Thursday 20 June 2019

కపిల దేవహూతి సంవాదం - 39

3-919-వ.
మఱియు; నణిమాద్యష్టైశ్వర్యంబులు మోక్షంబున కంతరాయంబులు గావున వాని యందు విగతసంగుండును మదీయ చరణసరోజస్థిత లలితాంతరంగుండును నగు వాడు మృత్యుదేవత నపహసించి మోక్షంబు నొందు" అని చెప్పి; వెండియు "యోగలక్షణప్రకారంబు వినిపింతు విను" మని భగవంతుం డైన కపిలుండు నృపాత్మజ కిట్లనియె.
3-920-క.
"ధీనిధులై యే యోగవి
ధానంబునఁ జేసి మనము దగ విమలంబై
మానిత మగు మత్పదముం
బూనుదు రా యోగధర్మముల నెఱిఁగింతున్.

భావము:
ఇంకా అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు మోక్షానికి విఘ్నాన్ని కలిగిస్తాయి. అందువల్ల వాటిమీద మమకారాన్ని వదలిపెట్టి నా పాదపద్మాలను హృదయంలో పదిలపరచుకున్నవాడు మృత్యువును తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు” అని చెప్పి “ఇక యోగలక్షణాల విధానాలను వివరిస్తాను. విను’” అని భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు. “బుద్ధిమంతులై ఏ యోగమార్గంవల్ల తమ మనస్సును మరింత పరిశుద్ధం చేసికొని మాననీయమైన నా సన్నిధిని చేరుకుంటారో ఆ యోగధర్మాలను చెప్తాను విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=49&padyam=919

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...