Thursday 16 January 2020

దక్ష యాగము - 5


(ఈశ్వర దక్షుల విరోధం)

4-41-తే.
"వినుఁడు మీరలు రొదమాని విబుధ ముని హు
తాశనాది సురోత్తములార! మోహ
మత్సరోక్తులు గావు నా మాట" లనుచు
వారి కందఱ కా పురవైరిఁ జూపి.
4-42-సీ.
"పరికింప నితఁడు దిక్పాలయశోహాని;
కరుఁ డీ క్రియాశూన్యపరుని చేతఁ
గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషి;
తం బయ్యె; నెన్న గతత్రపుండు
మహితసావిత్రీ సమానను సాధ్వి న;
స్మత్తనూజను మృగశాబనేత్ర
సకల భూమీసుర జన సమక్షమున మ;
ర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ
4-42.1-తే.
జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మఁ
దలఁచి ప్రత్యుద్గమాభివందనము లెలమి
నడపకుండిన మాననీ; నన్నుఁ గన్న
నోరిమాటకుఁ దన కేమి గోరువోయె.
భావము:
“దేవతలారా! మునులారా! మీరందరూ సద్దు చేయకుండా వినండి. నా మాటలు అజ్ఞానంతో, అసూయతో పలికేవి కావు” అని వారందరికీ శివుని చూపించి “ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతనివల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గు లేదు. లేడి కన్నులు కలిగి, సావిత్రీదేవివంటి సాధ్వీశిరోమణి అయిన నా కుమార్తెను ఈ కోతికన్నులవాడు పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=42

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...