Tuesday 25 February 2020

దక్ష యాగము - 44

(శివుడనుగ్రహించుట )

4-149-సీ.
"మఱి భేదబుద్ధిఁ గర్మప్రవర్తనముల;
మదయుతు లయి దుష్టహృదయు లగుచుఁ
బరవిభవాసహ్య భవ మనో వ్యాధులఁ;
దగిలి మర్మాత్మ భేదకము లయిన
బహు దురుక్తుల చేతఁ బరులఁ బీడించుచు;
నుండు మూఢులను దైవోపహతులఁ
గాఁ దలపోసి య క్కపటచిత్తులకు నీ;
వంటి సత్పురుషుఁ డేవలన నైన
4-149.1-తే.
హింసఁ గావింపకుండు సమిద్ధచరిత!
నీలలోహిత! మహితగుణాలవాల!
లోకపాలనకలిత! గంగాకలాప!
హర! జగన్నుతచారిత్ర! యదియుఁ గాక.
4-150-సీ.
అమర సమస్త దేశము లందు నఖిల కా;
లములందుఁ దలఁప దుర్లంఘ్య మహిముఁ
డగు పద్మనాభు మాయా మోహితాత్మకు;
లై భేదదర్శను లైనవారి
వలనను ద్రోహంబు గలిగిన నైనను;
నది దైవకృత మని యన్యదుఃఖ
ముల కోర్వలేక సత్పురుషుండు దయచేయు;
గాని హింసింపఁడు గాన నీవు
4-150.1-తే.
నచ్యుతుని మాయమోహము నందకుంటఁ
జేసి సర్వజ్ఞుఁడవు; మాయచేత మోహి
తాత్ములై కర్మవర్తను లయినవారి
వలన ద్రోహంబుగలిగిన వలయుఁ బ్రోవ.

భావము:
ఓ భవ్యచరితా! నీలలోహితా! పావన గుణ భరితా! లోక పరిపాలా! గంగాధరా! హరా! సకల లోక స్తుత చరిత్రా! మూర్ఖులు మదించి, దుష్టచిత్తులై భేదబుద్ధితో ప్రవర్తిస్తారు. పరుల సంపదను చూచి ఓర్వలేరు. మనోవ్యాధితో క్రుంగిపోతారు. మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నీవు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఆ కపటాత్ములకు నీవంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస కావించడు. సమస్త దేశాలలోను, సర్వ కాలాలలోను ఉల్లంగించరాని మహిమ కల విష్ణువు యొక్క మాయకు చిక్కినవారు భేదదృష్టితో ప్రవర్తిస్తారు. వారు ద్రోహం చేసినట్లైతే సత్పురుషుడు అది దైవకృతంగా భావిస్తాడు. ఆ మహితాత్ముడు ఇతరుల దుఃఖం చూచి ఓర్చుకోలేడు. వారిమీద జాలి పడతాడు. అంతేకాని వారిని హింసింపడు. నీవు విష్ణుమాయకు అతీతుడవు. అందుచేత నీవు సర్వజ్ఞుడవు. విష్ణుమాయకు వశులై కర్మలు ఆచరించేవారు అపరాధం చేసినట్లైతే నీవు క్షమించి వారిని కాపాడాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=149

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...