4-373-ఆ.
అట్టి శార్ఙ్గపాణి యఖిల జగద్భర్త
దేవదేవుఁ డతుల దివ్యమూర్తి
మమ్ముఁ బనుప మేము మాధవపదమున
కర్థి నిన్నుఁ గొనుచు నరుగుటకును.
4-374-వ.
వచ్చితిమి; ఏ పదంబు నేని సూరిజనంబులు సర్వోత్తమం బని పొందుదురు; దేనిఁ జంద్ర దివాకర గ్రహ నక్షత్ర తారాగణంబులు ప్రదక్షిణంబుగాఁ దిరుగుచుండు; మఱియు నీదు పితరులచేతను నన్యులచేతను ననధిష్ఠితంబును, జగద్వంద్యంబును, నభక్తజనాతిదుర్జయంబును నయిన విష్ణుపదంబుం బొందుదువు రమ్మిదె విమానశ్రేష్ఠం; బుత్తమశ్లోకజన మౌళిమణియైన శ్రీహరి పుత్తెంచె; దీని నెక్క నర్హుండ" వనిన నురుక్రమ ప్రియుం డయిన ధ్రువుండు తన్మధుర వాక్యంబులు విని కృతాభిషేకుం డయి యచ్చటి మునులకుఁ బ్రణమిల్లి తదాశీర్వాదంబులు గైకొని, విమానంబునకుం బ్రదక్షిణార్చనంబులు గావించి హరిపార్షదులైన సునందనందులకు వందనం బాచరించి భగవద్రూపవిన్యస్త చక్షురంతః కరణాదికుం డగుచు విమానాధిరోహణంబు గావించుటకు హిరణ్మయ రూపంబు ధరియించె; నప్పుడు.
భావము:
అటువంటి శార్ఙ్గపాణి, సర్వజగద్భర్త, దేవదేవుడు, దివ్యస్వరూపుడు అయిన హరి మమ్ము పంపించగా నిన్ను విష్ణుపదానికి తోడ్కొని పోవటానికై వచ్చాము. ఏ స్థానాన్ని పండితులు సర్వశ్రేష్ఠమని భావిస్తారో, దేనిని చంద్రుడు సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు, తారాగణాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటాయో, దేనిని నీ పితృదేవతలు పొందలేకపోయారో, ఏది జగద్వంద్యమో, దేనిని భక్తులు కానివారు పొందలేరో అటువంటి విష్ణుపదాన్ని నీవు పొందుతావు. రా! ఇదిగో ఈ గొప్ప విమానాన్ని దేవాదిదేవుడైన శ్రీహరి పంపించాడు. దీని నెక్కడానికి నీవు అర్హుడవు” అని విష్ణుకింకరులు చెప్పగా విష్ణుప్రియుడైన ధ్రువుడు వారి మధుర వాక్కులను విని సంతోషించి, స్నానము చేసి, అక్కడి మునులకు నమస్కరించి, వారి ఆశీస్సులను పొంది, విమానానికి ప్రదక్షిణ చేసి పూజించి, హరి అనుచరులైన సునంద్ నందులకు వందనం చేసి కన్నులను మనస్సును విష్ణువునందే లగ్నం చేసినవాడై విమానాన్ని ఎక్కడానికి తేజోమయం రూపాన్ని ధరించాడు. అప్పుడు…
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=14&padyam=374
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment