ఇంద్రియ సుఖాలకూ, కనిపించేవీ వినిపించేవీ అయిన ఇహలోక పరలోక సుఖాలకూ లోనుకాకుండా, మనోనిశ్చలత్వం కోసం చక్కని యోగమార్గాన్ని అవలంబిస్తాడో అతడు యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ప్రకృతిగుణాలను అనుసరించటం వల్లనూ, వైరాగ్యాన్ని పెంపొందించే జ్ఞానయోగం వల్లనూ, ఆత్మార్పణ రూపమైన భక్తియోగం వల్లనూ సాక్షాత్కరించిన ఆత్మస్వరూపం గల నన్ను తన హృదయాంతరంలో నిలుపుకొంటాడు” అని కపిలుడు చెప్పగా విని దేవహూతి అతనితో ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=874

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...