Monday 6 April 2020

ధ్రువోపాఖ్యానము - 23


4-282-సీ.
మహితాత్మ! మఱి జన్మమరణ ప్రణాశన;
హేతు భూతుండవు నిద్ధకల్ప
తరువవు నగు నిన్నుఁ దగనెవ్వరే నేమి;
పూని నీ మాయా విమోహితాత్ము
లగుచు ధర్మార్థ కామాదుల కొఱకుఁ దా;
మర్చించుచును ద్రిగుణాభమైన
దేహోపభోగ్యమై దీపించు సుఖముల;
నెనయంగ మదిలోన నెంతు; రట్టి
4-282.1-తే.
విషయ సంబంధ జన్యమై వెలయు సుఖము
వారికి నిరయమందును వఱలు దేవ!
భూరి సంసార తాప నివార గుణ క
థామృతాపూర్ణ! యీశ! మాధవ! ముకుంద!
4-283-మ.
అరవిందోదర! తావకీన చరణధ్యానానురాగోల్లస
చ్చరితాకర్ణనజాత భూరిసుఖముల్ స్వానందకబ్రహ్మ మం
దరయన్ లేవఁట; దండ భృద్భట విమానాకీర్ణులై కూలు నా
సురలోకస్థులఁ జెప్పనేల? సుజనస్తోమైక చింతామణీ!

భావము:
మహానుభావా! దేవా! మాధవా! ముకుందా! అపారమైన సంసార తాపాలను నివారించే సుగుణాలతో కూడిన కథాసుధాపూరం కలవాడా! జనన మరణాలను తొలగించి నీవు ప్రాణులను రక్షిస్తావు. తమ తమ కోరికలు నెరవేరటం కోసం నిన్ను సేవించేవారు నీ మాయచేత మోసగింపబడినవారే. భక్తజన కల్పవృక్షం అయిన నిన్ను దైహికాలైన ఐహికసుఖాలకోసం కొందరు సేవిస్తారు. విషయ సంబంధమైన సుఖం నరకంలో కూడా లభిస్తుంది. పద్మానాభా! సాధుజన చింతామణీ! నీ పాదస్మరణం వల్లను, అనురాగ సుధలు చిందే నీ కథలను వినటం వల్లను ప్రాప్తించే పరమసుఖం స్వాత్మానందంతో సమానమైన మోక్షంలో కూడ లభించదంటారు. ఇక యముని కాలదండం చేత విరిగిపడే విమానాల నుండి కూలిపోతున్న వేలుపుల మాట వేరే చెప్పటం దేనికి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=283

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...