Thursday, 9 July 2020

ఉషా పరిణయం - 36

( శివ కృష్ణులకు యుద్ధమగుట )

10.2-402-చ.
వరదుఁ డుదార భక్తజనవత్సలుఁడైన హరుండు బాణునిం
గర మనురక్తి నాత్మజులకంటె దయామతిఁ జూచుఁ గానఁ దా
దురమొనరించువేడ్క బ్రమథుల్‌ గుహుఁడున్ నిజభూతకోటియున్
సరస భజింప నుజ్జ్వల నిశాతభయంకరశూలహస్తుఁ డై.
10.2-403-సీ.
ఖరపుటాహతి రేఁగు ధరణీపరాగంబు;
పంకేరుహాప్తబింబంబుఁ బొదువ
విపులవాలాటోప విక్షేపజాత వా;
తాహతి వారివాహములు విరయఁ
గుఱుచ తిన్నని వాఁడికొమ్ములఁ జిమ్మిన;
బ్రహ్మాండభాండ కర్పరము వగుల
నలవోక ఖణి ఖణిల్లని ఱంకె వైచిన;
రోదసీకుహరంబు భేదిలంగ
10.2-403.1-తే.
గళ చలద్భర్మఘంటికా ఘణఘణప్ర
ఘోషమున దిక్తటంబు లాకులత నొంద
లీల నడతెంచు కలధౌతశైల మనఁగ
నుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలె.

భావము:
వరదుడు, ఉదారుడు, భక్తజనవత్సలుడు అయిన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్నకొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు. కనుక, బాణుని పక్షాన యుద్ధం చేయాడానికి ప్రమథులు, గుహుడూ, తన అనుచర భూతకోటి వెంటరాగా భయంకరమైన శూలాన్ని ధరించి బయలుదేరాడు. అలా విలాసంగా కదలివస్తున్న కైలాసపర్వతంలాగ మహోన్నతమైన నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు. నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి పైకిలేచిన దుమ్ము సూర్యబింబాన్ని క్రమ్మివేసింది; తోక కదలిక వలన పుట్టిన గాలిదెబ్బకు మేఘాలు చెదరిపోయాయి; వాడి కొమ్ముల ధాటికి బ్రహ్మాండభాండం బ్రద్దలయింది; ఖణిల్లని విలాసంగా వేసిన రంకెకు రోదసీకుహరం దద్దరిల్లింది; మెడలోని గంటల గణగణ ధ్వనులకు సర్వదిక్కులూ పెటపెటలాడాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=403

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...