Wednesday 20 May 2020

ఉషా పరిణయం - 6

( ఉషాకన్య స్వప్నంబు  )

10.2-327-సీ.
ఆ దానవేశ్వరు ననుఁగుఁ గుమారి యు;
షాకన్య విమలసౌజన్యధన్య
రూపవిభ్రమ కళారుచిర కోమలదేహ;
యతను నాఱవబాణ మనఁగఁ బరఁగు
సుందరీరత్నంబు నిందునిభానన;
యలినీలవేణి పద్మాయతాక్షి
యొకనాఁడు రుచిరసౌధోపరివేదికా;
స్థలమున మృదుశయ్య నెలమిఁ గూర్కి
10.2-327.1-తే.
మున్ను దన చౌల నెన్నఁడు విన్న యతఁడుఁ
గన్నులారంగఁ దాఁ బొడగన్న యతఁడుఁ
గాని యసమానరూపరేఖావిలాస
కలితు ననిరుద్ధు నర్మిలిఁ గవిసినటులు.
10.2-328-చ.
కలగని యంత మేలుకని కన్నుల బాష్పకణంబు లొల్కఁగాఁ
గలవలెఁ గాక నిశ్చయముగాఁ గమనీయ విలాస విభ్రమా
కలిత తదీయరూపము ముఖంబున వ్రేలిన యట్ల దోఁచినం
గళవళ మందుచున్ బిగియఁ గౌఁగిటిచే బయ లప్పళించుచున్

భావము:
దానవేశ్వరుడైన బాణాసురునికి ఉషాకన్య అనే ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె గొప్ప సౌందర్యరాశి, సద్గుణవతి, చంద్రముఖి, నీలవేణి, పద్మనేత్ర, మన్మథుని ఆరవబాణం. ఇటువంటి ఉషాబాల ఒకనాడు తన సౌథంలో మెత్తనిపాన్పుపై నిద్రిస్తున్నది. అసమాన సౌందర్యవంతు డైన అనిరుద్ధుడితో సుఖించుచునట్లు అమెకు ఒక కల వచ్చింది. ఆ సుందరాంగుని ఉష ఇంతకు ముందు వినలేదు, చూడలేదు. కలలోంచి మేలుకొన్న ఉషకన్య కన్నుల వెంట బాష్పకణాలు జాలువారుతున్నాయి. ఆమెకు అది కల కాక వాస్తవ మేమో అనే భ్రాంతి కలిగింది. ఆ సౌందర్యవంతుని అందమైన ఆకారం కన్నుల యెదుట కన్పిస్తున్నట్లే ఉంది. ఉషాబాల కళవళపడుతూ, వట్టినే గాలినే కౌగలించుకుంటూ...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=32&padyam=328

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...