Sunday 26 January 2020

దక్ష యాగము - 15


( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )

4-62-క.
జనకుని మఖమున కర్థిం
జని నీతోఁ బారిబర్హ సంజ్ఞికతఁ గడుం
దనరిన భూషణములఁ గై
కొన వేడ్క జనించె నీశ! కుజనవినాశా!
4-63-క.
నాతోడను స్నేహము గల
మాతను దత్సోదరీ సమాజము ఋషి సం
ఘాతకృత మఖసమంచిత
కేతువుఁ గన వేడ్క గగనకేశ! జనించెన్.
4-64-వ.
అదియునుం గాక; దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచంబు భవదీయ మాయా వినిర్మితం బగుటం జేసి నీకు నాశ్చర్యకరంబు గాదు; ఐనను భవదీయ తత్త్వం బెఱుంగఁ జాలక కామినీ స్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమిఁ గనుంగొన నిచ్చగించితి" నని వెండియు నిట్లనియె.


భావము:
శంకరా! దుష్టజన నాశంకరా! నా తండ్రి చేసే యజ్ఞానికి నీతో వెళ్ళి అక్కడ పరిబర్హం అనబడే నగలను కానుకలుగా పొందాలనే కోరిక పుట్టింది. వ్యోమకేశా! నాపై అనురాగం కల తల్లినీ, అక్కచెల్లెండ్రను, ఋషుల సమూహం నిర్వహించే ఆ మహాయజ్ఞానికి చెందిన ధ్వజాన్ని చూడాలని వేడుక పడుతున్నాను. దేవా! అంతేకాక సత్త్వరజస్తమో గుణాత్మకమై మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచం మీ మాయచేత సృజింపబడింది కనుక మీకు ఆశ్చర్యాన్ని కలిగించదు. అయినా మీ తత్త్వాన్ని తెలిసికొనలేక స్త్రీ స్వభావంతో, స్వార్థంతో నా పుట్టిల్లు చూడాలని ఇష్టపడుతున్నాను.” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=63

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...