Monday, 28 September 2020

శ్రీ కృష్ణ విజయము - 42

( కృష్ణుడు మథురను గనుట )

10.1-1250-వ.
అని మఱియు గోవింద సందర్శన కుతూహలంబునం బౌరసుందరులు పరస్పరాహూయమానలై భుంజానలై భోజన భాజనంబులు దలంగఁ ద్రోచియు, శయానలై లేచియు, నభ్యంజ్యమానలై జలంబులాడకయు, గురుజనశిక్ష్యమాణలై యోడకయు, గృహకార్య ప్రవర్తమానలై పరిభ్రమింపకయు, రమణరమమాణలై రమింపకయు, శిశుజన బిభ్రాణలై డించియు నలంకుర్వాణలై యన్యోన్య వస్త్రాభరణ మాల్యానులేపనంబులు వీడ్వడ ధరించియు నరిగి.
10.1-1251-క.
వీటఁ గల చేడె లెల్లను
హాటకమణిఘటిత తుంగ హర్మ్యాగ్రములం
గూటువలు గొనుచుఁ జూచిరి
పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్.

భావము:
అంటూ ఆ మథురానగర కాంతలు శ్రీకృష్ణుని చూడాలనే ఆసక్తి తోకూడిన తొందరలో ఒకరినొకరు పిలుచుకుంటూ, భోజనాలు చేసి, భోజనపాత్రలను మూలకి తోసేసి, పడుకుని లేచి, తలంటుస్నానాలుచేసి చేయక, పెద్దలు వారిస్తున్నా వినిపించుకోకుండా, ఇంటి పనులలో నిమగ్నలై మెసలకుండా, భర్తలను సేవించడంలో మనసు లగ్నం చేయకుండా, ఎత్తుకున్న బిడ్డలను దింపేసి, ఒండొరుల బట్టలు, ఆభరణాలు, పువ్వులు, గంధాలు అలంకారాలు చేసేసుకుని, అవి జారిపోతున్నా లెక్కచేయకుండా బయలుదేరిపోయారు. అలా కృష్ణసందర్శన వాంఛా తొందరలలో, ఆ పట్టణంలో ఉండే పడతులు అందరూ రత్నాలు, కూర్చిన ఎత్తయిన బంగారు మేడలపై గుంపులు గూడి, విశాలమైన వక్షము కలవాడూ తామరరేకుల వంటి కన్నులు కలవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి వీక్షించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1251

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...