Monday 18 May 2020

ఉషా పరిణయం - 4

(బాణునకీశ్వర ప్రసాద లబ్ధి )

10.2-322-మ.
"అనిలో నన్ను నెదిర్చి బాహుబలశౌర్యస్ఫూర్తిఁ బోరాడఁ జా
లిన వీరుం డొకఁ డైనఁ బందెమునకున్ లేఁడయ్యె భూమండలి
న్ననయంబున్ భవదగ్రదత్తకరసాహస్రంబు కండూతి వా
యునుపాయంబునులేద యీభరము నెట్లోర్తున్నుమానాయకా!
10.2-323-సీ.
హుంకార కంకణ క్రేంకార శింజినీ;
టంకార నిర్ఘోషసంకులంబు
చండ దోర్దండ భాస్వన్మండలాగ్ర ప్ర;
కాండ ఖండిత రాజమండలంబు
శూలాహతక్షతోద్వేల కీలాల క;
ల్లోల కేళీ సమాలోకనంబు
శుంభ దున్మద కుంభి కుంభస్థలధ్వంస;
సంభూత శౌర్య విజృంభణంబు
10.2-323.1-తే.
గలుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి
ఘన పరాక్రమ విక్రమక్రమము గాఁగ
జరపలేనట్టి కరములు కరము దుఃఖ
కరము లగుఁ గాక సంతోషకరము లగునె?
10.2-324-ఉ.
కాన మదీయ చండభుజగర్వ పరాక్రమ కేళికిన్ సముం
డీ నిఖిలావనిం గలఁడె యిందుకళాధర! నీవు దక్కఁగా;"
నా నిటలాంబకుండు దనుజాధిపు మాటకుఁ జాల రోసి లో
నూనిన రోషవార్ధి గడ లొత్తఁ గ నిట్లని పల్కె భూవరా!

భావము:
బాణుడు ఇలా అన్నాడు “ఓ పార్వతీపతీ! యుద్ధంలో నన్ను ఎదిరించి నిలిచి తన బాహుబలాన్ని ప్రదర్శింప జాలిన వీరాధివీరుడు ఒక్కడు కూడా ఈ భూమండలంలో ఎంత వెతికినా కనిపించడం లేదు. నీవు ప్రసాదించిన ఈ నా వెయ్యి చేతులు రణకండూతి తీర్చుకొనే ఉపాయం ఏదీ లేదయ్యా. ఈ కండూతి తీరని భారం ఎలా ఓర్చుకోగల నయ్యా? ఈశ్వరా!
దిక్కులుదద్దరిల్లే హూంకారాలు, చేతి కడియాల కణకణ ధ్వనులు, ధనుష్టంకారాలు చేసే కోలాహలంతో నిండినదీ; చండప్రచండ బాహుదండాలలో ప్రకాశించే ఖడ్గాలతో ఖండింపబడిన శత్రు రాజుల శిరస్సులు కలదీ; శూలపు పోట్లకు శరీరాల నుండి జలజల ప్రవహించే రక్తధారలతో భయంకరమైనదీ; మదించిన ఏనుగుల కుంభస్థలాలను బద్దలుకొట్టే వీరవిజృంభణం కలదీ అయిన భీకర యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేనట్టి వట్టి చేతుల వలన ఉపయోగము ఏముంటుంది చెప్పు. అలాంటి చేతులు నా వంటి వీరులకు దుఃఖము కలిగించేవి అవుతాయి కాని సంతోషము కలిగించేవి కావు కదా. ఓ ఇందుధరా! నా ఈ ప్రచండ బాహుదండాల పరాక్రమకేళిని ఎదిరించగల వీరుడు ఈ ప్రపంచం మొత్తంలో నీవు తప్ప మరెవ్వరూ లేరు.” అంటున్న బాణుడి ప్రగల్భపు మాటలకు ఫాలనేత్రుడు అసహ్యించుకుని, లోపలి రోషం పొంగిపొరలగా ఆ దోషాచరుడితో ఇలా అన్నాడు. పరీక్షిన్నరవరా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=31&padyam=324

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...