Wednesday 15 July 2020

ఉషా పరిణయం - 44

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-419-చ.
శరకుముదంబు లుల్లసితచామర ఫేనము లాతపత్ర భా
సుర నవపుండరీకములు శోణితతోయము లస్థి సైకతో
త్కరము భుజాభుజంగమనికాయము కేశకలాప శైవల
స్ఫురణ రణాంగణం బమరెఁ బూరిత శోణనదంబు పోలికన్.
10.2-420-వ.
అట్టియెడ బాణుండు గట్టలుకం గృష్ణునిపైఁ దనరథంబుఁ బఱపించి, యఖర్వబాహాసహస్ర దుర్వారగర్వాటోప ప్రదీప్తుండై కదిసి.
10.2-421-మ.
ఒక యేనూఱు కరంబులన్ ధనువు లత్యుగ్రాకృతిం దాల్చి త
క్కక యొక్కొక్కట సాయకద్వయము వీఁకంబూన్చు నాలోన నం
దకహస్తుండు తదుగ్రచాపచయ విధ్వంసంబు గావించి కొం
జక తత్సారథిఁ గూలనేసి రథముం జక్కాడి శౌర్యోద్ధతిన్.

భావము:
బాణాలు కలువపూలుగా; చామరాలు నురుగు తెట్టెలుగా; గొడుగులు తెల్లతామరలుగా; రక్తము నీరుగా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; భుజాలు సర్పాలుగా; కేశాలు నాచుగా రణరంగం ఒక రక్తపుటేరులా ఆ సమయంలో భాసించింది. అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి, సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో, శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బాణాసురుడు తన ఐదువందల చేతులతో ఐదువందల ధనుస్సులను ధరించి తక్కిన ఐదువందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించబోతుంటే, అంతలోనే, శ్రీకృష్ణుడు అవక్రవిక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేసాడు; సంకోచించకుండా సారథిని సంహరించాడు; బాణుని రథాన్ని నుగ్గునుగ్గు గావించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=421

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 


No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...