Wednesday 29 July 2020

ఉషా పరిణయం - 58

( శివుడు కృష్ణుని స్తుతించుట ) 

10.2-446-క.
పురమున కేగి యుషా సుం
దరికిని ననిరుద్ధునకు ముదంబున భూషాం
బర దాసదాసికాజన
వరవస్తువితాన మొసఁగి వారని భక్తిన్.
10.2-447-క.
కనకరథంబున నిడుకొని
ఘనవైభవ మొప్పఁ గన్యకాయుక్తముగా
ననిరుద్ధుని గోవిందుం
డనుమోదింపంగ దెచ్చి యర్పించె నృపా!
10.2-448-ఉ.
అంత మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి య
త్యంతవిభూతిమై నిజబలావలితోఁ జనుదేర నా యుషా
కాంతుఁడు మున్నుగాఁ బటహ కాహళ తూర్య నినాద పూరితా
శాంతరుఁడై వెసం జనియె నాత్మ పురీముఖుఁడై ముదంబునన్.

భావము:
అటుపిమ్మట, బాణుడు తన నగరానికి వెళ్ళి ఉష అనిరుద్ధులకు సంతోషంతో వస్త్రాభరణాలను, దాసీజనులను, విలువైన వస్తువులను ఇచ్చాడు. ఓ పరీక్షిత్తు మహారాజా! బంగారురథం మీద ఉషా అనిరుద్ధులను ఎక్కించి, మిక్కిలి వైభవంతో తీసుకుని వచ్చి శ్రీకృష్ణుడు సంతోషించేలా అప్పగించాడు. ఆ తరువాత, మురాసురుని సంహరించిన కృష్ణుడు త్రిపురాసుర సంహారుడైన పరమ శివుని వద్ద సెలవు తీసుకుని, బాణాసురుడికి ఇక ఉండ మని చెప్పి. అత్యంత వైభవోపేతంగా పరివార సమేతుడై ఉషా అనిరుద్ధులను తీసుకుని పటహ, కాహాళ, తూర్యాదుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగుతుండగా ద్వారకానగరానికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=448

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...