Tuesday 30 June 2020

ఉషా పరిణయం - 32


( బాణాసురునితో యుద్ధంబు )

10.2-394-సీ.
హార కిరీట కేయూర కంకణ కట;
కాంగుళీయక నూపురాది వివిధ
భూషణప్రతతిచేఁ బొలుపారు కరముల;
ఘనగదా శంఖ చక్రములు దనర
సురభి చందన లిప్త సురుచి రోరస్థ్సలిఁ;
బ్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడఁ
జెలువారు పీత కౌశేయచేలము కాసె;
వలనుగా రింగులువాఱఁ గట్టి
10.2-394.1-తే.
శైబ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహ
కములఁ బూన్చిన తే రాయితముగఁ జేసి
దారుకుఁడు దేర నెక్కె మోదం బెలర్ప
భానుఁ డుదయాచలం బెక్కు పగిది మెఱసి.
10.2-395-వ.
ఇట్లు రథారోహణంబు సేసి, భూసురాశీర్వచన పూతుండును, మహితదుర్వాంకు రాలంకృతుండును, లలితపుణ్యాంగనా కరకిసలయకలిత శుభాక్షత విన్యాస భాసురమస్తకుండును, మాగధ మంజుల గానానుమోదితుండును, వందిజనసంకీర్తనా నందితుండును, బాఠక పఠనరవ వికాసిత హృదయుండును నయి వెడలు నవసరంబున.

భావము:
శ్రీకృష్ణుడు హారములు, కిరీటము, దండకడియములు, కంకణములు, అంగుళీయకములు, కాలి అందెలు మున్నగు సకల ఆభరణాలను ధరించాడు; శంఖచక్రగదాది ఆయుధాలను ధరించాడు; చందనం అలదిన వక్షస్థలంమీద కౌస్తుభరత్న కాంతులు ప్రసరిస్తూ ఉండగా, పీతాంబరాన్ని రింగులు వారగట్టాడు; శైబ్యము, సుగ్రీవము, మేఘ పుష్పకము, వలాహకము అనే నాలుగు గుఱ్ఱాలను కట్టిన రథాన్ని సిద్ధం చేసి దారుకుడు తీసుకుని వచ్చాడు; సూర్యుడు ఉదయ పర్వతాన్ని ఆరోహించినట్లు, శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించాడు. అలా రథాన్ని ఎక్కిన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణుల ఆశీర్వచనాలు పొందాడు; పుణ్యాంగనలు తలమీద శుభాక్షతలు చల్లారు; వందిమాగధులు కైవారాలు చేసారు; స్తోత్ర పాఠకులు స్తుతించారు ఈవిధంగా ముకుందుడు ఆనందంగా ముందుకు సాగాడు; అప్పుడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=395

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...