Monday, 5 October 2020

శ్రీ కృష్ణ విజయము - 47

( రజకునివద్ద వస్త్రముల్గొనుట )

10.1-1263-క.
ఘోర కరాగ్రతలంబున
ధీరుఁడు కృష్ణుండు శిరము దెగిపడఁ గొట్టెం
బౌరుల గుండెలు పగులఁగ
వీరోద్రేకిన్ మదావివేకిన్ జాకిన్.
10.1-1264-వ.
అంత భగ్నశిరుం డైన రజకుం జూచి వానివారలు వెఱచి పటంబులు డించి పఱచిన రామకృష్ణులు వలసిన వస్త్రంబులు ధరియించి కొన్ని గోపకుల కొసంగి చనుచుండ.

భావము:
ఆ రజకుడు అలా బీరంతో రెచ్చిపోవడంతో, పొగరుబోతుతనంతో తెలివితప్పి మెలగడంతో, భయంకర మైన తన అరచేత్తో ధీరుడైన శ్రీకృష్ణుడు తల తెగిపడేలా కొట్టాడు. అది చూసిన నగరంలోని ప్రజల గుండెలు పగిలిపోయాయి. అలా నేలకూలిన రజకుని చూసిన వాడి మనుషులు బట్టలు అక్కడే వదిలేసి భయంతో పారిపోయారు. అప్పుడు బలరాముడు కృష్ణుడు తమకు కావలసిన బట్టలు కట్టుకుని, కొన్ని గోపకుల కిచ్చి ముందుకుసాగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=145&padyam=1264

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...